మెటావర్స్ మాయాబజార్!

మెటావర్స్ మాయాబజార్!

నారదుడు ముల్లోకాలు చక్కర్లు కొడుతూ ఉంటాడని పురాణాల్లో ఉంటుంది. ఒకసారి స్వర్గంలో దేవతలతో, మరోసారి భూమ్మీద మనుషులతో, ఇంకోసారి యక్షులు, గంధర్వులతో.. ఇలా విశ్వమంతా తిరుగుతూ, మంతనాలాడుతూ ఉంటాడు. నారదుడిలాగానే మనకు కూడా మరో లోకాన్ని చూసి ఎక్స్​పీరియెన్స్ చేసే అవకాశం వస్తే ఎంత బాగుంటుందో కదా! ఇప్పటిదాకా మనం కోరుకునే ప్రపంచాన్ని ఊహించుకుంటూనో, కలల్లో దర్శిస్తూనో గడిపాం. ఇక మీదట ఆ ఊహలు నిజం కాబోతున్నాయి. మెటావర్స్ మనల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్ళబోతోంది. టెక్నాలజీ అభివృద్ధిని రేడియో నుంచి టెలివిజన్​కు ఎదగడం, కంప్యూటర్ నుంచి మహా సూపర్ కంప్యూటర్​కు పెరగడం వరకు చూశాం. ఇప్పుడు దానికి అడ్వాన్స్​డ్​ వెర్షన్ తోడవబోతోంది. అదే మెటావర్స్. 

అవతార్ సినిమా చూశారా? అందులో హీరో అతని టీం ఒక ప్రత్యేకమైన ఎక్విప్​మెంట్​ వేసుకుని తమ అవతార్ వెర్షన్​ని పండోరా గ్రహానికి తగ్గట్లు మార్చేసుకుంటారు. అంటే వాళ్లు రియాలిటీలో వేరేగా ఉన్నా, మరో చోట, మరో రూపంలో పండోర వాసులతో కలిసి బతుకుతుంటారు. ఫైటింగ్​లు చేస్తారు. ప్రేమలూ నడుస్తాయి. ఆ పాత్ర జీవితం అంతా ఒట్టిదే అని తెలుసు. అయినా సరే ఎంజాయ్ చేస్తాం. మెటావర్స్ కూడా అంతే ఇదొక డిజిటల్ ప్రపంచం. మన ప్రపంచంలో ఎలాగైతే చుట్టూ మనుషులు. కార్లు, బిల్డింగులు, పార్కులు, వింతలు, విశేషాలు ఉంటాయో... అలాంటి జీవితమే మెటావర్స్​లోనూ ఉంటుంది. కాకపోతే అది డిజిటల్​గా క్రియేటర్స్ రూపొందించింది. ఊహల్లో చూసే అద్భుతాలను సైతం ఆ ప్రపంచంలో మనకోసం తయారుచేసి పెడతారు. అక్కడికి మన డిజిటల్ అవతార్... అంటే వర్చువల్ ప్రపంచంలో ఉండేందుకు మనం తయారుచేసుకున్న మన పాత్ర వెళ్లి, ఆ వింతలు.. విశేషాలను ఆస్వాదిస్తుంది. ఇదే మెటావర్స్ లోకం. అసలిదంతా ఎలా సాధ్యం?   
మెటావర్స్ లోకంలోకి..
భవిష్యత్తులో మెటావర్స్‌‌‌‌ను నిర్మించాలనే లక్ష్యంతో ఫేస్‌‌‌‌బుక్ గత సంవత్సరం తన పేరును మెటాగా మార్చుకుంది. మార్క్ జుకర్ బర్గ్ అంత ముందుచూపుతో ఆలోచించి ఏం చేయబోతున్నాడు!
మెటావర్స్ అనేది నెక్స్ట్ జెనరేషన్ టెక్నాలజీ. ఓ రకంగా ఫ్యూచరిస్టిక్ త్రీడి ఇంటర్నెట్ అని చెప్పొచ్చు. ఫిజికల్ రియాలిటీ, ఆగ్‌‌‌‌మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ కలిసిందే మెటావర్స్. 
మెటావర్స్ సాయంతో జనం ఇంట్లోనే ఉన్నా వర్చువల్ విధానంలో ఒకరినొకరు కలుసుకోవచ్చు. కలిసి పనిచేయొచ్చు. ప్రొడక్ట్స్​ తయారుచేయొచ్చు. 
ఉదాహరణకు... మీ ఫ్రెండ్స్ ఏదైనా టూర్​కు వెళ్లారు. కానీ మీరు వెళ్లలేకపోయారు. అయినా ఏం పర్వాలేదు. ఈ టెక్నాలజీ సాయంతో ఇంట్లో ఉండి మీ ఫ్రెండ్స్​తో కనెక్ట్ అయి టూర్​కి వెళ్లిన ఫీలింగ్​ ఆస్వాదించొచ్చు. ఇదంతా భ్రమే. కానీ అంతా నిజమే అనిపించే భ్రమ. 
ఇప్పటివరకు వీడియో కాలింగ్ యాప్స్​తో ఫోన్​లో మాత్రమే ఫ్రేమ్​లో ఉండి చూసుకోగలుగుతాం. కానీ.. మెటావర్స్​లో మీరెక్కడ ఉన్నా అంటే... పార్క్​, ఇల్లు.. ఇలా ఎక్కడ ఉన్నా మీ సీటులో కూర్చుని ఆఫీస్ మీటింగ్​లో నేరుగా మాట్లాడినట్లు మాట్లాడొచ్చు.
ఓ విధంగా మెటావర్స్ అనేది ఓ త్రీడీ వీడియో గేమ్ లాంటి ఫీల్ ఇవ్వబోతోంది. వర్చువల్ మనిషి చేసే ప్రయాణానికి అంతం ఉండదు. మీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఏ అడ్డంకి ఉండదు. అక్కడ ఉండేది వర్చువల్ మనిషే. కానీ... మనిషి కాని మనిషి. రియల్ టైమ్ ఎక్స్ పీరియెన్స్ అన్నమాట.
 

నచ్చే అవతార్
 స్నాప్​చాట్ లాంటి కొన్ని యాప్స్​ ఫిల్టర్స్​లో మనల్ని చూసుకున్నట్టుగా... మెటావర్స్​లో మనం మన అవతార్​లను డిజైన్ చేసుకోవచ్చు. పబ్​జీ లాంటి గేమ్స్​లో అవతార్​లు పెట్టుకోవడం తెలిసిందే. అలాగే అవతార్​ని తయారుచేసుకోవచ్చు మెటావర్స్​లో. 
ఇప్పుడున్న దానికంటే మరింత అందంగా ఉండేలా మన ఫేస్ తయారు చేసుకోవచ్చు. పొట్టిగా ఉన్నవాళ్ళు పొడుగ్గా కనపడేలా చేసుకోవచ్చు. నచ్చిన బట్టలు సెలక్ట్ చేసుకోవచ్చు. గూడ్స్, వస్తువులు ఇంకా ఎన్నెన్నో ఫీచర్స్​ను వాడి మన అప్పియరెన్స్​ను డిజైన్ చేసుకోవచ్చు. అదే మన మెటావర్స్ రూపం. అయితే దీని ద్వారా వచ్చే ఎక్స్​పీరియెన్స్​ని ఒరిజినల్​గా ఫీల్ అవ్వడం ఎలా? అందుకు ఆప్టిక్ సూట్ వేసుకోవాలి. అది వేసుకుంటే మెటావర్స్ వరల్డ్​లో వర్షం పడితే ఇక్కడ ఉన్న మన మీద వర్షం పడిన ఫీలింగ్​ కలుగుతుంది. అలాగే అక్కడ ఎవరైనా కొడితే ఆ దెబ్బ నొప్పి ఆప్టిక్​ సూట్ మీద ఉన్న మనకి నొప్పి కలిగినట్లు అనిపిస్తుంది. 

పుస్తకాలు ముందే చెప్పాయి
ప్రపంచంలో జరిగే కొన్ని వింతలు, అభివృద్ధి, జరగబోయే మార్పుల గురించి కొన్ని పుస్తకాలు కాలజ్ఞానిలా ముందే చెప్పేశాయి. అలాగే మెటావర్స్ గురించి కూడా 30 ఏండ్ల కిందటే పుస్తకాల్లో చదువుకున్నాం. దీనిపై వచ్చిన సై-ఫై(సైంటిఫిక్) నవలలు అన్నీ సూపర్ పాపులర్ అయ్యాయి. ఫాంటసీ ప్రపంచాన్ని క్రియేట్ చేశాయి.1992లో నీల్ స్టీఫెన్‌‌‌‌సన్ రాసిన ‘స్నో క్రాష్​’లో ఈ ఎక్స్​పీరియెన్స్ ఉంటుంది. మెటావర్స్ అనే పదాన్ని ఈ నవలలో మొదటిసారి వాడారు. మెటా అంటే.. అంతకు మించింది అని అర్థం. ఇది గ్రీకు పదం. వర్స్ అనేది యూనివర్స్ నుంచి తీసుకున్నారు. మొత్తంమీద మెటావర్స్​ అంటే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం అన్నమాట. 
ఈ జనర్​లో పబ్లిష్ అయిన ఎర్నెస్ట్ క్లైన్ పుస్తకం ‘రెడీ ప్లేయర్ వన్’ బెస్ట్ సెల్లర్ అనిపించుకుంది. విలియం గిబ్సన్ రాసిన న్యూరో మాన్సర్​లోనూ ఇదే ముఖ్యమైన థీమ్. 

వెబ్ 3.0
ఇంటర్నెట్ మొదలైనప్పుడు మనం వాడిందంతా వెబ్1.0. అందులో మనం కేవలం బ్రౌజ్ చేసి డేటాను చూడగలుగుతాం. అంతే! ప్రస్తుతం మనం వాడుతున్నది వెబ్ 2.0. ఇందులో మనం కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడున్న సోషల్ మీడియా, యాప్స్, వర్చువల్ రియాలిటీ అన్నీ దీన్లోని అప్​డేటెడ్​ వెర్షన్​లే. ఇంటర్నెట్3.0 జనరేషన్​లో మాత్రమే ఈ మెటావర్స్ సాధ్యమవుతుంది. 

అనేక టెక్నాలజీల కలయిక
మెటావర్స్ ఏ టెక్నాలజీ ద్వారా వీలు పడుతుందో గమనిస్తే ఆశ్చర్యపోతాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీల సాయంతో మెటావర్స్​ను క్రియేట్ చేస్తారు. 

అక్కడ అంబానీలా బతకొచ్చు
వాస్తవానికి ‘మెటావర్స్’ అనేది ఒక సమాంతర ప్రపంచం. అక్కడ మీకు వేరే రకమైన గుర్తింపు ఉంటుంది. ఆ సమాంతర ప్రపంచంలో మీరు ప్రయాణం చేయడం, వస్తువులు కొనడం నుండి...  ఈ ప్రపంచంలో మీ స్నేహితులు, బంధువులను కలవగలరు. మీరు అక్కడ లేకపోయినా దాన్ని ఫీల్​ అవ్వగలరు. 
డిజిటల్ క్యారెక్టర్‌‌‌‌గా రియల్​ ఎక్స్​పీరియెన్స్​ను పొందగలిగే ఇంటరాక్టివ్ స్పేస్ ఇది. అలాగని ఇది నిజం కాదు. కానీ వర్చువల్ ప్రపంచంలో నిజమైన అనుభూతిని పొందగలిగేంత ఎక్స్​పీరియెన్స్​ కలుగుతుంది.
ఉదాహరణకు.. మీరు ఇప్పుడైతే ఫ్రెండ్​ను కలిసేందుకు ఫిజికల్​గా వాళ్ల ఇంటికి వెళ్తారు. అదే మెటావర్స్‌‌‌‌లో అయితే మీరు ఒక చోట ఉండి వేరే దగ్గర ఉన్న దోస్తు ఇంటిని చూడొచ్చు. ఇందుకు వర్చువల్ హెడ్‌‌‌‌సెట్ అవసరం పడుతుంది. అయితే ఇది కేవలం అంతవరకే పరిమితం కాదు. మీరు వర్చువల్ సినిమా హాల్లోకి వెళ్లి సినిమా చూడటానికి మీ ఫ్రెండ్స్​తో కలిసి టిక్కెట్లు కొనొచ్చు. అదే విధంగా మెటావర్స్‌‌‌‌లో డిజిటల్ కచేరీ, మీటింగ్స్ వంటివి కూడా సాధ్యమవుతాయి. 
మీరు ఇంట్లో కూర్చొని ఆఫీసులో అందరితోపాటు మీటింగ్ హాల్లో కూర్చుని స్పీచ్ ఇస్తున్నట్లుగానో,  వరండాలో నడుస్తూ వర్చువల్ ప్రపంచంలో ఏ కాశ్మీర్​లోనో అందాలను ఆస్వాదించొచ్చు. బయటి ప్రపంచంలో బతికినట్టుగానే అక్కడ మీకంటూ ఒక వ్యక్తిత్వం, గుర్తింపు, మీ ఇష్టాయిష్టాలు... ఇలా మీకు సంబంధించిన ప్రతి విషయం మీ ఉనికిని చాటుతుంటుంది. మెటావర్స్​లో మీకు నచ్చిన ఒక పెద్ద ఇంటిని సొంతం చేసుకుని, హైఎండ్​ కారులో చక్కర్లు కొడుతూ... అనుకున్నవి చేయడమే అక్కడి లైఫ్ స్టైల్. 

భవిష్యత్తు మెటావర్స్‌‌‌‌దేనా?  
మెటా మైక్రోసాఫ్ట్​ వంటి కంపెనీలు మెటావర్స్​గా డెవలప్​ చేయడానికి బోలెడంత పెట్టుబడి పెడుతున్నాయి. ఈ పెద్ద టెక్ కంపెనీలు మెటావర్స్‌‌‌‌లో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాయో అర్థం చేసుకుంటే దాని గొప్పతనం ఏంటో తెలుస్తుంది. కనెక్టివిటీ, ఇంటర్నెట్ భవిష్యత్తు మరింత ఇంటరాక్టివ్‌‌‌‌గా ఉండగలగడం, ఎక్కడి నుండైనా పని చేయడం (రిమోట్ వర్కింగ్), కన్జ్యూమర్స్​కు బెస్ట్​ ఎక్స్​పీరియెన్స్​ను అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. 
అయితే మెటావర్స్‌‌‌‌తో ప్రపంచ ఎకానమీలో ఒక కొత్త వాటా సృష్టించొచ్చు. రానున్న పదేళ్లలో... వంద కోట్లమందికి మెటావర్స్ ప్లాట్​ఫామ్​ అవుతుందని అంచనా.

మెటావర్స్ ఆర్థికవ్యవస్థ
మనం కనీసం ఊహించనైనా ఊహించని మార్పు. భవిష్యత్తులో లక్షల కోట్ల వ్యాపారం మెటావర్స్​లో జరగనుంది. దానికి ఉపయోగించే సాధనమే ఈ ఎన్.ఎఫ్.టి. అంటే.. నాన్ ఫంజనుల్ టోకెన్. నిజానికి ఫంజనుల్ అంటే... ఒకే విలువ కలిగిన రెండు వస్తువులని ఒక దాని బదులు మరొకటి రీప్లేస్ చేయొచ్చు. కానీ ఒక యునిక్ పీస్​ని మనం దేనితో రీప్లేస్ చేయలేం. డిజిటల్ మార్కెట్లో మనం అలాంటి యునిక్ పీస్​లను క్రియేట్ చేసుకుంటాం. ఉదాహరణకు ఒక పెయింటింగ్, పాట, ఫొటో... వీటిలో దేన్నైనా సరే ఎన్​.ఎఫ్​.టి.లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా అమ్మాలన్నా, కొనాలన్నా మనకి డిజిటల్ ఓనర్ షిప్ ఉండాలి. దాన్ని టోకెన్ అంటాం. ఇది ఎన్.ఎఫ్​.టి. లో అమ్మకానికి చేసే ప్రాసెస్. ఇదంతా బ్లాక్​చెయిన్​ టెక్నాలజీతోనే జరుగుతుంది. ఇది డీ సెంట్రలైజేషన్ సిస్టం. ఆన్​లైన్​లో ట్రాన్సాక్షన్స్​ అన్నీ పబ్లిక్​కి కనిపిస్తూనే ఉంటాయి. కానీ వాటిని మార్చడం లేదా తీసేయడం అసాధ్యం. అలా మనం అమ్మాలనుకుంటున్నది ఎంతకి అమ్మాలనుకున్నామో ఆ రేట్​కి ముందు బిడ్ వేయాలి. 
ట్విట్టర్ మాజీ సి.ఇ.ఒ. జాక్ టోర్సీ తన ఫస్ట్ ట్వీట్​ని ఎన్​.ఎఫ్​.టి.లోకి మార్చి 2.9 మిలియన్స్​కి అమ్మేశాడు. ఇప్పుడిక ఆ ట్వీట్​ని ఎవరూ మార్చలేరు. 

లేని దాన్ని కొనడం, అమ్మటం!
నిజమే, అసలు ‘‘ఏమీ లేని దాన్ని’’ ఎలా కొనడం. కొనాలంటే ఏదో ఒక వస్తువు రూపంలో ఉండాలి కదా. కానీ మెటావర్స్​లో అంతా కూడా విజువల్స్ రూపంలోనే ఉంటుంది. మనం అక్కడ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు మనకు ఒక ల్యాండ్ కావాలంటే కొనొచ్చు. కానీ వాస్తవ ప్రపంచంలో అక్కడ ఎలాంటి భూమి ఉండదు. 
బయట రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినట్టు వర్చువల్ ప్రపంచంలో సిటీస్ నిర్మిస్తారన్నమాట. అందులో భాగమే ఈ భూములు, ఇండ్ల అమ్మకాలు కూడా. మరి దాని వల్ల ఏమిటి ఉపయోగం అనుకోవచ్చు. దీని వెనుక లక్షలకోట్ల మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. 
ఉదాహరణకు ఒక వస్తువును కొనాలంటే... ఆ షాప్​కి వెళ్లి, ఆ వస్తువు కోసం వెతికి సెలక్ట్ చేసుకుని కొంటాం. మనం ఇంట్లోనే కూర్చొని ఆ షాప్​కి వెళ్లి వెతికిన ఫీలింగ్​ పొందాలంటే ఒక షాపు ఉండాలి. అంటే అది ఏదో ఒక ప్లేస్​లో ఉండి తీరాలిగా. నిజానికి ఆ విధంగా మెటావర్స్​లో అమ్మకాలు జరిపిన మొదటి కంపెనీ మెక్ డొనాల్డ్స్. వీళ్లు ఆన్​లైన్​లో తమ షాపుకోసం స్థలాన్ని కొంటారు. అందులో త్రీడీ రూపంలో షాపు కడతారు. అందులో అమ్మకానికి పెట్టిన వంటకాలన్నీ ఉంటాయి. అలా అందులోకి వెళ్ళిన కస్టమర్ నచ్చిన ఫుడ్​ సెలక్ట్ చేసుకుని  కొంటాడు. అవి నేరుగా ఇంటికి వచ్చేస్తాయి. అంటే... డిజిటల్ ఫ్లాట్​ఫామ్​లో మనం చూసిన ఫుడ్​, అది తయారయ్యాక మన చేతికి వస్తుంది. 
ఇందులో ల్యాండ్ కొనడానికి ప్రజలు ఇప్పటికే మిలియన్ల డాలర్లను ఖర్చు పెడుతున్నారు. ఒకరకంగా ఇది ప్రజలు డిజిటల్ మేనేజ్​మెంట్​ని చూసే విధానాన్ని మెరుగుపరుస్తుంది. డిజిటల్ అసెట్స్​ను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. కానీ మెటావర్స్‌‌‌‌తో ఈ అసెట్స్ విలువ చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో ముఖ్యమైన అంశంగా మారనున్నది. ఎందుకంటే ఇది ప్రజల టైంని సేవ్​ చేస్తుంది. కస్టమర్స్​ నేరుగా కలవాల్సిన అవసరం లేకుండానే వర్చువల్ పద్ధతిలో కలవొచ్చు.
ప్రస్తుత వీడియో కాల్స్​ కంటే చాలా మెరుగ్గా, ఇంటరాక్టివ్‌‌‌‌గా ఉంటుంది మెటావర్స్​ మీట్. బిజినెస్, ఈవెంట్స్​, మీటింగ్స్​, మార్కెట్స్​ మరికొన్నింటిని మెటావర్స్‌‌‌‌లో ఏర్పాటు చేయొచ్చు. అందుకే టెక్ కంపెనీలు ఈ విషయంలో ఎంతో కృషి చేయబోతున్నాయి. 
రిపబ్లిక్ రెల్మ్ అనే సంస్థ 32 కోట్ల రూపాయలు పెట్టి మెటావర్స్‌‌‌‌లో ల్యాండ్స్ కొన్నది. అందులో అమ్యూజ్​మెంట్ పార్క్​లు, క్యాసినో, మ్యూజియమ్స్ డెవలప్ చేస్తారట. గేమ్స్​లో అవతార్​కి కావాల్సిన ఐకాన్స్, వస్తువులు కొనడానికి ఎంతో ఖర్చు పెడుతున్నారు.
వర్చువల్ వస్తువుల అమ్మకాలు కొనుగోళ్లలో సంవత్సరానికి100 బిలియన్ డాలర్లు​.. అంటే  ఏడున్నర లక్షల కోట్ల బిజినెస్​ జరుగుతుందన్నమాట. 
డిజిటల్ కరెన్సీ కంపెనీ గ్రే స్కేల్ సర్వే ప్రకారం..  మెటావర్స్‌‌‌‌లో గూడ్స్ అండ్ సర్వీసెస్ విలువ వన్ ట్రిలియన్ డాలర్ (లక్ష కోట్ల రూపాయలు) ఉంటుంది. కంపెనీలు వస్తువులని అమ్మడం, యాడ్స్ ఇవ్వడం ద్వారా ఇందులో డబ్బు సంపాదిస్తున్నాయి. 

ముందుంది మెటావర్స్ పండుగ
మెటావర్స్ అప్పుడే రియల్​ వరల్డ్​లోకి రాకపోవచ్చు. ఇది పూర్తిగా వర్చువల్ ప్రపంచం. కాబట్టి దీనికి కాస్త టైం కావాలి. వ్యవస్థను డెవలప్ చేయాలంటే తగినంత మొత్తంలో పని చేయాల్సి ఉంటుంది. ఇది నిజంగా ఒక్క టెక్ కంపెనీల వల్ల అయ్యే పని కాదు. చాలా కంపెనీలు తమ మెటావర్స్ టార్గెట్స్​తో ముందుకు వెళ్లడానికి పార్ట్​నర్స్​ని ఏర్పరచుకోవాలని అనుకుంటున్నారు. మెటావర్స్ సక్సెస్​ కావడానికి 5జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లు, ఎ.ఆర్​.(ఆగ్మెంటెడ్​ రియాలిటీ), వి.ఆర్​.  (వర్చువల్​ రియాలిటీ) హెడ్‌‌‌‌గేర్‌‌‌‌లు పెరగాలి.
రకరకాల మెటావర్స్ ఎకానమీలు ఎలా పని చేస్తాయి?  ప్రజలు వాటి ద్వారా ఎలా నావిగేట్ చేస్తారు? అనేది ఇప్పటికీ తెలియదు. చాలామంది వ్యక్తులు స్మార్ట్‌‌‌‌ఫోన్స్​ కంటే మెటావర్స్ చెత్తగా ఉందని చెప్పారు. ఇది ప్రపంచంలోని వాస్తవికతను దూరం చేస్తుందని వాళ్లు భయపడుతున్నారు. అందువల్ల మెటావర్స్​ను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్​గా ఉంటుంది. ఇది వాస్తవమని ప్రజలు అంగీకరించేలా చేయాలి. అలానే ఇంతకు ముందున్న వాటికంటే మెరుగైనదిగా కూడా నిరూపించాలి. ఇందులోకి మైక్రోసాఫ్ట్ ‘మెష్’ పేరుతోనూ రోబ్లాక్స్​ లాంటి అనేక కంపెనీలు బిజినెస్ లోకి అడుగుపెట్టాయి. 

ఆగ్మెంటెండ్ రియాలిటీ
మెటావర్స్ ప్రపంచాన్ని ఆగ్మెంటెండ్ రియాలిటీ కళ్ళతో చూడాలి. ఇది వర్చువల్ రియాలిటీకి మరింత అడ్వాన్స్​డ్​. వీఆర్ హెడ్ సెట్ పెట్టుకోగానే ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. 
ఇవాన్ సదర్లాండ్ అనే సైంటిస్ట్ 1968 లో ‘స్వార్డ్ ఆఫ్ డెమొక్లెస్’ అనే డివైస్ కనిపెట్టాడు. వీటన్నింటికీ అది మొదటి దశ అనే చెప్పొచ్చు. అందుకే అతన్ని ‘ఫాదర్ ఆఫ్ గ్రాఫిక్స్’ అంటారు. వర్చువల్ రియాలిటీలో మనం భాగమైతే. ఆగ్మెంటెండ్ రియాలిటీలో నచ్చిన లొకేషన్​లో మనం కోరుకున్న వస్తువులు పెట్టి చూడొచ్చు. ఉదాహరణకి మనం ఏదైనా షాపింగ్ చేయడానికి వెళ్తాం. అక్కడ టీవీ, ఫ్రిజ్ లేదా మరేదైనా డెకరేషన్ ఐటమ్ కొనాలి అనుకుంటే... మన ఇంట్లో గోడకి టీవీ పెడితే ఎలా ఉంటుందో... దాన్ని మనం ఆగ్మెంటెండ్ రియాలిటీ టెక్నాలజీతో డిజిటల్​గా చూడొచ్చు. మన ఇంటి గోడమీద టీవీ ఎలా ఉంటుందో తెలుస్తుంది. దాంతో క్షణాల్లో డెసిషన్ తీసుకోవచ్చు.
ఈ టెక్నాలజీ మెడికల్, ఆర్కిటెక్చర్ ఇలా అనేక రంగాల్లో వాడుతున్నారు. డిజైనింగ్ రంగానికి ఇది గొప్ప ఆసరా. ఈ టెక్నాలజీ ఉపయోగించే స్నాప్​చాట్ లాంటి యాప్స్​లో ఫిల్టర్స్, కోతి మూతి లాంటి బొమ్మలు మన ప్రొఫైల్​లో వస్తుంటాయి. దీంట్లో మరింత అడ్వాన్స్​డ్ టెక్నాలజీ మిక్స్​డ్ రియాలిటీ. మనకు మెటావర్స్​తో పాటు రాబోయే టెక్నాలజీ ఇది. మెటావర్స్ కలని నిజం చేయడానికి మిక్స్​డ్ రియాలిటీ టెక్నాలజీ వాడి మైక్రోసాఫ్ట్ ‘హాలో లెన్స్’ అనే డివైజ్ తెచ్చింది.
అందరూ ఇలా కూర్చుని ఫాంటసీ లోకంలో ఎంజాయ్ చేస్తుంటే ఉద్యోగాల మాటేమిటి? అనే డౌట్ రావచ్చు. ఉద్యోగాలకు ఢోకా ఏం లేదు. పైగా బోలెడు ఉద్యోగాలకు ఇది తెర తీయబోతోంది. 
మెటావర్స్ టెక్నాలజీని డెవలప్ చేసేందుకు ఇప్పటికే యూరప్​లో పదివేలమంది టెకీలను స్పెషల్ గా రిక్రూట్ చేసుకుంది ఫేస్​బుక్ ఇంక్. రాబోయే రోజుల్లో లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయని కంపెనీ తెలిపింది. సోషల్ మీడియా స్థాయి నుంచి.. తాము జనాన్ని కలిపే వ్యవస్థలోకి అప్​గ్రేడ్ కాబోతున్నామని కంపెనీ చెప్తోంది. ఈ కొత్త టెక్నికల్ వరల్డ్ క్రియేట్ చేసేందుకు లక్షల మంది టెకీలు నిరంతరం పనిచేస్తున్నారని కంపెనీ స్టేట్ మెంట్ ఇచ్చింది.
మెటావర్స్​ను రియాలిటీలోకి తెచ్చేందుకు మైక్రోసాఫ్ట్, ఎన్​విడియా, ఫేస్ బుక్  ఇంక్​, ఎపిక్​ గేమ్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫేస్ బుక్ ఇంక్​(ఇపుడు మెటా) దీనికోసం పెద్దస్థాయిలో కసరత్తు చేస్తోంది. మెటావర్స్ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి తెస్తామంటోంది. మెటావర్స్​లో ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా.. అన్నింటికీ కమ్యూనిటీ స్టాండర్డ్స్​​కు కట్టుబడి మాత్రమే చేయాల్సి ఉంటుందని, సూపర్​విజన్​, నిఘా ఉంటాయని కంపెనీ చెప్తోంది.

ఎంతవరకు సేఫ్​?
ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీకి లాభాలు ఉన్నట్టే కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. కానీ అవి ఏ స్థాయిలో ఉంటాయో దాన్నిబట్టి వాటి ఉపయోగం అంచనా వేయొచ్చు. నిజానికి మెటావర్స్​లో మన అవతార్... అక్కడి ఆర్టిఫిషియల్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ పోతే కొంచెం కష్టమే. అలాగెందుకంటే... అక్కడ అంబానీలా బతికినా, తిరిగి మన ప్రపంచంలోకి వచ్చాక మామూలు లైఫ్​స్టయిలే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒకవేళ అవతార్ అతిగా నచ్చితే.. మన రియల్​ రూపం మనకు నచ్చుతుందా అనేది ప్రశ్న. 
సోషల్ మీడియా దెబ్బకి 24 గంటలు ఫోన్​లో మునిగిపోయే జనం ఇప్పటికే పక్కన ఉన్నవాళ్లను పట్టించుకోవడం మానేశారు. అలాంటిది ఇక ఇంట్లో కూర్చొని వి.ఆర్​ హెడ్​సెట్ పెట్టుకొని రోజంతా ఊహా ప్రపంచంలో బతికితే! ఎదుటి మనుషులను పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? ఆ జీవితాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడితే బయట ఉన్న అసలైన సమస్యల మీద రియాక్ట్ అయ్యే ఛాన్స్​ ఉంటుందా?
అలాగే మెటా ప్రపంచంలో బయట చేయలేని, చేయడానికి భయపడే నేరాలు చేసే అవకాశం ఉంది. అది ఒరిజినల్​గా జరగకపోయినా... అవతలి వాళ్లు కూడా మనలాంటి యూజర్స్ కాబట్టి వాళ్ళు దాని ఎఫెక్ట్​ను ఎదుర్కోక తప్పదు. మనలోని నేరప్రవృత్తి అక్కడ ప్రదర్శించినప్పుడు దానికి శిక్షలు ఎలా పడతాయి? ఎదుటివారిని మాటలతో మానసికంగా వేధిస్తే దానికి ఎవరు సమాధానం చెప్పాలి? అయితే అలాంటి మాటలను మెటావర్స్ మనకు వినిపించకుండా చూడొచ్చు అని కూడా అంటున్నారు. 
ఇప్పటికే టెక్నాలజీ డెవలప్​మెంట్​తో డేటా చోరీ బాగా పెరిగిపోయింది. ఫేస్​బుక్ తన యూజర్స్ డేటా అమ్ముకుంటున్న ఆరోపణ ఇప్పటిది కాదు. వాళ్లు మెటా వరల్డ్ క్రియేట్ చేస్తే ఆ డేటా సంగతేంటి?  వ్యక్తులు పర్సనల్ డేటా అంతా స్వార్థపరుల చేతుల్లోకి పోయే ప్రమాదం లేకపోలేదు. 
ఈ మధ్యకాలంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎక్స్​పీరియెన్స్ చేసిన కొందరికి చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఆకతాయిలు అందులో మహిళలని ఇబ్బంది పెట్టడం జరిగింది. మెటావర్స్ సాధ్యమైతే దీనికి కూడా కొన్ని చట్టాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. భవిష్యత్తు మనల్ని ఏ ఊహా ప్రపంచానికి నడిపిస్తుందో.. చూడాల్సిందే. 

వర్చువల్ మీటింగ్​లో మోడీ
2014లో జరిగిన ఎలక్షన్​ మీటింగ్​కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్​గా అటెండ్ అయ్యారు. దాని ద్వారా తొమ్మిది లోక్​సభ నియోజకవర్గాల్లో కనిపించారు. ఈ మీటింగ్ జరుగుతున్నంతసేపు మోడీ గుజరాత్​లోని గాంధీనగర్​లో ఒక స్టూడియోలో ఉన్నారు. మోడీ ఆ స్టూడియోలో ఉండి మాట్లాడుతుంటే శాటిలైట్​ ద్వారా వేరే ప్లేస్​ల్లో కనిపించారు. దీనికోసం త్రీడి హాలోగ్రాఫిక్ టెక్నాలజీ వాడారు. దాంతో ఒకేసారి అన్ని చోట్లా కనిపించగలిగారు. ఒక వ్యక్తి ఒకేసారి వేరువేరు ప్లేస్​ల్లో త్రీ డైమెన్షనల్‌‌గా కనిపించేలా స్పెషల్ కెమెరాతో తీశారు. అందువల్ల చూసేవాళ్లకు కనిపించే వ్యక్తి ఎదురుగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ వ్యక్తితో ఇంటరాక్ట్ అవ్వాలంటే త్రీడి గ్లాసెస్​ పెట్టుకోవాలి. 

వర్చువల్ కరెన్సీ
ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అనిపిస్తే దాన్ని భ్రమ అంటారు. కానీ రాబోయే రోజుల్లో భ్రమే నిజం. నిజమే భ్రమ కాబోతుంది. ఇప్పటి వరకు చేతుల్లో ఉన్న డబ్బు కూడా మాయా ప్రపంచంలోకి వెళ్లిపోయింది. క్రిప్టో కరెన్సీ పేరుతో డిజిటల్ కరెన్సీ వచ్చింది. ఇది పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే లాంటి కనిపించని కరెన్సీనే. దీన్ని వర్చువల్, ఎన్​క్రిప్షన్ కరెన్సీ అని కూడా అంటారు. ఈ డబ్బుని ముట్టుకోలేం. దాచుకోలేం. ఇది ఏ దేశానికీ చెందింది కాదు. దీనిపై ఏ గవర్నమెంట్​కి, బ్యాంక్​కి అధికారం ఉండదు. లావాదేవీలన్నీ ఇంటర్నెట్​లోనే జరుగుతాయి. ఈ వర్చువల్ కరెన్సీ.. క్రిప్టోగ్రఫీ సూత్రంపై పనిచేసే బ్లాక్‌‌‌‌చెయిన్ టెక్నాలజీ నుంచి తయారుచేసింది. అందుకే ఈ కరెన్సీని హ్యాక్ చేయలేరట. దీని విలువ కూడా ఒకేలా ఉండదు. చెల్లించేవారిపై ఆధారపడి ఉంటుంది. రూపాయి, డాలర్, యూరోలాగా క్రిప్టో కరెన్సీలో ఉండే డబ్బుని బిట్​కాయిన్, లైట్​కాయిన్, రిపుల్, ఎరిథ్రియం అని పిలుస్తారు. 

సినిమాల్లో...
గ్రాఫిక్స్​, వీఎఫ్​ఎక్స్​లు.. ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తాయి. బాలీవుడ్​లోనూ ‘క్రిష్​3’ లాంటి సినిమాల్లో గ్రాఫిక్ వర్క్​ బాగా కనిపించింది. సౌత్ ఇండియన్ సినిమాల్లో డైరెక్టర్​ శంకర్ వీటిని బాగా వాడతాడు. ఆయన తీసిన ‘ప్రేమికుడు’ సినిమాలో ‘ముక్కాలా.. ముక్కాబులా’ సాంగ్​లో కాసేపు ప్రభుదేవా ఇన్​విజిబుల్ మ్యాన్​గా కనిపిస్తాడు. ఆ తర్వాత ఐశ్వర్యారాయ్ డెబ్యూగా చేసిన మూవీ ‘జీన్స్’​లో ‘కన్నులతో చూసేది గురువా..’ పాటను మోషన్ క్యాప్చర్ ప్రిమిటివ్​ మోడ్​లో తీశాడు. త్రీడి హాలోగ్రాఫిక్స్ వాడి ‘లేని మనిషిని ఉన్నట్టు ‘ఫేక్’ పర్సన్​ని చూపించాడు. ఇప్పుడైతే రాజమౌళి తీసిన ‘బాహుబలి’లో గ్రాఫిక్స్​, వీఎఫ్​ఎక్స్​లు కనిపించాయి. ఇదంతా మెటావర్స్​ కాదు. మెటావర్స్​కి రిలేటెడ్ టెక్నాలజీ. 

బ్లాక్ చెయిన్ టెక్నాలజీ
మెటావర్స్ సాధ్యం కావాలంటే దానికి అవసరమైన టెక్నాలజీ బ్లాక్ చెయిన్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ కార్యకలాపాలే!! ఇలాంటి పరిస్థితుల్లో.. ఆ లావాదేవీలను తేటతెల్లంగా.. ఎలాంటి లోపాలు లేకుండా.. హ్యాకింగ్‌‌‌‌ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది ప్రత్యేకమైన టెక్నాలజీతోనే సాధ్యం. అదే..

బ్లాక్‌‌‌‌చెయిన్‌‌‌‌ టెక్నాలజీ!!  
లావాదేవీల్ని రకరకాల లెవల్స్​లోని వ్యవస్థ ద్వారా నడుపుతూ.. హ్యాకింగ్‌‌‌‌కు గురికాకుండా.. ఇన్ఫర్మేషన్​ను అత్యంత భద్రంగా ఉంచేదే బ్లాక్‌‌‌‌ చెయిన్‌‌‌‌ టెక్నాలజీ. ప్రస్తుతం ఆర్థిక పరమైన లావా దేవీలు, భూముల రిజిస్ట్రేషన్, క్రిప్టో కరెన్సీ వంటివి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే చేస్తున్నారు. ఇలాంటి లావాదేవీల్లో ఎలాంటి మోసాలు జరగకుండా బ్లాక్‌‌‌‌ చెయిన్‌‌‌‌ టెక్నాలజీ రక్షణ కల్పిస్తుంది. గత కొన్నేళ్లుగా బ్లాక్‌‌‌‌ చెయిన్‌‌‌‌ టెక్నాలజీ అనేక రంగాలకు విస్తరించింది. ఇది ఒక పటిష్టమైన సైబర్‌‌‌‌ సెక్యూరిటీ సిస్టమ్​. 

ఇది ఎలా పనిచేస్తుంది!      
బ్లాక్‌‌‌‌ చెయిన్‌‌‌‌ టెక్నాలజీలో.. ప్రతి లావాదేవీలోనూ దానికి సంబంధించిన వాళ్లందరి వివరాలు ఒక్కో బ్లాక్‌‌‌‌గా ఏర్పడతాయి. ఒక బ్లాక్‌‌‌‌లో ఉన్న వాళ్లతో కొత్త లావాదేవీ జరిగితే.. అది అంతకుముందే ఏర్పడిన బ్లాక్‌‌‌‌కు అనుబంధంగా మరో ప్రత్యేకమైన బ్లాక్‌‌‌‌గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్‌‌‌‌లన్నీ చెయిన్‌‌‌‌లాగా ఏర్పడతాయి. ఈ మొత్తం చెయిన్‌‌‌‌లో ఏ బ్లాక్‌‌‌‌లో.. చిన్న మార్పు జరిగినా.. ఆ లావాదేవీ జరిగిన బ్లాక్‌‌‌‌లో నమోదవుతుంది. ఇది నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో చేరిపోతుంది. దీంతో..ఏమాత్రం తేడా వచ్చినా చెయిన్‌‌‌‌లోని వాళ్లందరికీ తెలిసిపోతుంది. సిస్టమ్​ ఇలా ఉండడం వల్ల మోసాలు అరికట్టొచ్చు. వాస్తవానికి బ్లాక్‌‌‌‌చెయిన్‌‌‌‌ టెక్నాలజీని.. పదేండ్ల కిందటే బిట్​కాయిన్‌‌‌‌ వంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసం రూపొందించారు. క్రిప్టో కరెన్సీలో వ్యక్తులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే మాట్లాడతారు. బ్లాక్‌‌‌‌ చెయిన్‌‌‌‌ టెక్నాలజీ పనితీరు బాగుండటంతో ఇతర రంగాలు దీన్ని వాడుతున్నాయి. ముఖ్యంగా డబ్బు, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించే బ్యాంకింగ్‌‌‌‌ రంగం బ్లాక్‌‌‌‌ చెయిన్‌‌‌‌ టెక్నాలజీ వాడకంలో ఫస్ట్​ప్లేస్​లో ఉంది.
ఆ తర్వాత... రిటైల్, ఇ-కామర్స్, మొబైల్‌‌‌‌ వ్యాలెట్స్, హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌ డిపార్ట్​మెంట్స్​ ఉన్నాయి. గవర్నమెంట్​ డిపార్ట్​మెంట్స్​లో కూడా ఈ మధ్య  బ్లాక్‌‌‌‌ చెయిన్‌‌‌‌ బేస్డ్​ పనులు పెరిగాయి. ముఖ్యంగా ల్యాండ్​ రిజిస్ట్రేషన్స్‌‌‌‌లో ఈ టెక్నాలజీ ఎక్కువగా వాడుతున్నారు. ఎన్నికల సంఘం కూడా బ్లాక్‌‌‌‌ చెయిన్‌‌‌‌ టెక్నాలజీ సాయంతో.. ఓటర్ల జాబితాను కలపడంతో పాటు, ఓటర్లు తమ ఓటును ఎక్కడి నుంచైనా వేసేలా చేయాలనే ఆలోచనలో ఉంది. హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌ రంగంలో.. పేషెంట్స్​కు చేసే టెస్ట్​ల వివరాలను బ్లాక్‌‌‌‌చెయిన్‌‌‌‌ టెక్నాలజీ మెథడ్​లో ఎంటర్​చేస్తున్నారు. దీనివల్ల టెస్ట్​లు చేసేటప్పుడు  ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, టైం వేస్ట్​కాకుండా.. బ్లాక్​చెయిన్‌‌‌‌ టెక్నాలజీ ఉపయోగపడుతోంది.

వర్చువల్ గ్యాంగ్ రేప్ 
వర్చువల్ వరల్డ్‌‌లో మహిళపై సామూహిక అత్యాచారయత్నం జరగడం ఇంగ్లాండ్‌‌లో కలకలం రేపింది. మెటావర్స్‌‌లో చేరిన 60 సెకన్ల లోపే గ్యాంగ్‌‌రేప్​కు (Metaverse Gang-Rape) గురయ్యానని 43 ఏళ్ల నినా జేన్ పటేల్ కంప్లైంట్ చేసింది. ‘గత ఏడాది చివర్లో మెటా రూపొందించిన వి.ఆర్​. ప్లాట్‌‌ఫామ్ హారిజన్ వరల్డ్స్‌‌లో బీటా టెస్టర్‌‌గా ఉన్నా. నా వర్చువల్ అవతార్‌‌ను  మానసికంగా, లైంగికంగా వేధించారు. నాలుగు మగ అవతార్​లు నా అవతార్‌‌పై సామూహిక అత్యాచారం చేసి, ఫోటోలు తీశారు. ఆ భయంకరమైన అనుభవం ఒక పీడకల’ అని చెప్పిందామె. వర్చువల్ వరల్డ్ బీటా ఇంకా టెస్టింగ్‌‌లో ఉంది. ఇంట్లో కూర్చోని మీటింగ్స్​, స్పోర్ట్స్​, కామెడీ వంటి లైవ్ ఈవెంట్‌‌లను చూసి, తాము అక్కడ ఉన్నట్టు ఫీల్ అవ్వొచ్చని మెటా చెప్పింది. ఇండస్ట్రీస్​ అన్నీ ఒకే ప్లాట్​ ఫామ్ పైకి రావాలి. అలాగే మెటావర్స్‌‌లో సెక్యూరిటీ రూల్స్​ కూడా ఉండాలి. 

భారత్​లో మెటావర్స్
ప్రతిరోజూ మొబైల్‌‌లో ఎక్కువ టైం ఉంటున్న దేశాల్లో మనదేశం ఒకటి. మెటావర్స్​ వచ్చిన తర్వాత ఇండియన్ స్క్రీన్ టైమ్ గతం కంటే పెరుగుతుంది. భారతదేశంలో 5జీ సేవలను మొదలుపెట్టినప్పుడు మెటావర్స్‌‌కు ఇది హెల్ప్​ చేస్తుందని ఒక రిపోర్ట్ చెప్పింది. 6జీ వచ్చిన తర్వాత ఇది మరింత వేగవంతం కానుంది. తొలి రోజుల్లో మెటావర్స్ ఎఫెక్ట్  గేమింగ్ ఇండస్ట్రీపై కనిపించింది. అయితే భారతదేశంలో గేమింగ్ ఇంకా మొదటి స్టేజ్​లోనే ఉంది. కాస్త ఆలస్యమైనా మెటావర్స్ వాడకం పెరిగే అవకాశం ఉంది. 

మొదటి కళాకారుడు
73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ గాయకుడు దలేర్ మెహందీ మెటావర్స్‌‌లో స్పెషల్ షో చేశాడు. దీంతో ఈ ప్లాట్‌‌ఫాంలో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మెటావర్స్ వేదికల్లో ఒకటైన పార్టీ నైట్‌‌లో దలేర్ ఈ పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ విషయాన్ని దలేర్ మెహందీ ఓ వీడియో తీసి పోస్ట్ చేశాడు. ట్రావిన్ స్కాట్, జస్టిన్ బీబర్, మార్ష్‌‌మెల్లో లాంటి గ్లోబల్ పాప్ కళాకారులు మెటావర్స్‌‌లో గతంలో ఈవెంట్స్​ చేశారు.
ఇండియన్ ప్లాట్‌‌ఫాం పార్టీ నైట్‌‌ మెటావర్స్ మార్కెట్‌‌లో కీ రోల్ కానుంది. పార్టీ నైట్ మొత్తం మీద న్యూ ఎక్స్​పీరియెన్స్​ను ఇస్తోంది. గేమ్స్ ఆడటానికి, ఎన్ఎఫ్‌‌టీలను సంపాదించడానికి ఈ ప్లాట్‌‌ఫాం అనుకూలంగా ఉంది. పార్టీ నైట్ బ్లాక్ చెయిన్ బేస్డ్ డిజిటల్ వరల్డ్​. ఇక్కడ ప్రజలు తగిన అవతార్‌‌లతో ఫ్రెండ్స్‌‌తో మీటింగ్స్ పెట్టుకోవచ్చు. కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు. అంతేకాకుండా అందరూ కలిసి చేసుకునే పార్టీ ఈవెంట్లు కూడా ఉంటాయని ఈ మెటావర్స్ ప్లాట్‌‌ఫాం చెబుతోంది. 
భారత్‌‌లో కూడా అనేక మెటావర్స్ స్టార్టప్స్ వస్తున్నాయి. అలా ఈ ప్లాట్‌‌ఫాం నెమ్మదిగా విస్తరిస్తోంది. భారత్‌‌లో అతిపెద్ద టి–సిరీస్ కూడా హంగామా టీవీ పార్ట్​నర్​షిప్​తో మెటావర్స్‌‌లోకి వస్తున్నట్లు చెప్పింది. కంటెంట్ క్రియేటర్స్, డిజైనర్స్ (ముఖ్యంగా 3డీ మోడలింగ్, వర్చువల్ రియాలిటీ ఎక్స్​పర్ట్స్​)కు ముందుముందు లెక్కలేనన్ని అవకాశాలు రానున్నాయి.

మెటావర్స్​ రిసెప్షన్
మన దేశంలో తొలిసారి మెటావర్స్ రిసెప్షన్​ జరిగింది. తమిళనాడులోని శివలింగపురానికి చెందిన దినేష్, జనగనందిని ఐఐటి మద్రాసులో ప్రాజెక్ట్ అసోసియేట్స్. దినేష్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి సంబంధించిన వర్క్ చేస్తుండటంతో దీనిమీద అతనికి మంచి అవగాహన ఉంది. దాంతో తనకు వర్చువల్ పద్ధతిలో రిసెప్షన్​ చేసుకోవాలని ఉందని వధువుకు చెప్పి ఒప్పించాడు. అంటే రిసెప్షన్​కు వచ్చే బంధువులంతా వాళ్ల వాళ్ల ఇండ్లలోనే ఉండి ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ల అవతార్​ల రూపంలో ఒక చోట కలుస్తారన్న మాట. దాని కోసం వధూవరులిద్దరూ రిహార్సల్స్ కూడా చేశారు.

టెక్ వర్స్
2026కల్లా ప్రపంచంలో 25 శాతం మెటావర్స్​లో రోజుకి ఒక గంటైనా స్పెండ్ చేస్తారని రీసెర్చ్​లో తేలింది. అంటే మెటావర్స్​ ఎఫెక్ట్​ జనాల మీద ఎంత ఉండబోతుందో ఊహించొచ్చు. అందుకే టెక్​ మహీంద్రా కంపెనీ కూడా బిజినెస్​లో మెటావర్స్​ని వాడాలని డిసైడ్​ అయింది. రీసెంట్​గా టెక్​ మెటావర్స్​ సర్వీస్​లను టెక్​ఎమ్​వర్స్​ పేరుతో లాంచ్​ చేసింది. ఇందుకోసం మొదటి ఏడాది డల్లాస్​, లండన్, పుణె, హైదరాబాద్​ల నుంచి వెయ్యిమంది ఉద్యోగులను అపాయింట్ చేసుకోవాలి అనుకుంటోంది. ముందుగా కారు డీలర్ షిప్, డీలర్​వెర్స్​, నాన్​ ఫంజిబుల్ టోకెన్​ మార్కెట్ ప్లేస్, మిడిల్ మిస్ట్, వర్చువల్ బ్యాంక్​ని మెటాబ్యాంక్, గేమింగ్ సెంటర్​లలో మొదలుపెట్టబోతోంది. 

::: చరణ్ పరిమి