అడ్డగోలుగా వడ్డీలతో దోపిడి .. మైక్రో ఫైనాన్స్ పంజా!..మహిళా సంఘాలే టార్గెట్ గా దందా

 అడ్డగోలుగా వడ్డీలతో దోపిడి .. మైక్రో ఫైనాన్స్ పంజా!..మహిళా సంఘాలే టార్గెట్ గా దందా
  • అధిక వడ్డీలతో అడ్డగోలుగా దోపిడీ
  • కిస్తీ లేట్ ​అయితే రికవరీ ఏజెంట్ల వేధింపులు
  • బెల్లంపల్లిలో పోలీసులకు బాధితుల ఫిర్యాదు

బెల్లంపల్లి, వెలుగు: మహిళల జీవితాలను, కుటుంబాలను ఆగంజేసిన మైక్రో ఫైనాన్స్ సంస్థల దందా మళ్లీ మొదలైంది. సింగరేణి కోల్​బెల్ట్ పారిశ్రామిక ప్రాంతమైన బెల్లంపల్లి కేంద్రంగా జోరుగా సాగుతోంది. ఆర్థిక స్వావలంబన పేరుతో నమ్మించి మహిళలకు పలు సంస్థలు అధిక వడ్డీలకు లోన్లు ఇస్తూ దోపిడీకి పాల్పడుతు న్నాయి. రూ. కోట్లలో బిజినెస్ చేస్తున్నాయి. లోన్లు తీసుకున్న మహిళలు తిరిగి చెల్లించలేక ఇబ్బందుల పాలవుతున్నారు. 

బెల్లంపల్లి కాల్​టెక్స్, బాబు క్యాంప్ బస్తీల్లో పది వరకు మైక్రో ఫైనాన్స్ సంస్థలు దందా కొనసాగిస్తున్నాయి. ఆయా కాలనీల్లో ఆఫీసులను ఏర్పాటు చేసి సీక్రెట్ గా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నా యి. లోకల్​గా ఏజెంట్లను నియమించుకొని మహిళలను నమ్మించి లోన్లు అందిస్తున్నాయి. ఇప్పటికే ఆయా సంస్థలు రూ.30 కోట్లను లోన్లుగా ఇచ్చినట్టు సమాచారం.  

ఐదు నుంచి పది మందితో గ్రూపులు 

ముందుగా ఏజెంట్లు మహిళలకు మాయమాటలు చెప్పి ఐదు నుంచి పది మందితో గ్రూపులు ఏర్పాటు చేయిస్తున్నారు. ఆధార్, ఓటర్ ఐడీ కార్డులతో మెంబర్​షిప్​కల్పిస్తున్నారు. ఇలా ఒక్కో సంస్థ 3 వేల నుంచి 6 వేల మంది మహిళలను గ్రూపు మెంబర్లుగా చేర్చుకున్నట్టు తెలిసింది. కుటుంబ అవసరాలకు డబ్బు తీసుకున్నవారు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రికవరీ ఏజెంట్లు వేధింపులకు పాల్పడుతున్నా రు. 

లోన్లు ఇచ్చేటప్పుడే చెల్లించే స్తోమత ఉందా.. లేదా, ఎందుకోసం తీసుకుంటున్నారనేది పట్టించుకోవడం లేదు. గతంలో ఓ మహిళ పలువురు మహిళల పేరిట రూ.45 వేల చొప్పున లోన్లు తీసుకుని వారికి రూ.5వేలు ముట్టజెప్పింది.  మిగతా డబ్బులు స్వాహా చేసింది. సదరు మహిళలను అప్పు కట్టాలని రికవరీ ఏజెంట్లు వేధించడంతో ఇటీవల పలువురు బాధితులు బెల్లంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.  

అధిక వడ్డీలతో దోపిడీ 

మైక్రో ఫైనాన్స్​సంస్థలు ఒక్కో మహిళకు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు అధిక వడ్డీలకు లోన్లు ఇస్తున్నాయి. తీసుకున్న అప్పును నెలవారీ వాయిదాల్లో రెండేండ్లలో చెల్లించాలి. ఇలా రూ.30 వేలకు నెలకు రూ.1,650, రూ.45 వేలకు రూ.2,470, రూ.56 వేలకు రూ.2,670, రూ.60 వేలకు రూ.3,324 వసూలు చేస్తున్నాయి. నెల నెలా కిస్తీలు చెల్లించలేని మహిళలపై రికవరీ ఏజెంట్లు తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారు. ఆర్ బీఐ అనుమతులను సాకుగా చూపిస్తూ బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఇలాంటి కొత్త తరహా దందా చేస్తున్నట్టు స్థానికంగా చర్చ సాగుతోంది. 

ఇంటి ముందు కూర్చొని దౌర్జన్యం చేశారు

నేను ఫిన్ కేర్ ఫైనాన్స్ లో పలుమార్లు లోన్లు తీసుకున్నా. గతంలో తీసుకున్న లోన్లను పూర్తిగా కట్టాను. ప్రస్తుతం తీసుకున్న రూ.50 వేలల్లో రెండు నెలలుగా కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగాలేక కిస్తీలు చెల్లించలేదు. నలుగురు ఏజెంట్లు మా ఇంటికి వచ్చి వెంటనే లోన్ కట్టాలని కూర్చొని దౌర్జన్యం చేశారు. న్యాయం చేయాలని కలెక్టర్ కు, పోలీసులకు ఫిర్యాదు చేశాను. 

- ఎస్.స్వాతి, అశోక్ నగర్, బెల్లంపల్లి-