బల్దియా రాసిన లెటర్లను సైతం పట్టించుకోని మీ సేవ కమిషనర్

బల్దియా రాసిన లెటర్లను సైతం పట్టించుకోని మీ సేవ కమిషనర్

హైదరాబాద్, వెలుగు: నకిలీవిగా పేర్కొంటూ జీహెచ్ఎంసీ ఇటీవల 25 వేల బర్త్, డెత్ సర్టిఫికెట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. మీసేవా కేంద్రాల నిర్లక్ష్యంతోనే ఈ సర్టిఫికెట్లు జారీ అయినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ఆర్డీవో ప్రొసీడింగ్​లు ఆలస్యమవుతుండటంతో బల్దియా సిబ్బంది సహకారంతో మీసేవా కేంద్రాల నిర్వాహకులు ఇలా అడ్డదారిలో సర్టిఫికెట్లను పొందారు. అయితే  ఈ అంశంపై ఇప్పటికే మూడు సార్లు మీసేవా కమిషనర్​కు  జీహెచ్ఎంసీ కమిషనర్ లెటర్లు రాసినా పెద్దగా పట్టించుకోలేదు. కేవలం 8 మంది మీసేవా కేంద్రాల ఆపరేటర్లపై చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారే తప్ప పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదు.

మాయ చేసిన సాఫ్ట్​వేర్​

‘ఇన్​స్టంట్’ అనే  కొత్త సాఫ్ట్​వేర్ గతేడాది మార్చిలో అందుబాటులోకి రాగా.. ఈ సాఫ్ట్ వేర్ ​సాయంతో మీసేవా కేంద్రాల నిర్వహకులు చేసిన ఎన్​ఏసీ దరఖాస్తులు అప్​లోడ్​అయ్యాయి. అన్నీ అప్​లోడ్ అయ్యాక దానంతట అదే సర్టిఫికెట్ జనరేట్ అయ్యేది. దీనివల్లనే భారీ సంఖ్యలో ఫేక్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు అధికారులు గుర్తించారు. తేరుకున్న అధికారులు సర్టిఫికెట్లను రద్దు చేసిన తర్వాత ఆ సాఫ్ట్​వేర్​లో పలు మార్పులు చేశారు. ఇప్పుడు ఎన్​ఏసీ కింద వచ్చే దరఖాస్తులను అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ (ఏఎంఓహెచ్) పరిశీలించిన తర్వాతే జారీ అవుతున్నాయి. ఎన్​ఏసీ దరఖాస్తులు వచ్చిన వారంలోపు వీరు చెక్ చేసిన అన్ని సరిగ్గా ఉంటే అప్రూవ్​చేయాలి. లేకపోతే రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. వారంలోపు చేయకపోతే హెడ్డాఫీసులో ఉన్నతాధికారుల వద్దకు ఆ దరఖాస్తు వెళ్లనుంది. ఇక సర్టిఫికెట్లు రద్దయిన వారు తిరిగి ఆర్డీవో ప్రొసీడింగ్స్​తో దరఖాస్తు చేసుకుంటే వారికి సర్టిఫికెట్లు అందించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది. పుట్టిన లేదా చనిపోయిన ఏడాది లోపు అయితే నేరుగా సర్టిఫికెట్లు పొందవచ్చు. ఆలస్యమైతే ఆర్డీవో ప్రొసీడింగ్ తీసుకొని నాన్ అవేలబిలిటీ సర్టిఫికెట్(ఎన్​ఏసీ) కింద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. 

నేటి నుంచి విజిలెన్స్ విచారణ?

బర్త్, డెత్ సర్టిఫికెట్లపై దుమారం లేవడం,ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్లతో పాటు విజిలెన్స్ విచారణ జరపాలని  బీజేపీ కార్పొరేటర్లు కమిషనర్​కు లెటర్లు రాశారు. దీంతో బల్దియా  కమిషనర్ విజిలెన్స్ విచారణకు అదేశించనున్నట్లు సమాచారం. మంగళవారం హోలీ సందర్భంగా హాలిడే కావడంతో బుధవారం నుంచి జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు విచారణ జరిపే అవకాశం ఉంది.   

సీబీఐ విచారణ జరపాలి: ఎమ్మెల్యే రాజాసింగ్ 

ఫేక్ బర్త్ సర్టిఫికెట్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. సరైన ఆధారాలు లేవని, తెల్ల పేపర్ పెట్టి బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించి వాటిని తొలగించామని అధికారులు చెబుతున్నారని, ఇల్లీగల్​గా ఇన్ని సర్టిఫికెట్లు ఎలా తయారయ్యాయో చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. రద్దు చేసిన వాటిలో పాతబస్తీకి చెందినవే ఉన్నాయని, దీని వెనుక ఎంఐఎం కుట్ర ఉందని ఆరోపించారు. వీరిలో ఎంతమంది టెర్రరిస్టులో తేల్చాలని డిమాండ్ ​చేశారు. ఈ కుట్రపై సీబీఐ ఎంక్వయిరీ చేయాలన్నారు. ఇవే కాకుండా ఇంకా ఎన్ని అక్రమ రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఉన్నాయో కూడా తేల్చాలన్నారు.