టెక్నికల్ మిస్టేక్​ వల్లే మేడిగడ్డ డ్యామేజ్ : బోయినపల్లి వినోద్​కుమార్​

టెక్నికల్ మిస్టేక్​ వల్లే మేడిగడ్డ డ్యామేజ్ : బోయినపల్లి వినోద్​కుమార్​
  • ఇప్పటికిప్పుడు ప్రమాదమేమీ లేదని నిపుణులు చెప్పిన్రు
  • కాంగ్రెస్​ కు ఓటేస్తే మళ్లీ టార్చ్​ లైట్లు పట్టాల్సిందే
  • ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​కుమార్​

హనుమకొండ, వెలుగు : టెక్నికల్ మిస్టేక్​ వల్లే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్​డ్యామేజ్ అయ్యిందని, అయినా దానితో ఇమ్మిడియేట్​డేంజర్​ ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​కుమార్​ అన్నారు. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్​ గొప్పలు చెప్పుకుంటోందని, కానీ సీఎం కేసీఆర్​ నేతృత్వంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ తెచ్చామని స్పష్టం చేశారు. హనుమకొండ కాకతీయ కాలనీలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్​ అభ్యర్థి, ఎమ్మెల్యే వినయ్​భాస్కర్ తో కలిసి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు కాకతీయ కాలనీలోని ఆయన ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వినోద్​ కుమార్​ మాట్లాడారు. 2014లో అప్పటి కాంగ్రెస్​ సీఎం కిరణ్​కుమార్​ రెడ్డి తెలంగాణ వస్తే రాష్ట్రంలో కరెంట్ ఉండదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, ఇప్పుడు 3 గంటల కరెంట్ చాలని రేవంత్​ రెడ్డి ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఒకవేళ కాంగ్రెస్​కి ఓటేస్తే రైతులు మళ్లీ టార్చ్​లైట్లు పట్టుకుని పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ‘2014 నుంచి ఇప్పటి వరకు ఎక్కడా ఒక్క సెకండ్ కూడా కర్ఫ్యూ లేదు.144 సెక్షన్​ పెట్టలే.. మత కలహాలు జరగలే’ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జాబ్​రిక్రూట్​మెంట్స్​ చేయడం లేదన్నట్లుగా కాంగ్రెస్​.. యువతను పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1.33 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, అందులో 88 వేల ఉద్యోగాలకు పబ్లిక్​సర్వీస్ కమిషన్​ నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. కొంతమంది ఉద్యోగులు అవినీతికి పాల్పడడం వల్ల  వారిని అరెస్ట్ చేసి, మళ్లీ పరీక్షలు పెడుతున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఉద్యోగం ఇచ్చామని,  కాంగ్రెస్​కు అధికారమిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్​ ప్రభుత్వం గోదావరిపై ఎస్సారెస్పీ ప్రాజెక్ట్​ మాత్రమే  కట్టిందని, రాష్ట్రం వచ్చినంక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి, అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ, దుమ్ముగూడెం ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. మిషన్​ కాకతీయలో 44 వేల చెరువులు రిపేర్​చేశామని, రెండేండ్లు కరువొచ్చినా వ్యవసాయానికి ఇబ్బంది లేనంత గ్రౌండ్​ వాటర్ ​రాష్ట్రంలో ఉందన్నారు. కుడా చైర్మన్ సుందర్​ రాజు యాదవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు.