- నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
- అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్
- బీఆర్ఎస్ను సైడ్ చేసి కీ రోల్‌కు రావాలనుకుంటున్న బీజేపీ
- బడ్జెట్ రోజు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే చాన్స్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు అధికార పార్టీ కాంగ్రెస్ సభ్యులు.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు వాళ్ల వాళ్ల వ్యూహాలతో రెడీ అయ్యారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లనుంది. గడిచిన ఏడెనిమిది నెలల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రారంభించిన స్కీములు, ముఖ్యంగా పంట రుణమాఫీతో ఆ పార్టీ దూకుడు మీద ఉన్నది. ప్రజా సంక్షేమానికి గ్యారంటీ ఇస్తూ పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలను కూడా అసెంబ్లీలో చర్చించాలని అధికార పార్టీ భావిస్తున్నది. అయితే, ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై అసెంబ్లీలో ప్రశ్నించాలని ఇటు బీఆర్ఎస్.. అటు బీజేపీ నిర్ణయించాయి.
12 రోజులు జరిగే చాన్స్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు తొలి రోజు మంగళవారం సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అనంతరం సభను బుధవారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వాయిదా వేస్తారు. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన ఆయన చాంబర్లో బీఏసీ మీటింగ్ నిర్వహించి.. ఎన్ని రోజులు అసెంబ్లీ నడపాలి? ఏయే అంశాలపై చర్చించాలనే దానిపై ఎజెండాను ఖరారు చేస్తారు. ఈ నెల 25న ప్రభుత్వం రాష్ట్ర ఫుల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో సీటింగ్ మార్చనున్నట్లు సమాచారం. మొత్తం 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆధారాలతో బదులిచ్చేందుకు కాంగ్రెస్ రెడీ
అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను దీటుగా ఎదుర్కోవాలని అధికార పార్టీకాంగ్రెస్ నిర్ణయించింది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా... వాటికి పూర్తి ఆధారాలతో బదులు చెప్పాలని ఇప్పటికే సీఎం రేవంత్ .. మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ మేరకు అన్ని గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రధానంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రుణమాఫీ, రైతు భరోసా, ఇరిగేషన్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఫీజ్రీయింబర్స్మెంట్, లా అండ్ఆర్డర్, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు ఎమ్మెల్యేల చేరికలపై చర్చ జరిగే సమయంలో ఆయా అంశాలపై కాంగ్రెస్ తరఫున ఎవరు ఈ చర్చలో పాల్గొనాలో ఇప్పటికే సీఎం దిశానిర్దేశం చేశారు.
కొందరు సీనియర్ మంత్రులతోపాటు పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే పలు గ్యారంటీలను, ముఖ్యంగా రుణమాఫీని అమలుచేస్తున్న తీరును అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ సిద్ధమవుతున్నారు.
బీఆర్ఎస్ను సైడ్ చేయాలనుకుంటున్న బీజేపీ
రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్నది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లను గెల్చుకోవడం ద్వారా రాష్ట్రంలో బలంపుంజుకున్న బీజేపీ.. ఈసారి అసెంబ్లీలో దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోక, ఎమ్మెల్యేల వలసలతో కుదేలవుతున్న బీఆర్ఎస్ను సైడ్ చేసి.. తాను లీడ్ తీసుకునేందుకు ఇదో మంచి అవకాశంగా బీజేపీ భావిస్తున్నది.ఈ క్రమంలోనే అధికారపార్టీని అసెంబ్లీలో పలు అంశాలపై ప్రశ్నిచేందుకు కమలనాథులు రెడీ అయ్యారు. వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చలను కొనసాగించడం ద్వారా కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని జనాల్లోకి పంపేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోవాలనుకుంటున్నారు.
ఈసారి సభకు కేసీఆర్?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. నిరుడు డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. కాగా, మంగళవారం మధ్యాహ్నం తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్ శాసనసభపక్ష సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇప్పటికే మొత్తం పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినందున బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, -జాబ్ క్యాలెండర్, శాంతి భద్రతల నిర్వహణ వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు టాక్.
