మరో 10 వేల మందిని తీసేస్తున్న ఫేస్ బుక్

మరో 10 వేల మందిని తీసేస్తున్న ఫేస్ బుక్

సోషల్ మీడియా దిగ్గజం  ఫేస్ బుక్ మాతృసంస్థ మోటా మరోసారి ఉద్యోగులకు షాక్‌ ఇవ్వనుంది. ఉద్యోగులను తొలిగించేందుకు రంగం సిద్దం చేసింది. రెండవ రౌండ్ కోతలో 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్  ప్రకటించారు.  మెటా కంపెనీ గత ఏడాది నవంబర్‌లో 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.

ఇప్పటివరకు ఓ టెక్‌కంపెనీ ఇంత పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. కంపెనీ నుంచి తొలగింపునకు గురైన ఉద్యోగులకు 16 వారాల పాటు వేతనం ఇవ్వనుంది సంస్థ. ఆదాయం తగ్గడం, ఆర్థిక మాంద్యం భయాలతో మెటాతోపాటు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఐబీఎం, హెచ్‍పీ సహా మరిన్ని దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తీసేశాయి.

18 సంవత్సరాల ఐటీ రంగంలో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు జరగటం ఇదే అంటున్నారు నిపుణులు. ప్రతి సంస్థ ఉద్యోగులను తీసివేయటానికే ప్రాధాన్యత ఇవ్వటం ఇదే ప్రథమం అంటున్నారు. 2023 సంవత్సరం.. ఇప్పటి వరకు అంటే జనవరి ఒకటి నుంచి మార్చి 14వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు తొలగించిన ఉద్యోగుల సంఖ్య ఒక లక్షా 69 వేలుగా ఉంది. అదే 2022 ఏడాది మొత్తాన్ని తీసుకుంటే ఈ సంఖ్య లక్షా 55 వేల మాత్రమే. గత ఏడాదితో పోల్చుకుంటే.. రాబోయే తొమ్మిది నెలల్లో ఇంకెన్ని లక్షల మంది ఐటీ ఉద్యోగులు నిరుద్యోలుగా మారతారు అనేది చర్చనీయాంశం అయ్యింది.