పాకిస్థాన్‌కు కొట్టినట్టుగా జవాబు.. ఎవరీ స్నేహా దూబే?

V6 Velugu Posted on Sep 25, 2021

న్యూఢిల్లీ: కశ్మీర్ గురించి ఐక్య రాజ్య సమితిలో నోరెత్తిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు గట్టి కౌంటర్‌‌ ఇచ్చారు యంగ్ ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ స్నేహా దూబే. ‘‘కశ్మీర్ అంశం భారత్ అంతర్గత విషయం. ఉగ్రవాదాన్ని పోషించడమే పాలసీగా పెట్టుకున్న పాకిస్థాన్‌.. తమను తాము తగలబెట్టుకుంటూ ప్రపంచాన్ని తగలబెడుతూ పైకి మాత్రం ‘ఫైర్‌‌ ఫైటర్‌‌’లా చెప్పుకుంటోంది. టెర్రరిస్టులను పోషించడంలో ఆ దేశానికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం, ట్రైనింగ్, ఆర్థిక సాయం, ఆయుధాలు సప్లై చేయడం లాంటివి పాక్ ప్రభుత్వ పాలసీగా పెట్టుకుంది. బిన్‌ లాడెన్‌ లాంటి టెర్రరిస్టులను అమర వీరుడంటూ కీర్తించిన దేశం పాకిస్థాన్‌” అంటూ పాక్‌ను కడిగేశారు స్నేహా దూబే. ‘‘భారత్ పొరుగు దేశాలతో ఎప్పుడూ మంచి సంబంధాలనే కోరుకుంటోంది. కానీ పాక్‌ ముందుగా టెర్రరిజాన్ని అణచి వేసేందుకు గట్టి చర్యలు తీసుకుని.. దానిని రుజువు చేసుకుంటే తప్ప నమ్మే పరిస్థితి లేదు. జమ్మూ కశ్మీర్‌‌, లఢఖ్‌.. పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా మొత్తం భారత్‌లో అంతర్భాగం. అక్రమంగా మీ చేతిలో పెట్టుకున్న భూభాగాల నుంచి తక్షణం వెనక్కి వెళ్లిపో పాక్‌” అంటూ దాయాది దేశానికి ఆమె వార్నింగ్ ఇచ్చారు. 

ఎవరీ స్నేహా?

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలను తిప్పికొడుతూ యూఎన్‌ జనరల్ అసెంబ్లీలో స్నేహా దూబే చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. పాకిస్థాన్ నిజ స్వరూపాన్ని బయటపెడుతూ.. తొణుకు బెణుకు లేకుండా మాట్లాడిన తీరుకు ఎవరీ స్నేహా.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటన్న దానిపై చాలా మందికి ఆసక్తికి కలిగించింది. ఆమె వివరాలు ఓసారి చూద్దాం..

స్నేహా దూబే.. ఐక్య రాజ్యసమితిలో ఇండియా ఫస్ట్ సెక్రెటరీగా విధులు నిర్వర్తిస్తున్న 2012 ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ ఆమె. పుట్టి పెరిగిందంతా గోవాలోనే. ప్రాథమిక విద్యను గోవాలో పూర్తి చేశారు. పూణేలో డిగ్రీ చదివారు. ఢిల్లీ జవహర్‌‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్నేహా దూబే ఎంఏ (జాగ్రఫీ), ఎంఫిల్ చదివారు.  2011లో తొలిసారి యూపీఎస్సీ పరీక్ష రాసినా సక్సెస్ అయ్యారు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ క్లియర్ చేసిన ఆమె.. ఐఎఫ్‌ఎస్‌ (ఇండియన్ ఫారెన్ సర్వీసెస్) ట్రైనింగ్ పూర్తయ్యాక భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చేరారు. 2014లో మాడ్రిడ్‌లోని ఎంబసీలో భారత్‌ థర్డ్‌ సెక్రెటరీ అయ్యారు. ప్రస్తుతం ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత్ ఫస్ట్ సెక్రెటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయ అంశాలపై తనకు చాలా ఆసక్తి అని, ఐఎఫ్‌ఎస్‌లో చేరాలన్నది తన కల అని.. స్నేహా దూబే సివిల్స్ ర్యాంక్ కొట్టాక ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు. అందుకే ఢిల్లీ జేఎన్‌యూలోని స్కూల్‌ ఆఫ్​ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఎంఫిల్‌ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

బుద్ధి మార్చుకోని పాక్‌.. తిప్పికొట్టిన భారత్

ప్రజల మంచి కోసం తాలిబాన్లకు అండగా నిలుద్దాం: ఇమ్రాన్

నేను మగాడినే..  అయితే ఏంటి!: తాప్సీ

Tagged Pakistan, Imran Khan, IFS officer, Sneha Dubey

Latest Videos

Subscribe Now

More News