''గాడ్ ఫాదర్'' వైవిధ్యమైన పాత్రలు చేసే ఉత్సాహాన్నిచ్చింది: చిరు

''గాడ్ ఫాదర్'' వైవిధ్యమైన పాత్రలు చేసే ఉత్సాహాన్నిచ్చింది: చిరు

మెగాస్టార్ చిరంజీవి నటించిన  ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్’. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమయ్యారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి  ''గాడ్ ఫాదర్'' గ్రాండ్ సక్సెస్ ని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు. 

మీ జీవితంలో చాలా విజయాలు , బ్లాక్ బస్టర్స్ చూశారు.. గాడ్ ఫాదర్ విజయం ఎంత ప్రత్యేకమైనది? 

సినిమాను సమిష్టి కృషి అని నమ్ముతాను. ఒక విజయం వెనుక సమిష్టి కృషి ఉంటుంది. అందుకే ఒక విజయం కేవలం నాది మాత్రమే అనుకోను. ఏప్రిల్లో వచ్చిన చిత్రం నిరాశ పరిచింది. దానికి చేయాల్సిన ధర్మం చేశాను. అది చెప్పుకుంటే చిన్నదైపోతుంది. చాలా పెద్ద మొత్తం నాది కాదని వదిలేశాను. రామ్ చరణ్ కూడా వదిలేశాడు. నేను వదులుకున్నది బయ్యర్లని కాపాడుతుందనే సంతృప్తి నన్ను కుంగిపోకుండా చేసింది. అలాగే గాడ్ ఫాదర్ విజయం కేవలం నాదే అనుకోను. గాడ్ ఫాదర్ విజయం సమిష్టి కృషి. లూసిఫర్ చూసినప్పుడు అలాంటి పాత్రలు చేసి యాక్సెప్టెన్సీ తెచ్చుకోగలిగితే మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు చేసే అవకాశం ఉంటుందనే ఆలోచన ఉండేది. చరణ్ బాబు ఒక రోజు లూసిఫర్ ప్రస్తావన తీసుకొచ్చారు. దర్శకుడు సుకుమార్ చిన్న చిన్న మార్పులు చేస్తే లూసిఫర్ నాకు పర్ఫెక్ట్ గా  సెట్ అవుతుందని చెప్పారట. చరణ్ చెప్పిన తర్వాత మరోసారి లూసిఫర్ చూశాను. సుకుమార్ ఐడియా ఇచ్చారు కానీ తర్వాత అందుబాటులో వుండలేదు (నవ్వుతూ). తర్వాత ఒకరిద్దరు  దర్శకులతో చర్చలు జరిపాం. ఒక రోజు చరణ్ బాబు దర్శకుడు మోహన్ రాజా పేరు చెప్పారు. తని వరువన్ ను అద్భుతంగా తీసిన దర్శకుడు మోహన్ రాజా. లూసిఫర్ రీమేక్ మోహన్ రాజా న్యాయం చేస్తాడనే నమ్మకం కలిగింది. మోహన్ రాజాకు కూడా ఇది ఇష్టమైన సబ్జెక్ట్ కావడంతో చేస్తానని ఉత్సాహంగా చెప్పారు. రచయిత సత్యనంద్తో కూర్చుని చక్కని మార్పులు చేర్పులు చేసి గాడ్ ఫాదర్ ను అద్భుతంగా మలిచారు. 

గాడ్ ఫాదర్ చూసి ఇండస్ట్రీ మిత్రులు ఎలా స్పందించారు? 

నాగార్జున, వెంకటేష్.. ఇలా దాదాపు అందరూ కాల్ చేసిన మాట్లాడారు. దర్శకులు, మిత్రులు అభినందనలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. 

సాంగ్స్ , డ్యాన్స్లు లేవు కదా.. అభిమానుల నుండి ఎలాంటి స్పందన ఉంది? 

పవర్ ఫుల్ సబ్జెక్ట్ ఇది. ఇలాంటి సబ్జెక్ట్లు చేస్తే బాగుంటుందనే మాటే తప్ప సాంగ్స్ , డ్యాన్స్లు లేవని ఎక్కడా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. సినిమా చూసినపుడు పాటలు లేవనే భావన కలగలేదు. దీనికి కారణం థమన్. నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు. యాక్షన్ సీన్స్కు ఇంత హైప్ రావడానికి కారణం థమన్ మ్యూజిక్. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ టైటిల్ సూచించింది కూడా థమనే. 

లూసిఫర్తో పోల్చితే గాడ్ ఫాదర్లో చాలా మార్పులు చేశారు? ఒరిజినల్ దెబ్బ తింటుందనే భయం కలగలేదా? 

ఎలాంటి మార్పులు చేస్తే ఫ్రెష్ గా ఆసక్తికరంగా వుంటుందనే ఆలోచనతో పని చేశాం. ఇది పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా ఆసక్తికరంగా వుంటుందో లేదో తెలీదు. అయితే దీని వెనుక బలమైన ఎమోషన్ వుంది. బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ప్రధానంగా ఉంటూ మరో లేయర్లో పొలిటికల్ డ్రామా వుండాలని మొదటి రోజే అనుకున్నాం. మలయాళంలో సొంత కొడుకా కాదా అనే అనుమానం వుంటుంది. కానీ గాడ్ ఫాదర్ లో సొంత కొడుకని చాలా క్లియర్ గా చెప్పాం. అలాగే బ్రదర్ ను సిస్టర్ ఎందుకు ద్వేషిస్తుందో కూడా వివరంగా చూపించాం. అలాగే తన చెల్లెల్ని బ్రహ్మ పార్టీ ప్రెసిడెంట్ చేసే సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మార్పులన్నీ మోహన్ రాజా అద్భుతంగా చేసి ప్రేక్షకులని కట్టిపడేశారు. అనుభవంతో ఏదైనా మార్పు చెబితే మోహన్ రాజా దాన్ని చాలా గొప్పగా స్వాగతిస్తాడు రీమేక్ సినిమా చేయడం ఒక సవాల్. చాలా పోలికలు వస్తాయి. అయితే ప్రేక్షకుల ఆదరణ వల్ల ఒరిజినల్ ను మర్చిపోయేలా చేయగలుగుతున్నాం. ఘరానా మొగుడు, ఠాగూర్.. చిత్రాలు గొప్ప విజయాలు అందుకొన్నాయి. రీమేక్ కథలలో నా పాత్ర, ప్రజంటేషన్ ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వుంటుంది. (నవ్వుతూ)

సత్యదేవ్ , పూరి జగన్నాథ్ , సర్వదమన్ బెనర్జీ పాత్రలు మీ ఎంపికేనా?

సీఎం పాత్రకు సర్వదమన్ బెనర్జీ అయితే బాగుంటుందని అనుకున్నాం. చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్న ఆయన.. మా కోరిక మేరకు నటించడానికి ఒప్పుకున్నారు. ఆ పాత్ర అద్భుతంగా వచ్చింది. పూరి జగన్నాథ్ కూడా అంతే. ఇందులో యూట్యూబర్ పాత్రలో నటించమని అడిగితే మొదట టెన్షన్ పడ్డారు. తర్వాత ఒప్పుకున్నారు. జైల్లో మా ఇద్దరి మధ్య వచ్చే సీన్ ఆయన కోరికే అనుకోండి. సత్యదేవ్ చాలా ప్రతిభ ఉన్న నటుడు. ఈ పాత్ర చేయమని చెబితే తను షాక్ అయ్యాడు. ''మీరు చేయమని అడిగితే చేసేస్తాను అన్నయ్య  నాకు ఎందుకు కథ చెబుతున్నారు.. నాకు అంతా బ్లాంక్ గా వుంది'' అన్నాడు. వావ్ అనేలా తన పాత్ర చేశాడు. తన ప్రజంటేషన్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. నయనతార ఈ కథకు మరో ఆకర్షణ. చాలా అద్భుతంగా చేసింది. ఇందులో నాకు సేనాపతిగా కనిపించే పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించారు. మోహన్ రాజా సల్మాన్ ఖాన్ అయితే బావుటుందని అన్నారు. చరణ్ బాబు సల్మాన్ తో మాట్లాడారు. సల్మాన్ మాపై ఎంతో ప్రేమతో మరో ఆలోచన లేకుండా '' చిరు గారు కోరితే నేను నటించడానికి రెడీ'' అని చెప్పారట. 

మార్పులు విషయానికి వస్తే ఠాగూర్ లో పాటలు డ్యాన్సులు పెట్టారు .. కానీ లూసిఫర్ లో ఆ హంగులు లేకుండా తీశారు కదా? 

ప్రేక్షకుల అభిరుచి కాలానికి తగ్గుట్టు మారుతోంది. బలమైన కథనం వుంటే పాటలు, ఫైట్లు లేకపోయినా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మార్పుకి తగ్గట్టుగానే గాడ్ ఫాదర్ రూపొందించాం. ప్రేక్షకులు దీనిని గొప్పగా ఆదరిస్తున్నారు. మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు రావడానికి ఇది మంచి సంకేతమని భావిస్తున్నాను. భవిష్యత్ లో కూడా వైవిధ్యమైన కథలు, పాత్రలు చేసేందుకు ప్రయత్నిస్తాను. 

సైరా మీ డ్రీమ్ కదా .. అలాంటి పాత్రలు ఇంకేమైనా చేయాలని ఉందా? 

మైత్రీ మూవీ మేకర్స్, బాబీ దర్శకత్వంలో రాబోతున్న 154లో నా నుండి కోరుకునే పూర్తిస్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే చిత్రంగా ఆకట్టుకుంటుంది. అలాగే భోళా శంకర్ లో కూడా మంచి మార్పులతో అద్భుతమైన వినోదం ఉంటుంది. 

ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఉన్నారు .. వరుస సినిమాలు చేస్తున్నారు.. ఇండస్ట్రీ పెద్దగా వున్నారు.. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.. ఇన్ని బాధ్యతలు ఎలా నిర్వహిస్తున్నారు ? 

ప్రేక్షకులు, ఇండస్ట్రీ నన్ను ఎంతగానో ఆదరించింది. వారు ఇచ్చిన ప్రేమ,అభిమానంతోనే ఈ స్థాయిలో ఉన్నాను. వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటాను. ఆ కృతజ్ఞతని మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో తీర్చుకోవాలని ప్రయత్నిస్తాను. కృతజ్ఞత తీర్చుకోవడంలో భాగంగానే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 

యువ దర్శకులతో పని చేయడం ఎలా ఉంది? 

ఇప్పుడున్న యువ దర్శకుల దగ్గర అన్ లిమిటెడ్ సమాచారం వుంది. కొత్త విషయాలను అపరిమితంగా నేర్చుకుంటున్నారు. కోరుకున్నది ప్రజెంట్ చేయడానికి వారికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి.నా ఇమేజ్, వారు కొత్తగా చూపించే విధానం ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుందని నమ్ముతాను. అందుకే యువ దర్శకులతో ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతాను. 

మీరు, పవన్ కళ్యాణ్ కలిసి నటించే అవకాశం ఉందా? 

తమ్ముడితో కలిసి మూవీ చేయాలనే సరదా నాకూ ఉంటుంది. అన్నయ్యతో చేయాలని తనకీ ఉంటుంది. అన్నీ కుదిరిన రోజున కలిసి సినిమా చేయాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది.  

ఈ మధ్య దర్శకులు సెట్స్లో డైలాగులు రాస్తున్నారని అన్నారు కదా ? ఇది చాలా వైరల్ అయ్యింది .. దాని గురించి? 

ఈ మధ్య అనలేదండీ. నేను జనరల్గా ఆ మాట అన్నాను. కానీ దానిని వేరేలా ఆపాదించుకున్నారు. నేను ఏ సినిమాని ఉద్దేశించి ఆ మాట చెప్పలేదు. ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పడమే నా ఉద్దేశం. గాడ్ ఫాదర్ విషయానికి వస్తే మోహన్ రాజా అద్భుతమైన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు. దీని వల్ల సమయం, డబ్బు రెండూ కలిసొస్తాయి.

సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ చేశారు కదా.. మీకూ వేరే పరిశ్రమ నుండి అవకాశం వస్తే చేస్తారా? 

తప్పకుండా చేస్తాను. అందరూ చేయాలని కోరుతాను. ఎలాంటి భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా 'ఇండియన్ సినిమా' అనే పేరు రావాలని నా కోరిక. బాహుబలి, కే జీ ఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఎల్లలు చెరిగిపోయాయనే భావిస్తాను. ఇది మంచి పరిణామం. 

చాలా విషయాల్లో తగ్గితే తప్పేంటనే విధానంతో ముందుకెళ్తారు కదా.. కానీ అభిమానులకు మీరు తగ్గడం ఏంటనే అభిప్రాయం ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు?

ఇక్కడ తగ్గడం అని కాదు. సంయమనం పాటించడం. నిజాలు నిలకడగా తేలుస్తుందనే మాట నమ్ముతాను. అలా నమ్మాను కాబట్టే.. నన్ను ఎద్దేవా చేసిన వారే మళ్ళీ వారి తప్పు తెలుసుకొని నా దగ్గరికి వస్తున్నారు. వారిని ప్రేమగా దగ్గర తీసుకోవడమే నాకు తెలిసిన ఫిలాసఫీ. ఎంత మంది మనసులకు దగ్గరయ్యానన్నదే నాకు ముఖ్యం.