- కేఎంవీ ప్రాజెక్ట్స్ కు మరో 16
- 76 స్కూళ్లలో ఈ రెండు సంస్థలకే
- 32 స్కూళ్ల నిర్మాణ బాధ్యతలు
- సగటున 5 శాతం ఎక్కువ కోట్ చేయడంతో రూ.469 కోట్ల అదనపు భారం
- రూ.10,199 కోట్ల నుంచి రూ.10,693 కోట్లకు చేరిన ప్రాజెక్టు వ్యయం
హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 76 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్ఎస్) నిర్మాణ టెండర్లలో మేఘా ఇంజనీరింగ్, కేఎంవీ ప్రాజెక్ట్స్ సంస్థలు అత్యధికంగా 32 స్కూళ్లను చేజిక్కించుకున్నాయి. ప్రభుత్వం నిర్ణీత అంచనా వ్యయం (రూ.10,199.54 కోట్ల) కన్నా ఆయా సంస్థలు సగటున 5 శాతం ఎక్సెస్‌కు రూ.10,693.55 కోట్లకు టెండర్లు దక్కించుకోవడం గమనార్హం. దీంతో సర్కారు ఖజానాపై రూ.469 కోట్ల అదనపు భారం పడనుంది. యంగ్ ఇండియా స్కూళ్ల టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సాధారణంగా పోటీ ఎక్కువగా ఉంటే టెండర్ల ధరలు తగ్గుతాయి. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాజెక్టు వ్యయం కంటే దాదాపు 5 శాతం అదనంగా కొటేషన్ వేయడమే కాకుండా వాటిని దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 76 స్కూళ్లలో సింహభాగం 32 స్కూల్ టెండర్లను మేఘా ఇంజనీరింగ్, కేఎంవీ ప్రాజెక్ట్స్ గ్రూపులే దక్కించుకున్నాయి. ఇతర చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లను రేసు నుంచి తప్పించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్తున్నారు. హెచ్-1, హెచ్-2 కాంట్రాక్టర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉండేలా చూడడం వల్లే ఇది సాధ్యమైందని భావిస్తున్నారు.
ఒక్కో స్కూల్‌కు రూ.146 కోట్లు
ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అత్యాధునిక హంగులతో కార్పొరేట్ స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వం భావించింది. దీని వల్ల ఒక్కో స్కూల్ అంచనా వ్యయం భారీగా పెరిగింది. కాంట్రాక్టర్ల అదనపు కొటేషన్ల ప్రభావంతో ఇప్పుడు ఒక్కో స్కూల్ నిర్మాణ వ్యయం రూ. 127 కోట్ల నుంచి ఏకంగా రూ. 146 కోట్ల వరకు చేరింది. పాఠశాల నిర్మించే ప్రాంతం, అక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, అత్యధికంగా ఒక్కో స్కూల్‌కు రూ. 146 కోట్ల దాకా వెచ్చించడం రికార్డుగా చెప్పుకోవచ్చు. మధిర వైఐఐఆర్‌ఎస్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.138.55 కోట్లు నిర్దేశించగా.. కాంట్రాక్టు సంస్థ రూ.145.41 కోట్లు కోట్ చేసింది. ప్రభుత్వ అంచనా కంటే ఇది రూ.6.86 కోట్లు(4.95శాతం) అదనం. కొడంగల్ వైఐఐఆర్‌ఎస్ నిర్మాణానికి రూ.140.65 కోట్లు ప్రభుత్వం నిర్దేశించగా. రూ.147.62 కోట్లు కోట్ చేసిన సంస్థకు టెండర్ దక్కింది. ప్రభుత్వ అంచనా కంటే ఇది రూ.6.97 కోట్లు (4.95శాతం)అదనం. హుజూర్‌నగర్ వైఐఐఆర్‌ఎస్ నిర్మాణానికి రూ.136.02 కోట్లు ప్రభుత్వం
నిర్దేశించగా.. రూ.142.75 కోట్లు కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్టు దక్కింది. ప్రభుత్వం అంచనా కంటే ఇది రూ.6.73 కోట్లు మేర (4.95శాతం) అదనం.
