నాగర్​కర్నూల్ లో ఏసీబీకి చిక్కిన ఇన్​చార్జి ఎంఈఓ

నాగర్​కర్నూల్ లో ఏసీబీకి చిక్కిన ఇన్​చార్జి ఎంఈఓ

నాగర్​కర్నూల్, వెలుగు: రూ. 35 వేలు లంచం తీసుకుంటూ ఇన్​చార్జి ఎంఈఓ, మండల రిసోర్స్​కోఆర్డినేటర్​(ఎమ్మార్సీ) ఏసీబీకి చిక్కారు. తాడూరు మండలం ఐతోల్ జడ్పీ హై స్కూల్ హెచ్ఎం చంద్రశేఖర్​రెడ్డి తాడూరు, కొల్లాపూర్, కోడేరు,పెంట్లవెల్లి  మండలాలకు ఇన్​చార్జి ఎంఈఓగా చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​బీసీ కాలనీ ప్రైమరీ స్కూల్​లో హెచ్ఎంగా చేస్తున్న ఉమాదేవి గతంలో మూడు పీఎల్ఐసీ పాలసీలు తీసుకున్నారు.  వాటి మెచ్యురిటీ పీరియడ్​ ముగియడంతో ఫార్వర్డ్ చేయాల్సిందిగా ఇన్​చార్జి ఎంఈఓ చంద్రశేఖర్​రెడ్డిని కోరారు. తనకు రూ.30 వేలు ఇస్తే ఫైల్​ఫార్వర్డ్​చేస్తానని ఎంఈఓ చెప్పాడు. 

డబ్బులు ఇన్​చార్జి ఎమ్మార్సీ చంద్రశేఖర్​కు ఇవ్వాలని సూచించాడు. ఎమ్మార్సీ చంద్రశేఖర్ తనకు రూ.5 వేలు ఇస్తేనే పని చేస్తానని చెప్పడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం కొల్లాపూర్​ఎమ్మార్సీ బిల్డిం​గ్​లో హెచ్ఎం ఉమాదేవి భర్త సిద్దయ్య ఎమ్మార్సీ చంద్రశేఖర్​కు రూ.35 వేలు ఇచ్చి బయటకు రాగానే ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్, ఆయన టీం దాడులు చేశారు. చంద్రశేఖర్​ను అదుపులోకి తీసుకున్నారు.ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డిని ఏసీబీ మరో టీం బిజినేపల్లి దగ్గర అదుపులోకి తీసుకున్నారు.