మిడిల్‌‌ క్లాసోళ్లు గరీబులయిండ్రు

మిడిల్‌‌ క్లాసోళ్లు గరీబులయిండ్రు
  • 3.2 కోట్ల మందికి కరోనా శాపం
  • కరోనాతో మిడిల్‌‌ క్లాస్‌‌ బతుకులు ఆగం
  • పేదలుగా మారిన 3.2 కోట్ల మంది 
  • తాజా స్టడీలో వెల్లడి

కరోనా మిడిల్‌‌ క్లాస్‌‌ ఇండియాను కోలుకోలేని దెబ్బకొట్టింది. వారి బతుకులు భారంగా మారాయి. అంతకుముందు మిడిల్‌‌క్లాస్‌‌ లో ఉన్న మూడు కోట్ల మంది పేదల కేటగిరీలోకి వచ్చారు. వీళ్లంతా ఉపాధికి దూరం కావడమే ఇందుకు కారణం.  రోజువారీ ఆదాయం 10 డాలర్ల (దాదాపు రూ.730) కంటే తగ్గింది. అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్‌‌ సెంటర్‌‌ చేసిన స్టడీ ఈ బాధాకర విషయాలను వెల్లడించింది. 

న్యూఢిల్లీ: గవర్నమెంట్లు ఏళ్ల తరబడి సాధించిన డెవెలప్‌‌మెంట్‌‌ను ఒక చిన్న వైరస్‌‌ నాశనం చేసింది. ముఖ్యంగా మిడిల్‌‌ క్లాస్‌‌ జనాల బతుకులను మరింత బాధాకరంగా మార్చింది. వారి నోటికాడి కూడును లాక్కుంది. కరోనా లాక్‌‌డౌన్‌‌ వల్ల ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువ కావడంతో 3.2 కోట్ల మంది మిడిల్‌‌ క్లాస్‌‌ నుంచి పేదల కేటగిరిలోకి వెళ్లిపోయారు. లక్షల మంది జాబ్స్‌‌, ఉపాధి పోయాయి.  అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్‌‌ సెంటర్‌‌ చేసిన స్టడీ రిపోర్ట్‌‌ ఈ విషయాలను బయటపెట్టింది. ఇందులోని వివరాల ప్రకారం... రోజువారీ ఆదాయం రూ.700–రూ.1,400 మధ్య ఉన్న వారిని మిడిల్‌‌ క్లాస్‌‌గా గుర్తిస్తారు. కరోనా వల్ల ఇలాంటి ఆదాయమున్న వారి సంఖ్య  3.2 కోట్లు తగ్గడంతో మిడిల్‌‌ క్లాస్‌‌ జనాభా 6.6 కోట్ల మందికి చేరింది పేదలు ఇంకా పెరిగారు. వీరి రోజువారీ ఆదాయం రెండు డాలర్లు, అంటే రూ.145 లోపే ఉంటోంది. కరోనా ముందు మిడిల్‌‌ క్లాస్‌‌లో దాదాపు 9.9 కోట్ల మంది ఉండేవారని అంచనా. చైనాతో పోలిస్తే ఇండియాలో పేదల సంఖ్య మరింత పెరిగింది. కరోనా లాక్‌‌డౌన్‌‌తోపాటు పెట్రోల్‌‌ రేట్లు విపరీతంగా పెరగడంతో మిడిల్‌‌ క్లాస్‌‌ జేబుపై భారం ఎక్కువయింది. లీటరు పెట్రోల్‌‌ రేటు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 10 శాతం పెరిగింది. మరికొందరి జీతాలు తగ్గడంతో ఫారిన్‌‌లో జాబ్స్‌‌ కోసం వెతికే వారి సంఖ్య పెరిగింది. 2011 నుంచి 2019 మధ్య మనదేశంలో 5.7 కోట్ల మంది మిడిల్‌‌ క్లాస్‌‌లోకి రాగలిగారు. 
 

చైనా బెటరే..
2020 ఆర్థిక సంవత్సరంలో ఇండియా, చైనా దేశాల ఎకానమిక్‌‌ గ్రోత్‌‌ రేట్‌‌ వరుసగా 5.8 శాతం, 5.9 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ లెక్కగట్టింది. లాక్‌‌డౌన్‌‌ వల్ల ఇండియా ఎకానమీ దారుణంగా నష్టపోవడంతో గ్రోత్‌‌ తొమ్మిదిశాతం, చైనా గ్రోత్‌‌ మాత్రం రెండు శాతం పడిపోతుందని బ్యాంకు అంచనా వేసింది. చైనాలో మిడిల్ క్లాస్‌‌ సంఖ్య కోటి వరకు తగ్గింది. పేదరికం పెద్దగా పెరగలేదు. ఈ ఏడాది మొదట్లో కరోనా కేసులు తగ్గినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో సెకండ్‌‌ వేవ్‌‌ కనిపిస్తోందని హెల్త్‌‌ ప్రొఫెషనల్స్‌‌ అంటున్నారు. అమెరికా, బ్రెజిల్‌‌ తరువాత ఇండియాలోనే అతి ఎక్కువ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ప్రస్తుతం మనదేశంలో 1.14 కోట్ల మంది కరోనా రోగులు ఉన్నారు.  ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా నిర్ణయాలు ప్రకటించింది. ఆత్మనిర్భర్‌‌ ప్యాకేజీ పేరుతో స్టిములస్‌‌ ప్రకటించింది. అన్ని రంగాలు కోలుకోవడానికి భారీగా నిధులు కేటాయించింది. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్‌‌ ఎనిమిది శాతం తగ్గుతుందని అంచనా వేసింది. 2022 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 10 శాతం రికార్డవుతుందని భావిస్తోంది.
 

ప్యూ సెంటర్‌‌ సర్వే హైలైట్స్‌‌
కరోనా కేసుల పెరుగుదలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌‌డౌన్‌‌ విధించడంతో వ్యాపారాలు, ఆఫీసులు, దుకాణాలు మూతబడ్డాయి. 
దీంతో లక్షల మంది నిరుద్యోగులుగా మారారు. ఉపాధి కోల్పోవడంతో వలస కూలీలంతా సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. 
జాబ్స్‌‌ పోవడంతోపాటు కొందరికి జీతాలు తగ్గించడం, పెట్రో రేట్లు విపరీతంగా పెరగడంతో జనం పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. 
ఇలా లక్షల మంది జాబ్స్‌‌ పోవడంతో మిడిల్‌‌ క్లాస్‌‌ జనం సంఖ్య 6.6 కోట్ల వరకు తగ్గింది. పేదల సంఖ్య అదనంగా 7.5 కోట్ల మంది వరకు పెరిగింది. వీరి రోజువారీ ఆదాయం రూ.145, అంతకంటే తక్కువగా ఉంది.