- హనుమకొండ బస్టాండ్ నుంచి నడవనున్న బస్సులు
- మహాలక్ష్మి స్కీం వర్తించేలా చర్యలు
హనుమకొండ, వెలుగు : మేడారం మహాజాతర కోసం స్పెషల్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ రెడీ అవుతోంది. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో.. భక్తులు ఇప్పటి నుంచి మేడారం వెళ్తూ ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో భక్తుల సౌకర్యార్థం హనుమకొండ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.
ఈ నెల 16న బస్సులు ప్రారంభం అవుతాయని, భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నామని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను శుక్రవారం ప్రకటించారు. హనుమకొండ నుంచి మేడారానికి ఉదయం 6.10 గంటల నుంచి రాత్రి 8.20 గంటల వరకు, మేడారం నుంచి హనుమకొండకు ఉదయం 5.45 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రత్యేక బస్సుల వివరాల కోసం హనుమకొండ బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారులు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారనిపేర్కొన్నారు. మేడారం వెళ్లే ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని ఆర్‌ఎం చెప్పారు. పల్లె వెలుగు సర్వీసుల్లో పెద్దలకు రూ.130, పిల్లలకు రూ.80, ఎక్స్‌ప్రెస్‌లో పెద్దలకు రూ.180, పిల్లలకు రూ.110 చార్జీ ఉంటుందని ఆర్ఎం వివరించారు.
