తెలంగాణకు ద్రోహం చేస్తున్నా.. మేఘాకే గులామ్

తెలంగాణకు ద్రోహం చేస్తున్నా.. మేఘాకే గులామ్
  • ఆంధ్రోళ్లపై నిప్పులు చెరుగుడు.. ఆంధ్రా కంపెనీతోనే  సర్కారు అంటకాగుడు
  • దక్షిణ తెలంగాణను ఎడారి చేసే ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతున్న మేఘా
  • రాష్ట్రంలో అదే కంపెనీకి  లక్ష కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టడంపై దుమారం

‘‘ఆంధ్రోళ్లంటే తెలంగాణకు వ్యతిరేకులు.. ఆంధ్రా ప్రజలు లంకలో పుట్టిన రాక్షసులసోంటోళ్లు..’’ అంటూ ఏపీ నీళ్ల దోపిడీపై పైపై మాటలు మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. లో లోపల ‘మేఘా’ నాటకమాడుతోంది. ఏడేండ్లుగా అదే కాంట్రాక్ట్  కంపెనీతో అంటకాగుతోంది. ఒకవైపు ఆంధ్రోళ్లంటే నిప్పులు చెరుగుతూ.. మరోవైపు ఆంధ్రా కాంట్రాక్టర్‌కు రూ.లక్ష కోట్లకు పైగా పనులు కట్టబెట్టడం దుమారం రేపుతోంది. అటు నీళ్ల పేరుతో జనంలో సెంటిమెంట్​ రగిలించి.. ఇటు  ఏపీ కంపెనీకి నిధులు దోచిపెడుతున్న తీరుపై జనం మండిపడుతున్నారు. సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడుతో ఇన్నాళ్లూ నీళ్లను తరలించుకుపోతున్నా సైలెంట్​గా ఉండి ఇప్పుడు ఉన్నట్టుండి ఆంధ్రోళ్లను తిట్టడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

హైదరాబాద్​, వెలుగు: మనల్ని ముంచే ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఎడాపెడా కడ్తున్న మేఘా కంపెనీకి మన రాష్ట్ర సర్కారు దోచిపెడుతోంది. ఇప్పటికే కాళేశ్వరం మొదలు మిషన్​ భగీరథ, రోడ్ల దాకా.. ఇట్ల లక్ష కోట్ల రూపాయల పనులు అప్పగించింది. ఇప్పుడు కొత్తగా మరిన్ని ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు రెడీ అవుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ విస్తరణ, సంగమేశ్వరం వంటి ఏపీ ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ప్రజలు, ఇంజనీర్లు నెత్తీ నోరు మొత్తుకుంటున్నా.. ఆ ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఆంధ్రా కంపెనీకే మన రాష్ట్ర సర్కారు దాసోహం అంటోంది. అలంపూర్‌ వద్ద   కడ్తామని చెప్తున్న జోగులాంబ బ్యారేజీ, పంపుహౌస్‌, పైపులైన్‌ పనులన్నీ గంపగుత్తగా మేఘాకే  ధారాదత్తం చేయబోతున్నారని రాష్ట్ర ఇరిగేషన్‌  వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏటా రాష్ట్ర బడ్జెట్​లో ఐదో వంతు బిల్లులను ఈ సంస్థకే ముట్టజెప్పుతున్నట్టు తెలుస్తోంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఏడేండ్లలో రూ.4లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన రాష్ట్ర సర్కారు.. మేఘా కంపెనీకి కాంట్రాక్టుల మీద కాంట్రాక్టులు కట్టబెడుతుండటంతో ఆ కంపెనీ ఓనర్​ ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా వెలిగిపోతున్నారు. 
అన్ని ప్రాజెక్టుల్లో హవా
కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టుల్లోనూ మేఘా కంపెనీదే హవా నడుస్తోంది. గత ఏడాది వరకే దాదాపు రూ. లక్ష కోట్లకుపైగా పనులను రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీకి ఇచ్చింది. ఇటీవల టెండర్లు పిలిచిన రూ. 1,500 కోట్ల సుంకిశాల డ్రింకింగ్​ వాటర్​ స్కీమ్​ను  కూడా అదే జాబితాలో వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, ఇతర పనులన్నీ మేఘా ఇంజనీరింగ్‌ సంస్థనే దక్కించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క నందిమేడారం పంపుహౌస్‌ మినహా మిగతా 20 పంపుహౌస్‌లను ఈ సంస్థే నిర్మించింది. ఇందులో 104 భారీ మోటార్లు, పంపులు ఏర్పాటు చేసింది. వీటికి సంబంధించిన ఇతర పనులనూ ఈ సంస్థే చేస్తోంది. పాలమూరు - రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, భక్తరామదాసు లిఫ్టు స్కీమ్​లను ఈ సంస్థే చేపట్టింది. 

పాలమూరు ఎత్తిపోతల పథకాల్లో రెండు పంపుహౌస్‌‌‌‌‌‌‌‌లు మరో వర్క్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీకి దక్కగా, ఆ సంస్థను బలవంతంగా బయటకు పంపి మేఘాకు కట్టబెట్టింది మన ప్రభుత్వం. ఇవి కాకుండా మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ, రోడ్లు, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలోనే రోడ్ల నిర్వహణ, ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ బస్సులు, ఇతర పనులన్నీ కలుపుకొంటే ఈ సంస్థకు రూ. లక్ష కోట్లకు పైగా కట్టబెట్టారు.
ప్రాజెక్టుల వెనుక మాస్టర్‌‌‌‌‌‌‌‌ మైండ్‌‌‌‌‌‌‌‌ మేఘా
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏదైనా ప్రాజెక్టు ప్రకటించింది అంటే దాని వెనుక మాస్టర్‌‌‌‌‌‌‌‌  మైండ్‌‌‌‌‌‌‌‌ మేఘా ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ సంస్థదే. ఇప్పుడు ఆలంపూర్‌‌‌‌‌‌‌‌ వద్ద నిర్మిస్తామని చెప్తున్న జోగులాంబ బ్యారేజీ, పంపుహౌస్‌‌‌‌‌‌‌‌, పైపులైన్‌‌‌‌‌‌‌‌ పనులన్నీ గంపగుత్తగా ఈ సంస్థకే దారాదత్తం చేయబోతున్నారని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌  సర్కిల్స్‌‌‌‌‌‌‌‌లో చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌‌‌‌‌‌‌‌ -1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లిఫ్టుల పనులు 2 టీఎంసీలకే చేయాల్సి ఉండగా, ముందే 3 టీఎంసీలకు చేయించారు. పంపులు, మోటార్ల ఏర్పాటు తప్ప మిగతా ఎర్త్‌‌‌‌‌‌‌‌, కాంక్రీట్‌‌‌‌‌‌‌‌ పనులన్నీ ముందే కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేశారు. రెండు టీఎంసీల పనులు ఇలా పూర్తి కాగానే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ గ్లోబల్‌‌‌‌‌‌‌‌  టెండర్ల మాటే ఎత్తకుండా మేఘాకు రూ. 4,600 కోట్ల పనులను నామినేటెడ్‌‌‌‌‌‌‌‌ పద్ధతిన కట్టబెట్టారు. మేఘా కోసమే కాళేశ్వరం అడిషనల్‌‌‌‌‌‌‌‌ టీఎంసీ (ఎల్లంపల్లి నుంచి మిడ్‌‌‌‌‌‌‌‌ మానేరుకు మూడో టీఎంసీ, మిడ్‌‌‌‌‌‌‌‌ మానేరు నుంచి మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌కు ఒక టీఎంసీ) పనులు చేపట్టారు. రూ. 21 వేల కోట్లతో ఈ పనులకు టెండర్లు పిలిస్తే మేఘా సంస్థకు ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా పనులు దక్కాయి.
దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ఏపీ ప్రాజెక్టులనూ మేఘానే నిర్మిస్తోంది. మన రాష్ట్రంలో లక్ష కోట్లకు పైగా విలువైన పనులు చేస్తున్న ఈ సంస్థ ఇక్కడి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌లోని మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలను ఎండబెట్టే పోతిరెడ్డిరెడ్డిపాడు హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీంలను వేగంగా నిర్మిస్తోంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ప్రజలకు తాగునీరు కూడా దక్కకుండా చేసే  ప్రాజెక్టులనూ ఏపీ సర్కారు అండతో మూడు షిఫ్టుల్లో కొనసాగిస్తోంది. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఎక్కువ పనులు ఈ సంస్థనే దక్కించుకుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి ఒక సంస్థను తప్పించి కీలకమైన పనులను మేఘాకు కట్టబెట్టింది జగన్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం. అక్కడ తలపెట్టిన హైడల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌, దక్షిణ తెలంగాణను ఎడారి చేసే పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీంలు ఈ కంపెనీకే దక్కాయి. 


హెచ్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ విస్తరణ, గాలేరు -– నగరిలో భాగంగా కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ కలిపి ఏడాది వ్యవధిలోనే రూ. 15 వేల కోట్లకు పైగా పనులు ఈ సంస్థ దక్కించుకుంది. హెచ్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, వెలిగొండ ప్రాజెక్టు, చింతలపూడి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌, కొరిసపాడు ఎత్తిపోతలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పట్టిసీమ ప్రాజెక్టులను ఈ సంస్థే చేపట్టింది. మొత్తంగా రూ. 40 వేల కోట్లకు పైగా పనులు ఏపీలో ఈ సంస్థకు దక్కాయి. ఏపీలో చేపట్టబోయే రాయలసీమ డ్రాట్ మిటిగేషన్‌‌‌‌‌‌‌‌ స్కీం, పోలవరం కుడి కాలువ విస్తరణ తదితర ప్రాజెక్టుల్లోనూ ఈ సంస్థకే మెగా షేర్‌‌‌‌‌‌‌‌ దక్కనున్నట్టు తెలుస్తోంది.