గజగజ.. తీవ్ర తుఫానుగా మిచౌంగ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

గజగజ.. తీవ్ర తుఫానుగా మిచౌంగ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

మిచౌంగ్ తుఫాను తెలుగు రాష్ట్రాలను బీభత్సంగా వణికిస్తోంది. తీవ్ర తుఫానుగా మారిన మిచౌంగ్.. డిసెంబర్ 4న అర్థరాత్రి 2.30గంటలకు ఇసుపల్లి వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ సైక్లోన్ నెల్లూరుకు 20కి,మీ. బాపట్లకు 10కి.మీ దూరంలో కేంద్రీకృతం అయినట్టు సమాచారం.

స్కూళ్లకు సెలవు

మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇక జగిత్యాల జిల్లాలో కురుస్తోన్న వర్షానికి ధాన్యం అంతా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరెంజ్, యెల్లో అలర్ట్

సైక్లోన్ ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, యెల్లో అలర్ట్ లు జారీ చేసింది. సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, యాదాద్రి భుననగిరి, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాలకు మాత్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది.

ఏపీలో..

విశాఖ, నెల్లూరు, మన్యం వంటి పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఇవి గంటకు 40-50కి.మీ వేగంతో వీస్తున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, మహబూబ్ నగర్, నల్గొండ, భద్రాచలం, ఖమ్మం, ములుగు జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. మిచౌంగ్ తుఫాన్ వల్ల బాపట్ల, నెల్లూరులో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక రెడ్ అలర్ట్ ప్రాంతాల్లో 20సెం.మీ. వర్షాపాతం నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు. ఎడతెెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. రోడ్లన్నీ వరదనీటితో జలమయమయ్యాయి.