కరోనా టీకాల్లో గోల్​మాల్​!

కరోనా టీకాల్లో గోల్​మాల్​!
  • రెండో డోసు వేస్కోకున్నా వేస్కున్నట్టు మెసేజ్‌‌లు
  • ఫస్ట్​ డోస్​ డేటా ఆధారంగా కొవిన్​ పోర్టల్​లో అప్​లోడ్​
  • సెకండ్​ డోస్​ ఎట్లా? అని జనాల ఆందోళన
  • కరోనా టెస్టుల్లాగానే వ్యాక్సిన్ల లెక్కల్లో తేడాలు

హైదరాబాద్​, వెలుగు: కరోనా వ్యాక్సిన్​ వేసుకోకున్నా వేసుకున్నట్టు జనాలకు సర్టిఫికెట్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఒక డోసు వ్యాక్సిన్​ వేసుకున్నోళ్లకు.. రెండో డోసు వేసుకోకున్నా వేసుకున్నట్టు మెసేజ్​లు వచ్చాయి. దీంతో సెకండ్​ డోసు తీసుకోని వాళ్లంతా ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.16 కోట్ల మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్​ పూర్తయింది. ఇంకో 1.24 కోట్ల మంది సింగిల్​ డోసు తీసుకున్నారు. వీళ్లలో సగం మంది గడువు దాటిపోయినా సెకండ్​ డోసు వేసుకోలేదు. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో జనాలు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఇదే అదునుగా ఎక్కువ మందికి వ్యాక్సిన్​ వేసినట్టు లెక్క చూపేందుకు సెకండ్​ డోస్​ వేసుకోనోళ్లకూ వేసుకున్నట్టు సర్టిఫికెట్​ను పంపిస్తున్నారు.  
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్​ వేగంగా సాగడం లేదు. జనాలు ముందుకు రాకపోతుండడంతో వ్యాక్సినేషన్​ స్లో అయిపోయింది. దీంతో కరోనా టెస్టుల సంఖ్యలో చేసిన గోల్​మాల్​నే వ్యాక్సిన్ల విషయంలోనూ ఎంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి టెస్టులు చేయించుకున్నవారు మళ్లీమళ్లీ టెస్టులు చేయించుకున్నట్టుగా ఆన్​లైన్​లో ఎంటర్​ చేసేవారు. ఇప్పుడు తమ వద్ద ఫస్ట్​ డోస్​ తీసుకున్న వాళ్ల వివరాల ఆధారంగా సెకండ్​ డోస్​ తీసుకోకున్నా తీసుకున్నట్టుగా కొవిన్​ పోర్టల్​లో ఎంటర్​ చేస్తున్నారు. కొవిన్​ పోర్టల్​ నుంచి జనాలకు మెసేజ్​లు వెళ్తున్నాయి. కొందరు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో డోసు కూడా తీసుకున్నట్టు మెసేజ్​లు వస్తుండడంతో.. నిజంగా సెకండ్​ డోస్​ వేసుకోవాలనుకుంటే తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు.

రెండు డోసులు తీసుకుంటేనే సేఫ్​

కరోనా ప్రభావం తగ్గడంతో వ్యాక్సిన్​పై జనాల్లో ఆసక్తి తగ్గింది. గంటలకొద్దీ లైన్లలో నిలబడి ఫస్ట్​ డోసు తీసుకున్నవాళ్లే, ఇప్పుడు సెకండ్ డోసు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. అయితే ఒక్క డోసుతోనే రక్షణ లభించదని డాక్టర్లు చెప్తున్నారు. వ్యాక్సిన్​ వేసుకుంటే వచ్చే రక్షణపై మన రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ సర్వే చేయించినట్టు హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాసరావు ఈమధ్య చెప్పారు. అందులో వ్యాక్సిన్​ వేయించుకోనోళ్లే 60 శాతం మంది దవాఖాన్లలో చేరుతున్నట్టు తేలింది. ఫస్ట్​ డోస్​ వేసుకున్నోళ్లలో వందకు 30 మంది ఆస్పత్రుల్లో చేరుతుంటే.. రెండు డోసులూ తీసుకున్నోళ్లలో కేవలం 10 మంది ఉంటున్నారని వెల్లడైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రెండు డోసులనూ కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. 

వ్యాక్సిన్​ తీసుకోకుండానే మెసేజ్​

నిరుడు జూన్​లో నా భర్త, నేను హైదరాబాద్​లో కొవిషీల్డ్​ ఫస్ట్​ డోస్​ వేయించుకున్నాం. సెకండ్​ డోస్​ వేసుకోవడానికి టైమ్​ కుదరకపోవడంతో ఇంకా తీసుకోలేదు. ఈ నెల 12న సెకండ్​ డోస్​ వేసుకున్నట్లుగా మా ఇద్దరికీ మెసేజ్​ వచ్చింది. కనీసం మాకు ఎవరూ సమాచారం కూడా ఇవ్వలేదు. కొవిన్​ పోర్టల్​లోనూ రెండు డోసులు పూర్తయినట్లుగా చూపిస్తోంది. మళ్లీ మేం సెకండ్​ డోస్​ తీసుకోవాలంటే ఎలానో ఏమో అర్థం కావట్లేదు.
- మార్క రమ్యశ్రీ, హనుమకొండ

నిజామాబాద్​లో ఉంటే హైదరాబాద్​లో టీకా వేసుకున్నానట

నేను రెండో డోసు తీసుకోనే లేదు. కానీ, తీసుకున్నట్టు మెసేజ్ వచ్చింది. కొవిన్​ పోర్టల్​లో చూస్తే ఈనెల 13న కొవిషీల్డ్​ రెండో డోసు తీసుకున్నట్టు ఉంది. ఆరోజు నేను నిజామాబాద్​లో ఉన్నాను. హైదరా బాద్​లో ఏదో యూపీహెచ్​సీలో రెండో డోసు తీసుకున్నట్టు, రాధ అనే వ్యాక్సినేటర్​ టీకా వేసినట్టు సర్టిఫికెట్​లో ఉంది. మా ఫ్రెండ్​కూ అట్లనే వచ్చింది. ఆయన నంబర్​తో ఇద్దరు వ్యాక్సిన్​ తీసుకున్నట్టు వచ్చింది. 

- రవి, నిజామాబాద్​