బాన్సువాడ/కామారెడ్డి, వెలుగు : ‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను సీఎం రేవంత్‌రెడ్డిని కలిశా, సీఎం దగ్గర నేను ఏమైనా తీసుకున్నట్లు నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా, స్వార్థం కోసం పని చేశానని, స్వంత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నానని తేలితే చెప్పుతో కొట్టండి’ అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తన నివాసంలో గురువారం మీడియాతో మాట్లాడారు. కొందరు రాజకీయ, వ్యక్తిగత ప్రత్యర్థులు తాను ఏదో ఆశించి సీఎం వెంట వెళ్లానని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనులకు సహకరించాలని సీఎంను కోరానని, ఇందుకు ఆయన అంగీకరించారని చెప్పారు.
కార్యకర్తల ద్వారా రూ. 500 కోట్ల పనులు చేయించానని ఎస్‌డీఎఫ్ బిల్లులు, డబుల్ బెడ్‌రూం బిల్లులు కోసం వారు అడుగుతుంటే.. ఎంతో టెన్షన్ పడ్డానని, నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. 77 టోకెన్ల ద్వారా రూ. 100 కోట్ల బిల్లులకు గానూ.. మొదటి విడతలో రూ. 30 కోట్లు వచ్చాయన్నారు. ఎస్‌డీఎప్, డబుల్ బెడ్‌రూంలకు సంబంధించిన బిల్లులు రావాల్సి ఉందన్నారు. ప్రజలే తన కుటుంబ సభ్యులని, తాను ఉన్నంతకాలం వారి కోసమే బతుకుతానని స్పష్టం చేశారు. తాను బీఆర్‌ఎస్ నుంచే గెలిచానని.. బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని స్పీకర్‌తో చెప్పానన్నారు. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. సమావేశంలో ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్, బాన్సువాడ సహకార పరపతి సంఘం చైర్మన్ ఎరువల కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ గంగాధర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నార్ల రవీందర్, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
