చిరంజీవి హీరోగా, వెంకటేష్ కీలక పాత్రలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిరంజీవి మాట్లాడుతూ ‘ఈ సినిమాలోని ఓ పాటలో ‘‘అదిరిపోద్ది సంక్రాంతి, మనదే కదా సంక్రాంతి, ఇరగదీద్దాం సంక్రాంతి” అని అనడం కేవలం ఈ చిత్రానికే కాకుండా తెలుగు చిత్రపరిశ్రమకు వర్తించాలని కోరుకుంటున్నా. సంక్రాంతి సినిమాలన్నీ విజయం సాధించి, ఇండస్ట్రీ సుభిక్షంగా ఉన్నప్పుడే నిజమైన సంక్రాంతి.
ఇక అనిల్ ఈ కథ చెప్పినప్పుడు ఫ్యామిలీ టచ్, సెంటిమెంట్, హార్ట్ టచింగ్ సీన్స్ ఉండడంతో దీన్ని వైవిధ్యంగా చేద్దామన్నాను. ‘అస్సలు వైవిధ్యం వద్దు, గతంలో మీరు చేసిన దొంగ మొగుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమాల తరహాలో ఉంటే చాలు. ఈ తరానికి మీరేంటో తెలియజెప్పాలనే ప్రయత్నం చేస్తున్నా’ అన్నాడు. బడ్జెట్ దాటనీయకుండా తక్కువ వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయడం ఏ సినిమాకైనా మొదటి సక్సెస్. ఆ రకంగా ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్. ఇక నేను, వెంకటేష్ నటించినట్టుగా ఉండదు.. కుర్రాళ్లు అల్లరి చేస్తున్నట్టుగా ఉంటుంది.
ప్రేక్షకులు దాన్ని ఆస్వాదిస్తారు. ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎంత ఊహించుకున్నా తక్కువే అవుతుంది. ఈ కాంబినేషన్ పూర్తి స్థాయిలో కొనసాగించేందుకు నేను రెడీ. అనిల్ స్టోరీ రాసుకుంటే ఇదే హుషారుతో మళ్లీ నటిస్తాం. నయనతారకు అనిల్ ఏం చెప్పాడో కానీ ఓ ఫ్యామిలీ గర్ల్‌లా కలిసిపోయింది. ప్రమోషన్స్ చేసింది. భీమ్స్ లిరిక్స్ వినిపించేలా అత్యద్భుతంగా ఆర్గానిక్ మ్యూజిక్ ఇచ్చాడు. సమీర్ రెడ్డి ఫాస్టెస్ట్ సినిమాటోగ్రాఫర్. తనలా అందరూ ఉంటే త్వరగా సినిమాను పూర్తి చేసేయొచ్చు, ఖర్చు తగ్గుతుంది. అనిల్ సినిమా పూర్తయ్యాక తానే విమర్శకుడిగా మారి ఎడిటింగ్‌లో అనవసర సీన్స్ తీసేశాడు.
సాహు అందర్ని కంఫర్టబుల్‌గా చూసుకున్నారు. నా పెద్ద కూతురు సుస్మితకు అన్నిరకాల కంఫర్ట్స్ ఉన్నప్పటికీ ఏదో సాధించాలనే తపనతో నిర్మాతగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది’ అని చెప్పారు.
వెంకటేష్ మాట్లాడుతూ ‘చిరంజీవి గారితో వర్క్ చేయడం అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. ఇద్దరం రచ్చ చేశాం. గతంలో పవన్ కళ్యాణ్, మహేష్ లాంటి తమ్ముళ్లతో కలిసి మల్టీస్టారర్స్ చేసిన నేను.. ఇప్పుడు అన్నయ్యతో వస్తున్నా.. ప్రేక్షకుల నుంచి సౌండ్ అప్పటికంటే ఎక్కువ ఉండాలి’ అని అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
