గుసగుసల్లో.. మగవాళ్లే ఫస్టట!

గుసగుసల్లో.. మగవాళ్లే ఫస్టట!

‘నీకు తెలుసా.. సుజాతా.. ఆ నాగమణి లేదూ…’ అంటూ మొదలు పెడతారు. ఆ తర్వాత ఏం మాట్లాడుకుంటారో.. ఏం చెప్పుకుంటారో.. ఒక్క ముక్క కూడా పక్కోళ్లకు వినిపించదు. కానీ.. ఎవరికైతే చెప్తున్నారో..  వారికి మాత్రం పక్కాగా వినిపిస్తది. అది ఆడోళ్ల గుసగుసల మహిమ. అయితే.. తాజాగా చేసిన ఓ స్టడీలో గుసగుసల్లో  ఆడోళ్ల కంటే.. మగవాళ్లే  బెటర్​ అని తేలింది. అంతే కాదు.. ఇంకా చాలా  ఇంట్రెస్టింగ్‌ సంగతులు వెల్లడయ్యాయి.

అదేంది.. పక్కోళ్లకు కూడా వినిపించకుండా.. గుసగుస పెట్టేది ఆడోళ్లే కదా! ఇలా రాశారేంటి? అనుకుంటున్నారా? ఈ మాట మేం చెప్పింది కాదు.  యూనివర్సిటీ ఆప్​ కాలిఫోర్నియా వాళ్ల అధ్యయనంలో  వెల్లడైన నిజం ఇది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 467 మంది మీద అధ్యయనం చేసి ఈ విషయాన్ని తేల్చారు నిపుణులు.

టెక్నాలజీ వాడారు..

269 మంది మహిళలు, 198 మంది పురుషులను పరిశీలనలో ఉంచి.. రోజంతా వారేం మాట్లాడుకున్నారు అనే అంశం మీద దృష్టి పెట్టారు. వీరందరికీ ఇయర్​ (ఈఏఆర్ ‌‌‌‌‌‌‌‌– ఎలక్ట్రానికల్లీ యాక్టివేటెడ్​ రికార్డర్స్) జతచేశారు. ఈ పరికరం సహయంతో రోజంతా వారు మాట్లాడుకునేది రికార్డు చేశారు. ఆ తర్వాత తీరికగా అందులో రికార్డు అయిన మాటలన్నింటినీ విన్నారు. అందులో.. అందరికీ వినబడేలా మాట్లాడుకున్న మాటల కంటే.. ఎవరికీ వినిపించకుండా గుసగుసగా మాట్లాడుకున్నవే ఎక్కువగా ఉన్నాయట.   ఈ అధ్యయనంలో పాల్గొన్నవారంతా 18 నుంచి 58 ఏళ్ల మధ్య వయసువారే.

పక్కోళ్ల గురించే ముచ్చట్లన్నీ..

మామూలుగా ముగ్గురు స్నేహితులు కలిస్తే.. ముగ్గురిలో ఒకరు బకరా అవుతారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఇద్దరు కలిస్తే.. మాత్రం ఆ మూడో వ్యక్తి గురించే మాట్లాడుకుంటారట. మన పక్కన లేని వ్యక్తి గురించిన ఎన్నో విషయాలు ఎవరికీ వినిపించకుండా గుసగుసలాడుకుంటారట. ఈ సర్వేలో ఇదే ముచ్చట తేలింది. ఆ రికార్డులన్నీ విన్న తర్వాత వాటిలో లెక్కేస్తే.. 4003 సందర్బాల్లో ఎక్కువగా ఇతరుల గురించే గుసగుసలాడారట. అందులో.. కూడా మగవారి గుసగుసలే ఎక్కువున్నాయి.

స్టడీ ఇలా సాగింది..

467 మందికి అమర్చిన ఎలక్ట్రానికల్లీ యాక్టివేటెడ్ రికార్డర్లలో నమోదైన రికార్డులన్నింటినీ నెగెటివ్​, పాజిటివ్, న్యూట్రల్​ అని మూడు కేటగిరీలుగా విభజించారు. వాటిలో  నెగెటివ్​ విషయాల్లో ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. పాజిటివ్ విషయాల్లో  ఎవరి గురించి మాట్లాడుకున్నారు. న్యూట్రల్​ అంశాల్లో ఎవరి గురించి మాట్లాడుకున్నారనే దిశగా పరిశోధన చేశారు. అందులో.. సెలబ్రిటీల గురించి, అమ్మాయిలైతే అబ్బాయిల గురించి, అబ్బాయిలైతే అమ్మాయిల గురించి మాట్లాడుకున్నారట.అయితే.. ఈ అంశాల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ గుసగుసలాడారట.

నమ్మలేని గుసగుసలు..

  • ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆడవారి కంటే మగవారే 52 నిమిషాలు ఎక్కువగా గుసగుసలాడుతున్నారు.
  • టీనేజ్​ అబ్బాయిలు ఈ గుసగుసల జాబితాలో.. ముందు వరుసలో నిలిచారు.
  • పేదవారు డబ్బున్న వారి గురించి, ఓడిపోయిన వారు గెలిచిన వారి గురించి ఎక్కువగా గుసగుస పెట్టారు.
  • పని ప్రదేశాల్లో 58 శాతం మంది గుసగుసలు పెడతారు.
  • పక్కోళ్లకు వినిపించకుండా, అనుమానం రాకుండా గుసగుస పెట్టడం ఒక కళ అంటున్నారు నిపుణులు.
  • బాగా పాపులర్​ అయిన వారి గురించి పెట్టుకునే గుసగుసలు చాలా ఆసక్తిగా ఉంటాయి.

గాసిప్స్​ మీద ఆసక్తి సహజమే..

సహజంగానే మనిషికి ఇతరుల విషయాల్లో కుతూహలం ఎక్కువ. పక్కవారి గురించి మాట్లాడుకోవడంలో ఉన్నంత ఆసక్తి సొంత విషయాల మీద చూపించరు. అందుకే.. ఎక్కువగా గుసగుసల మీద ఆధారపడుతారు. అప్పటికప్పుడు తాము అనుభవిస్తున్న ఒక రకమైన భావన నుంచి మార్పు కోరుకునేందుకు గాసిప్స్​ మీద ఆధారపడతారు. తమకు బాగా తెలిసిన వ్యక్తుల గురించి, ఎవరో తెలియని వ్యక్తుల గురించి గాసిప్స్​ చెప్పుకోడానికి ఆసక్తి చూపుతారు. అపరిచితుల గురించి కూడా ఎవరైనా గుసగుసలు చెప్పుకొంటుంటే.. ఆసక్తిగా వింటాం. కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు చేసిన సర్వేలో వారు చెప్పిన విషయాలు చాలా వరకు వాస్తవమే. కాకపోతే.. మహిళల కంటే మగవారు గాసిప్స్​ వినడంలో, మాట్లాడుకోవడంలో ముందున్నారన్న విషయం ఆసక్తికరం. ‌‌‌‌– సుబ్బారెడ్డి,  సైకాలజిస్ట్