
- మెడికల్ కాలేజీలో సంబురంగా ట్రెడిషనల్ డే
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడికోలు సాంప్రదాయ దినోత్సవం(ట్రెడిషనల్ డే) జరుపుకున్నారు. మెడికోలతో కలిసి కలెక్టర్ నృత్యం చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెడికోలు వైద్య విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని సూచించారు.
పట్టణాలు, నగరాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఈ అసమానతలను తగ్గించేందుకు ముందుకు రావాలని సూచించారు. మెడికోలు ఒత్తిడిని జయించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ రమాదేవి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘు, డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి పాల్గొన్నారు.