మిచౌంగ్ తుఫాన్ బీభత్సం .. ఏపీలో నష్టం ఎంత?

మిచౌంగ్ తుఫాన్ బీభత్సం .. ఏపీలో నష్టం ఎంత?

మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ లో బీభత్సం సృష్టిస్తోంది. డిసెంబర్ 5న బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్.. వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాలు, ఈదురు గాలులు, సుడిగాలులకు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా.. ఇప్పుడిప్పుడే తుఫాను దిశ మార్చుకుంటున్నందున తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాను నేపథ్యంలో కోస్తా, రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో డిసెంబర్ 6న కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి,  బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తుఫాన్ బలహీనపడుతున్నప్పటికీ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంటున్నారు. 

మిచౌంగ్ తుఫాన్ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. సూర్యలంక బీచ్‌ వద్ద కొత్తగా నిర్మించిన పోలీస్‌ వాచ్‌ టవర్‌ సైతం పాడైంది. పలు జిల్లాల్లో భారీ ఎత్తున పంట నష్టం సంభవించింది. నెల్లూరులోనూ తుఫాను, పెనుగాలుల కారణంగా చిన్న చిన్న వృక్షాలే కాదు.. భారీ వృక్షాలు కూడా నేలమట్టం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంటి కప్పులు లేచిపోగా, మరి కొన్ని ఏరియాల్లో ఇంటి గోడలు కూలిపోయాయి. వీటిని తొలగించడానికి అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటించింది