కశ్మీర్‌‌లో హౌస్ అరెస్ట్‌లు చేస్తూ.. అఫ్గాన్‌ ప్రజల హక్కులపై మాటలా?

కశ్మీర్‌‌లో హౌస్ అరెస్ట్‌లు చేస్తూ.. అఫ్గాన్‌ ప్రజల హక్కులపై మాటలా?

శ్రీనగర్: కశ్మీర్‌‌లో పరిస్థితులను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌‌లో అంతా నార్మల్‌గా ఉందని కేంద్ర ప్రభుత్వం ఫేక్‌ ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపించారు. ఒకవైపు కశ్మీర్‌‌లో ప్రజల హక్కులను అణచివేస్తూ.. అఫ్గాన్‌లో పౌరుల హక్కుల గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఇవాళ (మంగళవారం) ట్వీట్ చేశారు. 

‘‘అఫ్గానిస్థాన్‌లో ప్రజల హక్కుల గురించి భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ ఉద్దేశపూర్వకంగా కశ్మీరీల హక్కులను మాత్రం తిరస్కరిస్తోంది. ఇవాళ నన్ను అధికారులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి అధికారులు చెబుతున్న కారణం కశ్మీర్‌‌లో పరిస్థితులు ఇంకా నార్మల్ కాలేదని.. దీంతో కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌‌ నార్మలసీపై చెబుతున్నవి అవాస్తవమని బట్టబయలైపోయింది” అని మెహబూబా ముఫ్తీ.. తన ఇంటి గేటును బయట నుంచి లాక్‌ చేసి ఉన్న ఫొటోలతో పాటు ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. అలాగే తన ఇంటి ముందు ఆపి ఉన్న కశ్మీర్‌‌ పోలీస్‌ వెహికల్ ఫొటోను ఆమె ట్వీట్ చేశారు.

హౌస్ అరెస్ట్ కాదంటూ పోలీసుల వివరణ

కశ్మీర్ వేర్పాటువాద, పాక్ అనుకూల నేత సయ్యద్ అలీ షా గిలానీ గత బుధవారం మరణించిన నేపథ్యంలో కుల్గామ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో మెహబూబా ముఫ్తీ ఆ ప్రాంతాన్ని సందర్శించేందకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే జడ్‌ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన ఆమె అక్కడకి వెళ్తే సెక్యూరిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే ఆమెను వెళ్లకుండా అడ్డుకున్నాం తప్ప హౌస్ అరెస్ట్ చేయలేదని పోలీస్ సీనియర్ అధికారి ఒకర వివరణ ఇచ్చారు. ఆమెను కుల్గాం ప్రాంతానికి ఇవాళ వెళ్లొద్దని మాత్రమే చెప్పామని, ఎప్పటికీ హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. గిలానీ మృతి తర్వాత ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు పెట్టిన పోలీసులు ఇప్పటికే వాటిని ఎత్తేశామని పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ముఫ్తీ కామెంట్స్ చేయడం గమనార్హం.