MI vs CSK: ధోని హ్యాట్రిక్ సిక్స్‌లు.. .. ముంబై ఎదుట భారీ లక్ష్యం

MI vs CSK: ధోని హ్యాట్రిక్ సిక్స్‌లు.. .. ముంబై ఎదుట భారీ లక్ష్యం

వాంఖడే గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. ముంబై బ్యాటింగ్ లైనప్‌కు తగ్గట్టు సరైన లక్ష్యాన్ని నిర్ధేశించారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(69), శివమ్ దూబే(66 నాటౌట్) హాఫ్ సెంచరీలు బాదగా.. ధోని(20 నాటౌట్; 4 బంతుల్లో 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

రహానే విఫలం.. రుతురాజ్ జోరు

టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి మంచి ఆరంభం లభించలేదు. 8 ప‌రుగుల వ‌ద్ద అజింక్యా ర‌హానే(5) వెనుదిరిగాడు. ముంబై పేస‌ర్ కొయేట్జీ బౌలింగ్‌లో భారీ షాట్ ప్ర‌యత్నించి ప్యాండ్యాకు దొరికాడు. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన రుతురాజ్(69; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆదినుంచే బాదడం మొదలుపెట్టాడు. మరో ఎండ్‌లో రచిన్ రవీంద్ర(21) సైతం ధాటిగా ఆడాడు. దీంతో చెన్నై తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ఆ సమయంలో ర‌చిన్ ర‌వీంద్ర (21)ని శ్రేయాస్ గోపాల్ పెవిలియ‌న్ పంపాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన దూబే(69; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్ లు).. రుతురాజ్ కలిసి వీర విహారం చేశాడు.

దూబే మెరుపులు.. ధోని హ్యాట్రిక్ సిక్స్‌లు 

మొదట్లో కాస్త నిదానంగా ఆడిన దూబే.. క్రీజులో కుదురుకున్నాక ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హార్దిక్ పాండ్య వేసిన 10వ ఓవర్‌లో 3 బౌండరీలు రాబట్టాడు. అనంతరం రొమారియో షెఫర్డ్ వేసిన 14వ ఓవర్‌లో వరుసగా 6, 6, 4 బాదాడు. ఆ ఓవర్ ఆఖరి బంతిని ఋతురాజ్ బౌండరీగా మలచడంతో మొత్తంగా 14వ ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి. చివరలో ధోని(20 నాటౌట్) సైతం మెరుపులు మెరిపించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. దీంతో చెన్నై భారీ స్కోర్ చేసింది.

ముంబై బౌలర్లలో బుమ్రా, నబీ మినహా అందరూ విఫలమయ్యారు. ఆకాష్ మద్వల్ 3 ఓవర్లలో 37 పరుగులివ్వగా.. రొమారియో షెఫర్డ్ 2 ఓవర్లలో 33, హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకున్నాడు.