
- సీఎంతో వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అభివృద్ధి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించింది. ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టిన్ రైజర్ నేతృత్వంలో ఆపరేషన్ హెడ్ పాల్ ప్రోసీ, అర్బన్ ఇన్‌ఫ్రా, ప్రాజెక్ట్ లీడ్ నటాలియా కే, డిజిటల్ డెవలప్‌మెంట్ సీనియర్ స్పెషలిస్ట్ మహిమాపత్ రే శనివారం హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా, వైద్య, సాగు నీటి రంగాలను తమ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని, ఆయా రంగాల్లో తాము తీసుకుంటున్న చర్యలను రేవంత్ రెడ్డి వారికి వివరించారు. తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని మార్టిన్ రైజర్ వెల్లడించారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.