సంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులు

 సంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రకు పలు షరతులు విధిస్తూ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్‌‌ విజయ్‌‌సేన్‌‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో సభ పెట్టుకోవచ్చని తెలిపారు. బండి సంజయ్​ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌‌రెడ్డి  లంచ్‌‌ మోషన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేయగా.. కోర్టు విచారణ జరిపింది.

‘‘భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహించాలి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సభ జరగాలి. పాదయాత్ర భైంసా మీదుగా వెళ్లకూడదు. పాదయాత్ర రూట్‌‌మ్యాప్‌‌ ముందుగా పోలీసులకు ఇవ్వాలి. మతానికి సంబంధించి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి నినాదాలు చేకూడదు. అభ్యంతరకర ప్రసంగాలు చేయొద్దు.

కట్టెలు వంటివి పట్టుకుని యాత్రలో పాల్గొనకూడదు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. ప్రజల ఆస్తులకు నష్టం జరిగితే పిటిషనర్‌‌ పార్టీదే బాధ్యత. ఏ కారణంగానైనా సభ రద్దయితే ఆ తర్వాత రోజు సభ నిర్వహిస్తే ఇవే షరతులు వర్తిస్తాయి” అని పేర్కొంది. అత్యంత సమస్యాత్మక ప్రాంతమని చెప్పే చార్మినార్‌‌ వద్దే బీజేపీ సభ పెట్టి ప్రశాంతంగా నిర్వహించిందని పిటిషనర్‌‌ తరఫు  సీనియర్‌‌ అడ్వకేట్​ఎన్‌‌. రామచందర్‌‌రావు తెలిపారు.

అలాంటిది భైంసాలో ఇబ్బందులు వస్తాయని పాదయాత్రను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. యాత్ర సందర్భంగా బందోబస్తు చేయడం పోలీసుల విధి అని చెప్పారు. ఈ సందర్భంలో కలుగజేసుకున్న జడ్జి.. సభా వేదికను వేరే ప్రాంతానికి మార్చుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రజలు కూడా తరలివస్తున్నారని రామచందర్‌‌రావు సమాధానమిచ్చారు. అసలు పోలీసులే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఇచ్చారని అన్నారు.

ఇప్పుడు మార్చాలని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. కాగా, గతంలో భైంసాలో పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో యాత్రకు అనుమతి ఇవ్వడం సరికాదని అదనపు అడ్వకేట్‌‌ జనరల్‌‌(ఏఏజీ) రామచంద్రరావు అన్నారు. దీని కారణంగా మళ్లీ ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. వాదనలు విన్న జడ్జి.. ప్రజా సంగ్రామ యాత్రకు షరతులతో అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.