బెలూన్స్​తో మోడలింగ్​ ఛాన్స్​

బెలూన్స్​తో మోడలింగ్​ ఛాన్స్​

ఫొటోలు అయినా, వీడియోలు అయినా కొత్తగా, అట్రాక్టివ్​గా ఉంటే చాలు... క్షణాల్లో సోషల్​మీడియాలో వైరల్​ అవుతాయి. అలానే ఈ అమ్మాయి ఫొటోలు కూడా వైరల్​ అవుతున్నాయి. ఒక ఫొటోలో  లైటింగ్​ బెలూన్స్​ పట్టుకొని అమాయకంగా...  మరో ఫొటోలో నగలు పెట్టుకొని అచ్చం మోడల్​లా ఉన్న ఈ అమ్మాయి పేరు కిస్బో మోల్​. కేరళలో ఉంటోంది. సొంత రాష్ట్రం రాజస్తాన్. బతుకుదెరువు కోసం కేరళకు వలస వచ్చిన కుటుంబాల్లో ఈమె ఫ్యామిలీ ఒకటి. ఈ అమ్మాయి చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు. అప్పటినుంచి తల్లితో కలిసి ట్రాఫిక్​ సిగ్నళ్ల దగ్గర, పండుగలు, జాతర్ల టైమ్​లో దేవాలయాల దగ్గర లైటింగ్​ బెలూన్స్, బొమ్మలు​ అమ్మేది. ఎప్పటిలానే  కొన్ని రోజుల కిందట కన్నూర్​లో జరిగే అండలూర్​ కావు ఫెస్టివల్​లో  బెలూన్స్​ అమ్మేందుకు వెళ్లింది కిస్బో. 

లైఫ్​ టర్న్​ అయిందిలా
గుడి దగ్గర బెలూన్స్​ అమ్ముతున్న కిస్బోని  పయ్యనూర్​కి చెందిన  వెడ్డింగ్​ ఫొటోగ్రాఫర్​ అర్జున్​ చూశాడు. లైటింగ్​ బెలూన్స్​ వెలుగులో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ అమ్మాయిని చూడగానే ఆమె ఫొటో అద్భుతంగా వస్తుంది అనిపించింది అర్జున్​కి. ఆలస్యం చేయకుండా కెమెరా తీసి, ఫొటో తీసేందుకు రెడీ అయ్యాడు. ఆమె కూడా కెమెరా వైపు కన్నార్పకుండా చూసింది. దాంతో అర్జున్​ అనుకున్నట్టుగానే ఫొటో చాలా బాగా వచ్చింది.  ఆ ఫొటోని కిస్బోకి, వాళ్ల అమ్మకి చూపించాడు. ‘బాగా వచ్చింద’ని మురిసిపోయారు ఇద్దరు. కానీ,  మనసులో మాత్రం ‘ఫొటోతో మాకు ఏం లాభం?  బుగ్గలు కొంటే కొన్ని డబ్బులు వచ్చేవి’ అనుకున్నారు ఆ తల్లీకూతుళ్లు. కానీ, ఆ ఫొటోనే తనకి కొత్త జీవితాన్ని ఇస్తుందని కిస్బో ఊహించలేదు. రెండు రోజుల తర్వాత కిస్బో ఫొటోల్ని అర్జున్​ ఇన్​స్టాగ్రామ్​లో పెట్టాడు. ఆ ఫొటోలు చూసినవాళ్లంతా ఆమెతో ‘మేకోవర్​ ఫొటోసెషన్’​ చేయమని చెప్పారు అర్జున్​కి. దాంతో, అతను  బ్యూటీ సెలూన్​ నడిపే రెమ్యాకి కిస్బోని పరిచయం చేశాడు. ఆమె కిస్బోకి మేకప్​ వేసి, నగలు పెట్టి, కేరళ సంప్రదాయ చీరకట్టి అచ్చం మలయాళీలా రెడీ చేసింది. చేతిలో పూల బుట్టతో, అందంగా నవ్వుతూ ఉన్న కిస్బో ‘మేకోవర్​ ఫొటోసెషన్’ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్​లో వైరల్ అవుతున్నాయి. దాంతో కిస్బోకి మోడల్​గా ఆఫర్స్ వస్తున్నాయి. 

చదువుకి సాయం చేయాలని 
ఒక్క ఫొటోతో సోషల్​ మీడియా సెన్సేషన్​ అవడం కిస్బోకి చాలా సంతోషంగా ఉంది. ఆమె తల్లి  తన కూతురి ఫ్యూచర్​ బాగుండాలి అనుకుంటోంది. ‘‘నా కూతురు నాలా కష్టపడకూడదు. పెద్దయ్యాక కూడా బుగ్గలు అమ్ముకుంటూ బతకొద్దు. బాగా చదువుకుని తన కాళ్ల మీద తాను నిలబడితే చూడాలని ఉంది. నా బిడ్డ చదువుకి సాయం చేయండి” అని అందరినీ అడుగుతోంది కిస్బో తల్లి.