వారం పాటు వానలు లేనట్టే!

వారం పాటు వానలు లేనట్టే!
  • రాష్ట్రం నుంచి దూరంగా అల్పపీడనం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, సైక్లోనిక్ సర్క్యులేషన్ తెలంగాణ నుంచి దూరంగా.. ఒడిశా తీరం నుంచి చత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్ వరకు వెళ్లిపోయినందుకే రాష్ట్రంలో వర్షాలు కురిసే చాన్స్ లేదని వెల్లడించింది. దక్షిణాదిలో వారం పాటు కేరళ, కర్నాటక రాష్ట్రాల్లోనే వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా తెలిపింది. ఇక నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గానే కదులుతున్నాయి. రెండు వారాలు ఆలస్యంగా మన స్టేట్​లోకి ఎంటరైన రుతుపవనాలు.. ఆ తర్వాత రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించాయి. మొదటి రెండుమూడు రోజులు వర్షాలు బాగానే దంచికొట్టాయి. అల్పపీడన ప్రభావంతో మంగళవారం కూడా పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి.

దీంతో రైతులు ఇప్పుడిప్పుడే నార్లు పోసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ రాబోయే ఐదు రోజులు  వర్షాలు పడే చాన్స్ లేదని వాతావరణ శాఖ తాజా బులెటిన్​లో పేర్కొనడంతో రైతులకు ఆందోళనకర పరిస్థితి ఎదురుకానుంది. కాగా, మంగళవారం ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా పిప్పల్​ధారిలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో 2.1, నిర్మల్ జిల్లా జామ్​లో 1.7, సిద్దిపేట జిల్లా శనిగరం, సంగారెడ్డి జిల్లా అన్నాసాగర్​లో 1.6 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 1.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.