Meenakshi Chaudhary: జాన్ అబ్రహం 'ఫోర్స్ 3'లో మీనాక్షి చౌదరి.. యాక్షన్ రోల్‌లో ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ!

 Meenakshi Chaudhary: జాన్ అబ్రహం 'ఫోర్స్ 3'లో  మీనాక్షి చౌదరి.. యాక్షన్ రోల్‌లో ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ!

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'ఫోర్స్ 3'. ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో సాగే ఈ ఫ్రాంఛైజీ మూడో భాగంలో జాన్ అబ్రహంకు జోడీగా టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి మీనాక్షి చౌదరి నటించనుంది. ఇప్పుడు ఈ వార్త సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బాలీవుడ్‌కు మీనాక్షి చౌదరి ఎంట్రీ!

'లక్కీ భాస్కర్'  'గుంటూరు కారం', 'హిట్ 2',  'సంక్రాతికి వస్తున్నాం' వంటి తెలుగు చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది మీనాక్షి చౌదరి. ఇప్పుడు ఈ బ్యూటీ 'ఫోర్స్ 3' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. లేటెస్ట్ గా జాన్ అబ్రహం, దర్శకుడు భవ్ ధూలియా పలువురు నటీమణులను ఆడిషన్ చేసిన తర్వాత, మీనాక్షిని ప్రధాన పాత్రకు ఖరారు చేశారు. ఇందులో ఆమె పాత్ర కూడా జాన్ అబ్రహం తరహాలో యాక్షన్-ఓరియెంటెడ్ గా ఉంటుందని టాక్. అంతే కాదు ఇందుకోసం రాబోయే నెలల్లో ఆమె ఇంటెన్సివ్ యాక్షన్ ట్రైనింగ్ తీసుకోనుందని చిత్ర యూనిట్‌కు దగ్గరగా ఉన్న వర్గాలు వెల్లడించాయి.

ALSO READ : సూపర్ హిట్ సీక్వెల్ ‘లోక చాప్టర్ 2’ అనౌన్స్..

నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన  ప్రీ-ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జాన్ అబ్రహం, రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాకేష్ మారియా బయోపిక్' షూటింగ్‌ను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే, నవంబర్ నెలలో 'ఫోర్స్ 3' చిత్రీకరణను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను 2026 ప్రథమార్థంలో విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు.

ఫ్రాంఛైజీ విశేషాలు

'ఫోర్స్' ఫ్రాంఛైజీ 2011లో దివంగత నిషికాంత్ కామత్ దర్శకత్వంలో ప్రారంభమైంది. ఇందులో జాన్ అబ్రహం ACP యశ్వర్థన్ సింగ్‌గా కనిపించి, తన పవర్‌ఫుల్ బాడీతో యాక్షన్ హీరోగా కొత్త అవతారాన్ని చూపించాడు. ఆ తర్వాత 2016లో వచ్చిన 'ఫోర్స్ 2'కు అభినయ్ దేవ దర్శకత్వం వహించారు. ఇందులో సోనాక్షి సిన్హా, తాహిర్ రాజ్ భాసిన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సీక్వెల్ కూడా అభిమానుల నుంచి మంచి స్పందనను రాబట్టింది. 'ఖాకీ: ది బీహార్ ఛాప్టర్', 'ది ఫ్రీలాన్సర్' వంటి వెబ్ సిరీస్‌లతో మెప్పించిన భవ్ ధూలియా 'ఫోర్స్ 3'కి దర్శకత్వం వహించనున్నారు.

'ఫోర్స్' సిరీస్‌కు అసలైన వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి, జాన్ అబ్రహం ఈ ఫ్రాంఛైజీ హక్కులను నిర్మాత విపుల్ షా నుంచి తీసుకున్నారు. సినిమా కథ, కథనంలో జాన్ కూడా పాలుపంచుకుంటూ, దేశీయ కోణంలో గ్రిప్పింగ్ యాక్షన్‌ను అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జాన్ అబ్రహం ఇటీవల మంజుషీ చిల్లర్‌తో కలిసి నటించిన 'తెహ్రాన్' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. గూఢచారి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం, జాన్ కెరీర్‌లో మరో యాక్షన్ మైలురాయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో, 'ఫోర్స్ 3'పై అంచనాలు మరింత పెరిగాయి. జాన్ అబ్రహం కండలు, మీనాక్షి చౌదరి యాక్షన్ కలగలిసి 'ఫోర్స్ 3' తెరపై ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలంటే 2026 వరకు వేచి చూడాల్సిందే..