
- గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
- ఆరున్నర కోట్ల ఏండ్ల కింద ఏర్పడినట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తవపూర్ గ్రామం వాటర్ ఫాల్స్ దగ్గర్లోని అడవుల్లో అరుదైన లావా స్తంభాలను (కాలమ్నార్ బసాల్ట్స్)ను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. ప్రకృతి పోతపోసినట్లుగా కుప్పలుగా ఒకే చోట ఉన్న ఈ రాతి స్తంభాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కటకం మురళీ కనుగొన్నారు. ఇది రాష్ట్రంలో లభించిన నాలుగో కాలమ్నార్ బసాల్ట్స్ ప్రదేశం. ఫస్ట్ టైం 2015లో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం శాంతిపూర్ రిజర్వ్ ఫారెస్టు లో కాలమ్నార్ బసాల్ట్స్ గుర్తించారు.
ఆరున్నర కోట్ల ఏండ్ల కింద భూగర్భంలో నుంచి పైకి వచ్చిన లావా చల్లారి గట్టిపడుతున్న క్రమంలో సంతరించుకున్న శిలా రూపాలే ‘కాలమ్నార్ బసాల్ట్స్’ అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (రిటైర్డ్) వేణుగోపాల్ వెల్లడించారు. వాస్తవపూర్ జలపాతంవద్ద కనిపించిన కాలమ్నార్ బసాల్ట్స్ విభిన్నమైనవని, ఇవి షట్కోణ, అష్టకోణాకృతుల్లో లేవన్నారు. అరుదైన ఈ ప్రాకృతిక శిలాస్తంభాలను కాపాడాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ కోరారు.