ఛీటింగ్: సింగరేణిలో ఉద్యోగం ఇస్తామని లక్షలు కొట్టేశారు..

ఛీటింగ్:  సింగరేణిలో ఉద్యోగం ఇస్తామని లక్షలు కొట్టేశారు..

 

  • సింగరేణిలో ఉద్యోగం పేరిట మోసం

  • దళారులకు రూ.14 లక్షలు ఇచ్చిన గిరిజన దంపతులు

  • మొదటి దళారీ చనిపోయాడని తెలియడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితులు

  • భార్య బంగారం అమ్మి, బంధుమిత్రుల వద్ద అప్పులు చేసి చెల్లింపులు

  • దళారీని బాధితుడికి పరిచయం చేసిన సహోద్యోగి పరార్

భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు, వెలుగు: సింగరేణిలో వారసత్వ  ఉద్యోగం ఇప్పిస్తామని రూ.15 లక్షలు తీసుకుని దళారులు మోసం చేయడంతో గిరిజన దంపలుతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండాకు చెందిన రత్నకుమార్  డిగ్రీ చదువుకోగా, అదే గ్రామానికి చెందిన అతని భార్య  పార్వతి  బీఈడీ చేసింది. 

వారు గతంలో  ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. ప్రస్తుతం చుంచుపల్లి మండలంలోని ఓ షాపింగ్​ మాల్​లో పనిచేస్తూ అక్కడే ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అదే  షాపింగ్​ మాల్​లో పనిచేస్తున్న రత్నకుమార్  సహోద్యోగి.. ‘‘సింగరేణిలో ఒక ఉద్యోగం ఉంది. నా దగ్గర  డబ్బులు లేవు. నీకు కావాలంటే ఇప్పిస్తా” అని రత్నకుమార్​ను ఓ  దళారి వద్దకు  తీసుకెళ్లాడు. అతను మరో దళారీని పరిచయం చేశాడు. త్వరలో రిటైర్​ కాబోతున్న ఒక సింగరేణి కార్మికుడికి  కొడుకులు లేరని, కూతుళ్లు సెటిల్​ అయ్యారని, ఆ ఉద్యోగి తన ఉద్యోగాన్ని  అమ్ముకునే ఆలోచనలో ఉన్నారని దళారులు రత్నకుమార్​కు  చెప్పారు. 

సదరు కార్మికుడిని మెడికల్​ బోర్డులో  అన్​ఫిట్​ చేయించి, అతని అల్లుడని చెప్పి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.16 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్  నుంచి ఆగస్టు వరకు పలు వాయిదాల్లో దళారులకు రత్నకుమార్  రూ.14 లక్షలు ఇచ్చాడు. మిగిలిన   రూ.2 లక్షలు ఉద్యోగంలో చేరిన తర్వాత ఇస్తానని దళారులతో మాట్లాడుకున్నాడు. రూ.14 లక్షలు ఇచ్చేందుకు రత్నకుమార్  తన భార్య బంగారం​ అమ్మాడు. తన సోదరుడు, బంధువులు, స్నేహితుల వద్ద కూడా అప్పులు చేశాడు. 

తనకు ఉద్యోగం ఖాయమని సంతోషంలో ఉండగా తన దగ్గర  డబ్బులు తీసుకున్న మొదటి దళారి చనిపోయినట్లు తెలియడంతో రత్నకుమార్  దంపతులు షాక్​ అయ్యారు. తమకు దళారిని పరిచయం చేసిన సహోద్యోగిని అడిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ వారిని బెదిరించాడు. దీంతో తనకు ఉద్యోగం రాదని రత్నకుమార్  ఆందోళనకు గురయ్యాడు. తెచ్చిన అప్పు ఎలా కట్టాలో తెలియక  సోమవారం భార్యతో కలిసి పురుగుల మందు తాగాడు. 

ఈ విషయాన్ని పార్వతి తన తమ్ముడికి ఫోన్​ చేసి చెప్పింది. అతడు వెంటనే చుంచుపల్లికి వెళ్లి వారిని కొత్తగూడెంలోని  ఓ ప్రైవేటు​ హాస్పిటల్​కు తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఖమ్మానికి, అక్కడి నుంచి హైదరాబాద్​కు తీసుకెళ్లారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. కాగా.. మొదటి దళారీని రత్నకుమార్ కు పరిచయం చేసిన సహోద్యోగి పరారీలో ఉన్నాడు. అలాగే మొదటి దళారీ చనిపోయాడని చెబుతున్నా ఆ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. బాధితుల నుంచి ఇంతవరకూ ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.