పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీలు

పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీలు

గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన నీతి అయోగ్

హైదరాబాద్, వెలుగు: పబ్లిక్, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ (పీపీపీ)లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి జిల్లా హాస్పిటళ్లను మెడికల్ కాలేజీలుగా మార్చుకోవచ్చునని రాష్ర్టాలకు కేంద్రం ఇంతకుముందే సూచించింది. ఇందుకు అనుగుణంగా నీతి ఆయోగ్ రూపొందించిన గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో మాత్రమే ఈ పద్ధతిలో కాలేజీల ఏర్పాటుకు అనుమతిస్తామని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఇలాంటి జిల్లాల్లోని డిస్ర్టిక్ట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను మెడికల్ కాలేజీకి అనుబంధంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించొచ్చు. అయితే మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్వహణ బాధ్యత, ఖర్చు కూడా ప్రైవేట్ వ్యక్తులే భరించాల్సి ఉంటుంది. దవాఖానలో అవుట్ పేషెంట్ సేవలు పూర్తిగా ఉచితంగానే అందించాల్సి ఉంటుంది. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో కనీసం 360 బెడ్లు అందుబాటులోకి తేవాలి. అదనంగా ఎన్ని బెడ్లయినా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిలో చేరే పేషెంట్లకూ పూర్తిగా ఉచితంగా వైద్యం అందించాలి. ఇవి అన్నీ నిండితే, ఆ తర్వాత చేరే పేషెంట్ల వద్ద చార్జీలు వసూలు చేసుకోవచ్చు. ప్రభుత్వం సూచించిన మేరకే చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను టీచింగ్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జిల్లా అవసరాన్ని బట్టి మొదటి ఐదేండ్లు హాస్పిటల్ నిర్వహణలో 25 శాతం చొప్పున కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు భరించేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్లు, స్టాఫ్ నియామకం, జీతాల చెల్లింపు బాధ్యత కూడా ప్రైవేట్ వ్యక్తులదేనని నీతి ఆయోగ్ పేర్కొంది. ఇలా ఏర్పడే ఒక్కో కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వనున్నారు.

మన రాష్ట్రంలో 17 జిల్లాల్లో ఏర్పాటుకు చాన్స్…

మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచేందుకు ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో జిల్లా హాస్పిటళ్లను మెడికల్ కాలేజీలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులను కూడా ఇందులో భాగస్వాములను చేస్తోంది. దీంతో డాక్టర్ల సంఖ్య పెరగడంతో పాటు మారుమూల జిల్లాల్లోని ప్రజలకు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం భావిస్తోంది. మన రాష్ర్టంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా,  17 జిల్లాల్లో ప్రభుత్వ/ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేవు. రాష్ర్ట సర్కార్ అంగీకరిస్తే ఈ జిల్లాల్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో కాలేజీల ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది.