ఈ రిపబ్లిక్ డే నాకెంతో ప్రత్యేకం

ఈ రిపబ్లిక్ డే నాకెంతో ప్రత్యేకం

75వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డ్స్ లిస్ట్‌‌‌‌లో మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత అవార్డు ‘పద్మ విభూషణ్‌‌‌‌’ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.  ఈ సందర్భంగా టాలీవుడ్‌‌‌‌లోని సెలెబ్రిటీలతో పాటు ఇతర ఇండస్ట్రీ వాళ్లు, అభిమానులు సైతం చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌‌‌‌లో శుక్రవారం రిపబ్లిక్ డే వేడుక ఘనంగా జరిగింది. 

జెండా వందనం చేసిన  అనంతరం చిరంజీవి మాట్లాడుతూ  ‘ఈ రిపబ్లిక్ డే నా వరకు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. అందుకు కారణం.. నా 45 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో నేను ఈ సినీ కళామతల్లికి సేవ చేసుకున్నాను. అలాగే కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అనేదాన్ని నా బాధ్యతగా భావించాను. ఎన్నో సంవత్సరాలుగా విపత్తులు జరిగినా, అవసరార్థులకు ఆయా సమయాల్లో అండగా నిలబడ్డాను. నా వంతు సామాజిక సేవ చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశాం. ఇది ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. పాతికేళ్ల ముందు రక్తం కొరతతో ప్రాణాలను కోల్పోతున్నారు అనే మాట నుంచి ఇప్పుడు అలాంటి ప్రస్తావన రాలేదంటే నేను తీసుకున్న నిర్ణయం పట్ల గర్వపడుతున్నా. దానికి ప్రధాన కారణం నా అభిమానులే. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఇదే స్ఫూర్తితో మీరందరూ సామాజిక సేవ చేస్తూ, నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత ముందుకు వెళ్లేలా మీ అండదండలను నాకు అందించాలని కోరుకుంటున్నా. నేను చేసిన సేవలను గుర్తించి నాకు పద్మవిభూషణ్‌‌‌‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం సంతోషాన్నిస్తుంది. దీనికి కారణమైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ, అభిమానులు పాల్గొన్నారు.