మేడిగడ్డ పిల్లర్.. రెండు ఫీట్లు కుంగింది

మేడిగడ్డ పిల్లర్.. రెండు ఫీట్లు కుంగింది
  • ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు 
  • 20వ నంబర్ పిల్లర్ కు పగుళ్లు.. 19, 21 నంబర్ పిల్లర్లపైనా ఎఫెక్ట్
  • బ్యారేజీకి రెండువైపులా పోలీసుల బందోబస్తు
  • అటువైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు
  • ఫౌండేషన్ టైమ్ లో రికార్డు కోసం స్పీడ్​గా పనులు.. అదే కొంప ముంచిందంటున్న నిపుణులు  
  • ఎంక్వైరీ తర్వాతే కారణాలు చెప్తం: ఈఎన్సీ 

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/మహదేవ‌‌పూర్‌‌,‌‌ వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ రెండు ఫీట్ల మేర కుంగిపోయింది. ఈ బ్యారేజీ 7వ బ్లాక్​లోని 20వ నంబర్‌‌‌‌ పిల్లర్‌‌‌‌ శనివారం రాత్రి ఫీటు మేర కిందికి కుంగగా, ఆదివారం మరో ఫీటు మేర కుంగింది. దీంతో దానికి ఇరువైపులా ఉన్న 19, 21వ పిల్లర్లపైనా ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బ్యారేజీకి ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 


బ్యారేజీ పైనుంచి శనివారం రాత్రి నుంచే రాకపోకలు బంద్ పెట్టిన పోలీసులు.. అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ వైపు బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారేజీ వైపు ఎవరూ వెళ్లకుండా పహారా కాస్తున్నారు. ఏం జరిగిందనేది తెల్లారితేనే క్లారిటీ వస్తుందని శనివారం రాత్రి ప్రకటించిన ఇరిగేషన్​ఆఫీసర్లు.. ఆదివారం సాయంత్రం వరకు అందుబాటులోకి రాలేదు. ఫోన్ లిఫ్ట్​చేయలేదు. బ్యారేజీ వద్దకు మీడియాను అనుమతించలేదు. అసలు ఏం జరిగిందనే దానిపై సమాచారం ఇవ్వలేదు. చివరకు రాత్రి అయ్యాక మంచిర్యాల ఈఎన్సీ బ్యారేజీ వద్దకు వచ్చారు. 

స్పీడ్ గా పనులు చేయడమే కారణమా? 

పోలవరం ప్రాజెక్ట్‌‌‌‌లో 24 గంటల్లో 16,368 క్యూబిక్‌‌‌‌ మీటర్ల సిమెంట్‌‌‌‌ కాంక్రీట్‌‌‌‌ పని చేసిఏపీ ‌‌‌‌ ఇంజనీరింగ్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌ దేశవ్యాప్తంగా రికార్డ్‌‌‌‌ నెలకొల్పింది. అలాగే ఓ షాపింగ్‌‌‌‌ మాల్‌‌‌‌ నిర్మాణంలో 64 గంటల్లో 20,400 క్యూబిక్‌‌‌‌ మీటర్ల సిమెంట్‌‌‌‌ కాంక్రీట్‌‌‌‌ పనులు చేసి దుబాయ్‌‌‌‌ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ రెండు రికార్డులను తిరగరాసేందుకు తెలంగాణ ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు.. మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్‌‌‌‌ పనులను ఎంచుకున్నారు. అయితే ‌‌నదిలో బ్యారేజీ నిర్మాణం సవాల్‌‌‌‌తో కూడుకున్నదని,  ఫౌండేషన్‌‌‌‌ సరిగ్గా లేకపోతే మొదటికే మోసం వస్తుందని, రికార్డు కోసం మేడిగడ్డను ఎంచుకోవడం కరెక్ట్​ కాదని ఎల్​అండ్​టీ ఇంజనీర్లు చెప్పినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి.

 కానీ కాళేశ్వరానికి దేశవ్యాప్త గుర్తింపు తేవాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు, ఎల్​అండ్​టీ ఇంజినీర్ల మెడపై కత్తి పెట్టి ఫౌండేషన్‌‌‌‌ పనులను రికార్డు టైమ్​లో చేయించింది. 2018 డిసెంబర్‌‌‌‌ 23న 24 గంటల్లో 16,722 క్యూబిక్‌‌‌‌ మీటర్ల సిమెంట్‌‌‌‌ కాంక్రీట్‌‌‌‌ పనులు చేయించి.. ఏపీ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. అప్పుడు ఫౌండేషన్‌‌‌‌ సమయంలోనే 7వ బ్లాక్‌‌‌‌లోని 20వ నంబర్‌‌‌‌ పిల్లర్‌‌‌‌ దగ్గర సమస్య ఉత్పన్నమైనట్లు అప్పట్లో కొందరు ఇంజనీర్లు లీక్​ఇచ్చారు. కానీ ఆ సమస్యను చిన్నదిగా చూపించి పరిష్కరించినట్లు పేర్కొన్నారు. నాలుగేండ్ల తర్వాత ఇప్పుడు అదే 20వ నంబర్‌‌‌‌ పిల్లర్‌‌‌‌ కారణంగా బ్యారేజీ భవిష్యత్‌‌‌‌ ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు. 

రోజురోజుకు కుంగుతున్న పిల్లర్..

మేడిగడ్డ బ్యారేజీకి మొత్తం 85 గేట్లు ఉన్నాయి. 7వ బ్లాక్‌‌‌‌లో 11 పిల్లర్లు ఉండగా, వీటిలో 20వ నంబర్‌‌‌‌ పిల్లర్‌‌‌‌ పగుళ్లు వచ్చి శనివారం రాత్రి  కుంగిపోయింది. దీంతో గేట్ల నుంచి సౌండ్‌‌‌‌ వచ్చింది. బ్యారేజీపై ఉన్న రోడ్డు షేప్ మారిపోవడంతో ఈ విషయం బయటపడింది. ఆదివారం బ్యారేజీపై ఉన్న రోడ్డును పరిశీలిస్తే రెండు ఫీట్ల వరకు కిందికి కుంగిపోయినట్లు తెలిసింది. శనివారం రాత్రి 9 ఇంచుల వరకు కుంగిన రోడ్డు.. ఆదివారం నాటికి ఇంకా కుంగిపోవడంతో 20వ పిల్లర్‌‌‌‌తో పాటు దానికి పక్కన ఉన్న 19, 21వ నంబర్‌‌‌‌ పిల్లర్లపైనా ప్రభావం పడినట్టు ప్రాజెక్టు ఇంజనీర్లు భావిస్తున్నారు. 

నది అడుగు భాగం నుంచి వంతెన పైభాగం వరకు ఏర్పాటు చేసిన గోడలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. పిల్లర్‌‌‌‌ మొదలుకుని రోడ్డు పైనా పగుళ్లు కనిపిస్తున్నాయి. పిల్లర్లు కుంగిపోవడం, వాటితో పాటే గేట్లు దిగిపోయినట్లు బయటకు లీకైన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గేటు దెబ్బతినడంతో పూర్తిస్థాయిలో మూతపడక నీరంతా లీకవుతోంది. వంతెన పైభాగంలో ఉన్న ఐరన్‌‌‌‌ బేస్​మధ్య ఖాళీలు ఏర్పడి వంగిపోయి కనిపిస్తోంది. కాగా, ఇసుక కొట్టుకపోతే పిల్లర్ మరింత భూమిలోకి కుంగే ప్రమాదం ఉందని ఆదివారం ఉదయం గేట్లను మూసేసి నీటి విడుదలను బంద్‌‌‌‌ చేశారు. సాయంత్రం 7వ బ్లాక్ లోని గేట్లను వదిలేసి, మిగతా చోట్ల గేట్లు ఓపెన్ చేసి నీటి విడుదల ప్రారంభించారు. 

ఎమ్మెల్యే శ్రీధర్‌‌‌‌బాబును అడ్డుకున్న పోలీసులు

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించడానికి ఆదివారం సాయంత్రం వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌‌‌‌బాబును పోలీసులు అంబట్‌‌‌‌పల్లి చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. బ్యారేజీ వద్దకు వెళ్లడానికి పర్మిషన్‌‌‌‌ లేదని చెప్పారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత పోలీసులు ఎమ్మెల్యేను బ్యారేజీ దగ్గరికి తీసుకెళ్లి దూరం నుంచే చూపించి వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌‌‌‌బాబు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తిగా ఇంజనీరింగ్ తప్పిదమన్నారు. ఈఎన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. నాణ్యత లేకుండా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేపట్టి ప్రజల సొమ్మును నీళ్లలో పోశారని ఫైర్​అయ్యారు. రీడిజైనింగ్ తప్పిదం, నాణ్యత లోపం వల్లనే బ్యారేజీ‌‌ కుంగిపోయిందన్నారు. ‘‘ఇటీవల బీఆర్ఎస్​పెద్ద లీడర్లంతా కాళేశ్వరం చూసి రావాలని  రాహుల్​గాంధీకి సూచించారు. ఇలాంటి కుంగిన బ్యారేజీను, నీళ్లల్లో మునిగిన మోటార్లను చూడడానికి మా జాతీయ నాయకుడు  రావాలా?’’ అని శ్రీధర్​బాబు ఎద్దేవా చేశారు.

విచారణ తర్వాతే కారణాలు చెప్పగలం: ఈఎన్సీ 

మంచిర్యాల ఈఎన్‌‌‌‌సీ వెంకటేశ్వర్లు ఆదివారం సాయంత్రం 6 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వచ్చారు. బ్యారేజీ కాంట్రాక్టు సంస్థ ఎల్అండ్ టీ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 20వ నంబర్ పిల్లర్​ఫీట్​మేర కుంగిపోయిందని ఈఎన్సీ ప్రకటించారు. ‘‘బ్యారేజీలో నీళ్లు ఉన్నందున ఇప్పుడే ఏమీ చెప్పలేం. త్వరలోనే ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తాం. ఇప్పటికే ఇంజనీరింగ్ టీమ్​తో పాటు ఎల్అండ్ టీ ఎక్స్​పర్ట్స్​టీమ్​వచ్చింది. నీటి నిల్వ తగ్గగానే ప్రమాదంపై విచారణ చేపడతాం. ప్రమాదం జరిగిన సమయంలో బ్యారేజీలో 10 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 20వ పిల్లర్​సమీప గేట్లను మూసి మిగతా గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నాం” అని తెలిపారు. బ్యారేజీ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు లోపించడం వల్లే ప్రమాదం జరిగిందా? అని మీడియా ప్రశ్నించగా.. ఈఎన్సీ సమాధానం చెప్పకుండా దాటవేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి వెళ్లిపోయారు. 

మీడియాను అనుమతించని పోలీసులు..


బ్యారేజీ కుంగిపోవడంతో శనివారం రాత్రి నుంచే తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్ పెట్టిన పోలీసులు.. ఆదివారం రెండువైపులా పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. బారికేడ్లతో రోడ్డును మూసేశారు. వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, కూలీలు కూడా వెళ్లడానికి పర్మిషన్‌‌‌‌ ఇవ్వలేదు. మీడియా ప్రతినిధులు బ్యారేజీ దగ్గరికి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి అనుమతించాలని కోరగా.. ఇరిగేషన్‌‌‌‌ ఈఎన్సీ అనుమతి ఉంటేనే పంపిస్తామని చెప్పారు. కానీ ఇంజనీర్లు ఎవరూ ఫోన్లు లిఫ్టు చేయలేదు. దీంతో వరంగల్‌‌‌‌, మంచిర్యాల లాంటి చోట్ల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులంతా గంటల కొద్దీ ఎండలోనే పడిగాపులు కాశారు. ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు వస్తే పర్మిషన్‌‌‌‌ తీసుకుని కుంగిన పిల్లర్ల వద్దకు వెళ్లి పరిశీలించి వస్తామని భావించినప్పటికీ, సాయంత్రం 6 గంటలు దాటినా ఈఎన్సీ స్థాయి ఆఫీసర్లు ఎవరూ రాలేదు.