అంతరిక్షంలోకి తెలుగమ్మాయి

అంతరిక్షంలోకి తెలుగమ్మాయి

కాలిఫోర్నియా: అంతరిక్షయానంలో తొలిసారిగా ఓ తెలుగు పేరు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 11న తమ అంతరిక్షవాహక నౌక యూనిటీ-22ను ప్రయోగించనున్నట్లు ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ప్రకటించింది. ఆ సంస్థ అధినేత సర్ రిచర్డ్ బ్రోన్సన్​తోపాటు మరో ముగ్గురు అంతరిక్షంలో ప్రయాణించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ బృందంలో తెలుగు మూలాలు ఉన్న శిరీష బండ్ల వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు మూలాలున్న మహిళగా శిరీష చరిత్ర సృష్టించనున్నారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన శిరీష కుటుంబం వాషింగ్టన్​లో స్థిరపడ్డారు. అక్కడే ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్​లో శిరీష పట్టభద్రురాలు అయ్యారు. జార్జ్ వాషింగ్టన్ వర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత 2015 నుంచి వర్జిన్ గెలాక్టిక్​లో పలు కీలక బాధ్యతలను శిరీష నిర్వహిస్తున్నారు.