మహాశివరాత్రి జాతరకు మేళ్లచెరువు ముస్తాబు

మహాశివరాత్రి జాతరకు మేళ్లచెరువు ముస్తాబు
  • 18 నుంచి 5 రోజుల పాటు జాతర నిర్వహణ
  • 5 లక్షల మంది భక్తులు వచ్చే  చాన్స్‌
  • అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
  • 1000 మందితో బందోబస్తు


మేళ్లచెరువు, వెలుగు :సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి జాతరకు ముస్తాబైంది. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఇక్కడి శివలింగం పుష్కరానికి ఒక అంగుళం చొప్పున పెరగడం, లింగం పైనుంచి నిత్యం నీటి ఊట రావడం వంటి ప్రత్యేకతలు ఉండడంతో భక్తులు ఈ ఆలయాన్ని దక్షిణకాశీగా పిలుస్తుంటారు. బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఐదు రోజుల పాటు ఉత్సవాలు

మేళ్లచెరువు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. మహాశివరాత్రి రోజైన శనివారం అభిషేకాలు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. రెండో రోజు అభిషేకాలు, కుంకుమార్చనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మూడోరోజు పెద్ద రథోత్సవం, నాలుగో రోజున అభిషేకాలు, నిత్యపూజలు జరపనున్నారు. ఐదో రోజున పూర్ణాహుతి, ఒడిబియ్యం, పవళింపుసేవ కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

ఎడ్ల పందేలు ప్రత్యేక ఆకర్షణ

మేళ్లచెరువు జాతర అంటేనే ఎడ్ల పందేలకు ఫేమస్‌‌‌‌‌‌‌‌. సుమారు 50 ఏళ్లుగా ఇక్కడ నిర్వహించే ఎడ్ల పందేలు, బండ లాగుడు పోటీలకు తెలంగాణ, ఏపీ నుంచి లక్షలాది మంది తరలివస్తారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌, బుల్లెట్‌‌‌‌‌‌‌‌ వంటి భారీ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను ప్రైజ్‌‌‌‌‌‌‌‌లుగా అందజేస్తుంటారు. అలాగే కబడ్డీ పోటీలు, భారీ లైటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రభలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రభలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

100 మందితో బందోబస్తు

మేళ్లచెరువు జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. బందోబస్తు కోసం 1000 మందిని కేటాయించడంతో పాటు, సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా జాతర ప్రదేశాన్ని నిత్యం పరిశీలించనున్నాయి. అలాగే ఆర్టీసీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి అరగంటకు మేళ్లచెరువుకు ఆర్టీసీ బస్సు నడపనున్నారు.