హుస్నాబాద్​లో మెగా జాబ్​ మేళా

హుస్నాబాద్​లో మెగా జాబ్​ మేళా
  • తరలివచ్చిన అరవైకి పైగా కంపెనీలు
  • 8795 మంది రిజిస్ట్రేషన్​
  • 1310 మందికి స్పాట్​లోనే అపాయింట్​మెంట్ ​లెటర్స్​  
  • 3887 మందికి ట్రైనింగ్​ తర్వాత జాబ్స్​

హుస్నాబాద్​, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మంత్రి పొన్నం ప్రభాకర్​ చొరవతో, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్​మేళా గ్రాండ్​ సక్సెస్​అయ్యింది. ధృవ్​ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో అరవైకి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు అభ్యర్థులను సెలక్ట్​ చేసుకున్నాయి. 8,795 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా దేశ, విదేశాల్లోని వివిధ కంపెనీల ప్రతినిధులు 5,225 మంది విద్యార్హతలు, నైపుణ్యాలను పరిశీలించారు. ఇందులో వారికి అవసరమైన1,310 మందికి స్పాట్​లోనే అపాయింట్​మెంట్​ లెటర్స్​ ఇచ్చారు.

మరో 3,887 మందిని షార్ట్ లిస్టులో ఉంచారు. వీరికి స్కిల్స్ నేర్పించిన తర్వాత ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. హుస్నాబాద్​లో మొదటిసారి నిర్వహించిన జాబ్​మేళా ద్వారా ఉద్యోగాలు పొందినవారికి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మనుచౌదరితో కలిసి అపాయింట్​మెంట్ ​లెటర్స్​ అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ హుస్నాబాద్​లో సెట్విన్​ ట్రైనింగ్ ఇచ్చి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నర్సింగ్, ఫార్మసీ చదివిన వారికి అపోలో, యశోద, కామినేని హాస్పిటల్స్​తో పాటు ఇతర ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు దక్కేలా జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు.

భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్​లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొందరు విద్యార్థులకు సీట్లు వచ్చినట్టు తెలిసిందని, వారికి అవసరమైన ఫీజులను తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్​పర్సన్​ ఆకుల రజిత, వైస్​చైర్​పర్సన్​ అయిలేని అనిత, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ​పాల్గొన్నారు.