సిలిండర్లలో గంజాయి దాచి సప్లయ్

సిలిండర్లలో గంజాయి దాచి సప్లయ్
  •     ఏపీ నుంచి ఆగ్రాకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్
  •     65 కిలోల సరుకు స్వాధీనం

జీడిమెట్ల, వెలుగు : సీఎన్​జీ సిలిండర్లలో గంజాయి దాచి తరలిస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్​కు చెందిన నలుగురిని మేడ్చల్ ఎస్​వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను మేడ్చల్ డీసీపీ నిఖితా పంత్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. యూపీలోని అత్రాస్ జిల్లాకు చెందిన అరవింద్ చౌదరి ఓ మర్డర్ కేసులో జైలుకెళ్లి వచ్చాడు. ఈజీమనీకి అలవాటు పడ్డ అరవింద్ గంజాయిని సప్లయ్ చేయడం మొదలుపెట్టాడు. వైజాగ్​లో ఉన్న సప్లయర్ల దగ్గరి నుంచి గంజాయిని కొని వాటిని యూపీకి తరలించి అమ్మేవాడు. ఇటీవల అరవింద్.. 

మరో ముగ్గురు వ్యక్తులు అభిషేక్ తోమర్, ఆశిష్​ కుశ్వంత్, ఆకాష్​ సోలంకితో కలిసి వైజాగ్​కు వెళ్లి 65 కిలోల గంజాయిని కొన్నారు. దాన్ని సీఎన్​జీ సిలిండర్లలో దాచి రెండు కార్లలో పెట్టుకుని సిటీ మీదుగా ఆగ్రాకు బయలుదేరారు. ముందస్తు సమాచారం అందుకున్న మేడ్చల్ ఎస్ వోటీ పోలీసులు ఓఆర్ఆర్ వద్ద ఈ కార్లను ఆపి తనిఖీ చేశారు. సీఎన్​జీ సిలిండర్లు కనిపించడంతో వాటిని పరిశీలించారు. 

అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు. 65 కిలోల గంజాయితో పాటు రెండు కార్లు, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించారు.  

ఆటోలో గంజాయి తరలిస్తూ..

చందానగర్ : ఆటోలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 4.1 కిలోల గంజాయి, 2 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రాలోని అశోక్ నగర్ కు చెందిన బాదల్ రౌత్(24), విష్ణువర్ధన్ రెడ్డి(19) ఇద్దరు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు కొత్తగూడెం జిల్లా సీలేరు ప్రాంతానికి చెందిన విశ్వ నుంచి ఈ నెల 8న ఘట్ కేసర్ వద్ద గంజాయిని కొన్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలిలోని నల్లగండ్ల, గోపన్​పల్లి ఏరియాల్లో గంజాయిని అమ్మేందుకు ఆటోలో బయలుదేరారు.

సాయంత్రం 5 గంటలకు ఆటోలో నల్లగండ్ల సర్కిల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్న చందానగర్ పోలీసులను చూసి బాదల్, విష్ణువర్ధన్ ఆటోను వదిలి పారిపోయేందుకు యత్నించారు. అయితే, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి నుంచి 4.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 ఇంట్లో గంజాయి మొక్కలు.. ఇద్దరు అరెస్ట్

వేర్వేరు ఏరియాల్లో  ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్న ఇద్దరిని చందానగర్, బాలానగర్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ పరిధి గోపినగర్ కాలనీలో ఉండే ఎం. ఆనంద్(42) లేబర్ గా పనిచేస్తున్నాడు. ఆనంద్ తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్క పెంచుతున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చందానగర్​ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 5.5 ఫీట్ల పొడవున్న గంజాయి మొక్కను ఆనంద్ ఇంట్లో గుర్తించారు. 

దీని బరువు 600 గ్రాములు ఉంటుందన్నారు. ఆనంద్ ను అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేశారు. జగద్గిరిగుట్ట పరిధి భూదేవి హిల్స్ కు చెందిన దిలీప్ కుమార్ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. దిలీప్ కుమార్ ఇంట్లో గంజాయి మొక్క పెంచుతున్నట్లు సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ వోటీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు.