ప్రపంచ ఆదివాసీ ఆత్మగౌరవ జాతర సమ్మక్క, సారలక్క

ప్రపంచ ఆదివాసీ ఆత్మగౌరవ జాతర సమ్మక్క, సారలక్క

సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచ ఆదివాసీల ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటుతోంది.  ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటూ ప్రతి ఏటా వారి త్యాగాన్ని స్మరించుకుంటూ, వారి వీరోచిత త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. స్మరించుకుంటూ తమ ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు.

ప్రస్తుత జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతానికి చెందిన మేడరాజు వేటకు వెళ్లిన సందర్భంలో, అడవిలో క్రూర మృగాల వద్ద ఒక ఆడపిల్ల దొరికింది. ఆమెను మేడరాజు తీసుకువచ్చి పెంచి పెద్ద చేసి, తన మేనల్లుడు అయిన మేడారం ప్రాంతానికి చెందిన కోయరాజు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. పగిడిద్దరాజు కాకతీయులకు సామంతునిగా ఉంటూ మేడారం ప్రాంతానికి చెందిన ఆదివాసీ రాజ్యానికి రాజుగా ఉంటుండే వాడు.

పగిడిద్దరాజు, సమ్మక్క  దంపతులకు  సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణలో భాగంగా జగిత్యాల ప్రాంతానికి చెందిన పొలాసను పరిపాలిస్తున్న  మేడరాజు మీద కాకతీయ మొదటి ప్రతాపరుద్రుడు దండెత్తాడు. ఆ యుద్ధంలో విరోచితంగా మేడరాజు పోరాడాడు. కానీ,  ఎంతో అపారమైన యుద్ధ నైపుణ్యాలు కలిగిన కాకతీయ సైనికుల చేతిలో ఓడిపోయి, మేడరాజు తన మేనల్లుడు పగిడిద్ద రాజు వద్ద  మేడారం రాజ్యంలో ఆశ్రయాన్ని పొందాడు.

ప్రతాపరుద్రునితో యుద్ధంలో..
మేడారం రాజ్యంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయి. కాకతీయ రాజ్యానికి ప్రతి ఏటా కట్టే పన్ను, కరువు కాటకాల మూలంగా చెల్లించని పరిస్థితి  పగిడిద్దరాజుకు వచ్చింది.  అయితే,  ఇదేమీ పట్టించుకోకుండా  కాకతీయ రాజు  మొదటి ప్రతాపరుద్రుడు కచ్చితంగా తనకు పన్ను చెల్లించాల్సిందే అని పగిడిద్దరాజుకు హుకుం జారీ చేశాడు. 

ప్రతాప రుద్రుడు వినిపించుకోకుండా మేడారం ఆదివాసీ రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించాడు.  తప్పనిసరి పరిస్థితులలో  ఆదివాసీరాజు అయిన పగిడిద్దరాజు ఆనాడు మేడారం ప్రాంత ప్రజలతో  కలిసి  ఆదివాసీ  సంప్రదాయ యుద్ధ నైపుణ్యాలతో యుద్ధానికి  సిద్ధం అయ్యాడు.  

సంప్రదాయ ఆయుధాలను ధరించి పగిడిద్దరాజు,  మేడరాజు,  సమ్మక్క,  సారలక్క,  నాగమ్మ,  జంపన్న, గోవింద రాజు (పగిడిద్దరాజు అల్లుడు) మేడారం ప్రాంతంలో వేరు వేరు ప్రాంతాల నుంచి  కాకతీయ సైన్యాలను వీరోచితంగా ఎదుర్కొన్నారు. 

కాకతీయ సైనికులకు ఉన్న సైనిక శక్తి,  అధునాతన యుద్ధ సామగ్రి ఉన్నా సంప్రదాయ ఆయుధాలతో వీరోచితంగా  గెరిల్లా తరహాలో ఆనాడు పోరాడారు. వీరోచితంగా పోరాడుతూ యుద్ధభూమిలో మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు అమరత్వాన్ని పొందారు.

శత్రు సైన్యాలతో మరణం పొందడం  ఇష్టంలేక జంపన్న  సంపెంగ వాగులో దూకి తన  అమరత్వాన్ని ప్రకటించాడు. యుద్ధభూమిలో చివరిదాకా  సమ్మక్క  కాకతీయ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి వీరోచితంగా పోరాడింది. సమ్మక్క తన  చివరి రక్తపు బొట్టు వరకు కూడా పోరాడింది.

ఆదివాసీ పోరాటాలకు స్ఫూర్తిగా..
సమ్మక్క సారలక్క ఆదివాసీ బిడ్డల పోరాటం ప్రపంచ ఆదివాసీ గిరిజన తెగలలో ఇప్పటికీ ఒక చెరగని ముద్రను  వేశాయి. ఎన్నో ఆదివాసీ పోరాటాలకు సమ్మక్క,  సారలక్క  పోరాటం స్ఫూర్తిగా నిలుస్తున్నది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో జలియన్ వాలాబాగ్ ఘటనకు ఎంత ప్రాచుర్యం ఉందో  ప్రపంచ ఆదివాసీ పోరాటాల్లో మేడారానికి అంతకంటే ప్రాధాన్యత ఉంది.

మన దేశంలో ఆదివాసీ గిరిజన పోరాట యోధులు ఎవరు పోరాడినా ఒక సారూప్యత కనిపిస్తుంది.  కొమురం భీం, బిర్సాముండే , సమ్మక్క,  సారలక్క  ఆదివాసీ బిడ్డలు ఎందరో  తమ  ఆదివాసీ గిరిజన హక్కుల కోసం జల్, జంగల్, జమీన్ అంశాలను ముందుకు తీసుకువచ్చాయి.

ఇప్పటికీ కూడు, గూడు, గుడ్డ లేని దుస్థితేనా ?
ప్రపంచ ఆదివాసీ తెగలు వివిధ దేశాల నుంచి  వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.  వారి అమరత్వాన్ని ఎలుగెత్తి  చాటుతున్నారు. ప్రపంచ ఆదివాసీ గిరిజన బిడ్డల ఆత్మగౌరవాన్ని,  వారి అస్తిత్వాన్ని, వారి ప్రాంతాల సార్వభౌమ అధికారాన్ని వారికి  చెందే విధంగా, ప్రపంచ దేశాలు ఆలోచించాలి. అనేకచోట్ల ఇప్పటికీ ఆదివాసీ బిడ్డల మీద అనేకరకమైన దాడులు, అణచివేతలు కొనసాగుతున్నాయి.

ఆదివాసీ ప్రాంతాల్లో   తిండి, గూడు, గుడ్డ లేక ఇప్పటికీ వారి జీవన విధానం మనల్ని ప్రశ్నిస్తూనే ఉంది. ఆదివాసీ  బిడ్డల పరిస్థితులు గుర్తుకు వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మన అభివృద్ధి ఎక్కడుందో మనమంతా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి.

డాక్టర్ మల్లారం అర్జున్, సోషల్ యాక్టివిస్ట్