మేఘా మైనింగ్‌‌‌‌ కేసులో.. సైలెన్స్‌!

మేఘా మైనింగ్‌‌‌‌ కేసులో.. సైలెన్స్‌!
  • భారత్ మాల రోడ్డు పేరుతో గుట్టలు, కొండలు కొల్లగొట్టిన కంపెనీ
  • రూ. 52.35 కోట్లు కట్టాలని గతేడాది జూన్‌‌‌‌లో నోటీసులు
  • రివిజన్‌‌‌‌ పేరుతో కాలయాపన చేస్తున్న కంపెనీ
  • పట్టించుకోని ఆఫీసర్లు

గద్వాల, వెలుగు : భారత్ మాల ముసుగులో జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమ మైనింగ్‌‌‌‌ చేసి కోట్లు కొల్లగొట్టిన మేఘా కంపెనీపై ఆఫీసర్లు పెట్టిన కేసు అటకెక్కిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసి, డిమాండ్‌‌‌‌ నోటీసు పంపించి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకూ ఉలుకూ పలుకూ లేదు. ఇల్లీగల్‌‌‌‌గానే పనులు చేసినట్లు గుర్తించిన ఆఫీసర్లు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు నేషనల్‌‌‌‌ హైవే అథారిటీకి లెటర్లు రాసినా ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రెండు రీచ్‌‌‌‌లు..77 కిలోమీటర్లు 

భారత్‌‌‌‌ మాల కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చెన్నై కారిడార్ పేరుతో మహారాష్ట్రలోని అక్కల్‌‌‌‌కోట నుంచి చెన్నై వరకు సూపర్‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌ నేషనల్‌‌‌‌ హైవేను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో కర్ణాటక బార్డర్ సమీపంలోని నందిన్నె నుంచి నంద్యాల రోడ్డు వరకు చేపట్టాల్సిన పనులను మేఘా కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. మొదటి విడతలో నందిన్నె నుంచి జులేకల్‌‌‌‌ వరకు 38 కిలోమీటర్లు, రెండో విడతలో జులకల్‌‌‌‌ నుంచి నంద్యాల చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌ వరకు 39 కిలోమీటర్లు కలిపి మొత్తం 77 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది. 

గతేడాది పనులు మొదలు పెట్టగా ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. కోట్ల విలువైన గుట్టలు, కొండలు కరగదీసిన్రు నేషనల్‌‌‌‌ హైవే పనుల ముసుగులో శాంతినగర్, ఐజ, కేటీ దొడ్డి, గట్టు మండలాల్లోని గుట్టలు, కొండలను కొల్లగొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎలాంటి సీనరేజీ చార్జెస్‌‌‌‌ చెల్లించకుండానే మైనింగ్‌‌‌‌ చేసినట్లు ఆ శాఖ ఆఫీసర్లు గుర్తించారు. కేటీ దొడ్డి మండలంలోని కుచినేర్ల గ్రామంలో 52 సర్వే నంబర్‌‌‌‌లో రూ.3,95,39,406 విలువైన 1,16,224 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌‌‌‌, రూ. 39,70,34,937 కోట్ల విలువైన 1,55,445 క్యూబిక్‌‌‌‌ మీటర్లు, గట్టు మండలం రాయపురం గ్రామ 83 సర్వే నంబర్‌‌‌‌లో రూ. 83,66,350 విలువైన 24.592.47 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌‌‌‌, సర్వేనంబర్‌‌‌‌ 199లో క్రషర్‌‌‌‌ యూనిట్‌‌‌‌ స్టోన్‌‌‌‌ మెటల్‌‌‌‌ ఏర్పాటు చేసి రూ. 4,85,74,912ల విలువైన 1,17,811 టన్నుల కంకర డైమండ్‌‌‌‌ సేల్‌‌‌‌ మెటల్‌‌‌‌, సర్వే నంబర్ 1999లో రూ. 3,01,00,216 విలువైన 15,294.6 క్యూబిక్ మీటర్ల రాళ్లు, వడ్డేపల్లి మండలం 377 సర్వే నంబర్‌‌‌‌లో రూ. 3,94,95,860 విలువైన 1,16,096 క్యూబిక్‌‌‌‌ మీటర్ల గ్రావెల్‌‌‌‌ను అక్రమంగా తరలించారని గుర్తించారు. 

ఎన్‌‌‌‌వోసీ తీసుకున్నా ఛార్జెస్‌‌‌‌ కట్టలేదు

హైవే నిర్మాణ పనులు చేపట్టిన మేఘా కంపెనీ కేటీ దొడ్డి మండలంలోని కుచినెర్ల సర్వే నంబర్‌‌‌‌ 52, గట్టు మండలంలోని రాయపురం సర్వే నంబర్లు 83,199లతో పాటు వడ్డేపల్లి మండలంలోని సర్వే నంబర్‌‌‌‌ 377లో తవ్వకాలు చేపట్టిన భూములన్నీ ప్రభుత్వానివేనని మైనింగ్‌‌‌‌ ఆఫీసర్లు తేల్చారు. ఆ భూముల్లో తవ్వకాలు చేపట్టేటప్పుడు సంబంధిత తహసీల్దార్ల నుంచి నో అబ్జెక్షన్‌‌‌‌ లెటర్లు తీసుకున్నప్పటికీ ప్రభుత్వానికి ఎలాంటి సీనరేజ్‌‌‌‌ ఛార్జెస్‌ చెల్లించలేదు. దీంతో కంపెనీకి షోకాజ్‌‌‌‌ నోటీసులు జారీ చేశారు. కంపెనీ నుంచి వచ్చిన రిప్లై సంతృప్తికరంగా లేకపోవడంతో మొత్తం రూ. 52,35,72,281 చెల్లించాలని గతేడాది జూన్‌‌‌‌లో డిమాండ్ నోటీసు పంపించారు.

రివిజన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ అంటూ కాలయాపన

గతేడాది జూన్‌‌‌‌లోనే నోటీసులు పంపించినప్పటికీ ఇప్పటివరకు ఫైన్‌‌‌‌ కట్టకుండా కంపెనీ మైనింగ్‌‌‌‌ కొనసాగిస్తూనే ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్‌‌‌‌ శాఖ ఇచ్చిన నోటీసుపై రివిజన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ వేస్తూ కాలయాపన చేస్తూ తమ పనులు చక్కబెట్టుకుంటుందని పలువురు విమర్శిస్తున్నారు. ఫైన్‌‌‌‌ చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేయడం, లేదంటే అరెస్ట్‌‌‌‌ చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ మైనింగ్‌‌‌‌ ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. రివిజన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ ప్రభుత్వం వద్ద పెండింగ్‌‌‌‌లో ఉందంటూ దాటవేస్తున్నారు.

ఎప్పటికైనా ఫైన్‌‌‌‌ కట్టాల్సిందే..  

మేఘా కంపెనీ అక్రమ మైనింగ్‌‌‌‌ చేసింది వాస్తవమే. మేము వేసిన ఫైన్‌‌‌‌ ఎప్పటికైనా కట్టాల్సిందే. రివిజన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ వేసి కొంత కాలయాపన చేస్తున్నారు. గ్రావెల్ తరలించిన విషయంలో రూ. 3 కోట్లు చెల్లించింది. మిగతా డబ్బులు కూడా వసూలు చేయాలని నేషనల్‌‌‌‌ హైవే అథారిటీకి లెటర్లు రాశాం.
- విజయరామరాజు, మైనింగ్‌‌‌‌ ఏడీ