
- తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ద్వారా మనిషి శరీరంలోకి
- పేగుల నుంచి బ్లడ్ ద్వారా ఎముక మజ్జలోకీ చేరుతున్న సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు
- 5 మి.మీ. కన్నా తక్కువ సైజ్ ప్లాస్టిక్ కణాల ఆనవాళ్లు గుర్తింపు
- మైక్రోప్లాస్టిక్స్ తో పటుత్వం కోల్పోతున్న ఎముకలు
- బోన్ రీగ్రోత్ లోపాలు, కీళ్ల వ్యాధులు, రక్తహీనత ముప్పు పెరుగుదల
హైదరాబాద్, వెలుగు:తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ద్వారా ఇప్పటికే మనిషి శరీరంలోని అనేక అవయవాల్లోకి ప్రవేశించి తిష్ట వేస్తున్న ప్లాస్టిక్ భూతం.. తాజాగా ఎముకల్లోనూ బయటపడింది. తొలిసారిగా మనిషి ఎముక మజ్జ(బోన్ మ్యారో)లోనూ మైక్రోప్లాస్టిక్స్ ఆనవాళ్లు ఉన్నట్టుగా బ్రెజిల్ సైంటిస్టులు గుర్తించారు. సుమారు 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజులో ఉండే మైక్రో, నానో ప్లాస్టిక్ కణాలు రక్త ప్రవాహం ద్వారా ఎముక మజ్జలోకి చేరుతున్నాయని, తద్వారా బోన్ మ్యారో పనితీరుకు ఆటంకం కలిగిస్తున్నాయని కనుగొన్నారు. దీంతో ఎముకలు పటుత్వం కోల్పోవడం, విరిగినప్పుడు తిరిగి పెరగకపోవడం, కీళ్ల వ్యాధులతోపాటు రక్తహీనతకూ దారి తీస్తోందని వారు హెచ్చరించారు. బ్రెజిల్ లోని ‘స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ కాంపినాస్’ మెడికల్ సైంటిస్ట్ రోడ్రిగో బ్యూనో డీ ఒలివిరా నేతృత్వంలోని బృందం ఈ మేరకు ‘ఆస్టియోపొరోసిస్ ఇంటర్నేషనల్’ జర్నల్ లో ప్రచురితమైన 62 ఆర్టికల్స్ ను అధ్యయనం చేసి ఇటీవల నివేదికను సమర్పించింది.
గట్టి ఎముకలు చిత్తవుతున్నయ్..
ఎముక మజ్జలోకి చేరే మైక్రోప్లాస్టిక్స్ ఎముకలను బలహీన పరుస్తుందని ఈ రీసెర్చ్ లో తేలింది. మెక్రోప్లాస్టిక్స్ ఎముకలు, మృదులాస్థి, వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ లలో సైతం పేరుకుపోవడంతోపాటు ఎముక మజ్జలోని మూలకణాల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయని తేల్చారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ మఖ్యంగా ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నం చేసే ఆస్టియోక్లాస్ట్ ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయని, దీనివల్ల ఎముకలు బలహీనపడి, సులభంగా విరిగిపోయే ప్రమాదం (బోలు ఎముకల వ్యాధి లేదా ఆస్టియోపొరోసిస్) పెరుగుతుందని వెల్లడైంది. జంతువులపై జరిపిన ఈ రీసెర్చ్ లో మైక్రోప్లాస్టిక్స్ వల్ల ఎముకలు పటుత్వాన్ని కోల్పోవడం, వాపు రావడం, పెరుగుదల లోపించడం, ఎముకలకు పగుళ్లు రావడం, కీళ్ల వ్యాధులు, రక్త హీనత వంటీ తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని ఈ పరిశోధనలో సైంటిస్టులు గుర్తించారు.
త్వరగా దరిచేరుతున్న వృద్దాప్యం..
ఎముకల్లో చేరే మైక్రోప్లాస్టిక్స్ ఎముకలను బలహీనపర్చడం వల్ల వృద్ధాప్య లక్షణాలు కూడా త్వరగా వస్తాయని ఈ రీసెర్చ్ లో వెల్లడైంది. ఈ మైక్రోప్లాస్టిక్స్ ఎముక కణాల జీవశక్తిని దెబ్బతీసి, వాటి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తేలింది. దీనివల్ల కణాల ఉత్పత్తి తగ్గిపోయి వాటి పునరుత్పత్తి సామర్థ్యాన్ని తొందరగా కోల్పోతాయి. అలాగే, మైక్రోప్లాస్టిక్స్ ఆస్టియోక్లాస్ట్ ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీనివల్ల ఎముకల విచ్ఛిన్నం, ఎముకల నిర్మాణం కంటే వేగంగా జరుగుతుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడి, బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపొరోసిస్) వంటి సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ హార్మోన్లలో మార్పుల వల్ల ఎముకలు బలహీనపడతాయి. కానీ ఇప్పుడు మైక్రోప్లాస్టిక్స్ వల్ల కలిగే అదనపు కణ ఒత్తిడి కారణంగా ఎముకలు బలహీనమయ్యే ప్రక్రియ మరింత స్పీడ్ గా జరుగుతుందని సైంటిస్టులు కనుగొన్నారు.
వారానికి 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి..
మనం రోజూ ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు, దుస్తులు, ఫర్నిచర్, కారు టైర్లు, ఇతర వస్తువుల నుంచి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు విడిపోయి గాలిలో కలుస్తాయి. ఇవి మనం తాగే నీటిలో, తినే ఆహారంలో కలిసిపోయి, మనం శ్వాస తీసుకున్నప్పుడు, తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ప్రతి మనిషి శరీరంలోకి వారానికి దాదాపు 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్ కణాలు ప్రవేశిస్తున్నాయని అంచనా. ఐదు మిల్లీ మీటర్ల కన్నా తక్కువ సైజులో ఉండే ఈ మైక్రో భూతం పేగుల ద్వారా రక్తంలోకి, రక్త ప్రవాహం ద్వారా శరీరంలోకి చేరుతోంది. ఇప్పటికే ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, మెదడు వంటి కీలక భాగాల్లోకి సైతం మైక్రోప్లాస్టిక్స్ చేరుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఇటీవలే ఓ రీసెర్చ్ లో తల్లిపాలలో సైతం మైక్రోప్లాస్టిక్స్ ఆనవాళ్లను గుర్తించారు. తాజాగా ఎముక మజ్జలోనూ వీటి ఆనవాళ్లను గుర్తించడం మరింత ఆందోళనకరంగా మారింది.
ప్లాస్టిక్ వాడకం తగ్గించడమే మార్గం..
ప్రపంచవ్యాప్తంగా ఆస్టియోపొరోసిస్ సంబంధిత ఫ్రాక్చర్లు 2050 నాటికి రెట్టింపు అవుతాయని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మైక్రోప్లాస్టిక్స్ ఎముకల వ్యాధులకు ఎలా కారణమవుతాయో బాగా అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు అభిప్రాపడుతున్నారు. అలాగే, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించవచ్చని, ప్లాస్టిక్‌కు బదులుగా ఎకో ఫ్రెండ్లీ వస్తువులే వాడితే సమస్యను కొంతమేర తగ్గించవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వాలు సింగిల్ -యూజ్ ప్లాస్టిక్ పై సంపూర్ణ నిషేధం విధించి, వ్యర్థాల నిర్వహణను పటిష్టం చేయాలని అంటున్నారు. పరిశ్రమలు ప్లాస్టిక్ కు బదులు ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ ను ఎంచుకుని, తమ ఉత్పత్తుల ద్వారా మైక్రోప్లాస్టిక్స్ విడుదల కాకుండా చూడాలని, ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజల కృషితోనే ప్లాస్టిక్ కు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు.