
- ఫైనల్ లిస్టులో పేరుండాలంటే పైసలివ్వాల్సిందేననే కండీషన్
- ఒక్కో ఇంటికి రూ. 25వేల నుంచి రూ. 50వేలు డిమాండ్
- ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగుతున్న పేదలు
- అవకతవకలకు పాల్పడిన ఓ ఉద్యోగి తొలగింపు
- ఇదీ.. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పరిస్థితి..
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామంటూ దళారులు దందా చేస్తున్నారు. ఫైనల్లిస్టులో పేరుండాలంటే పైసలివ్వాల్సిందేననే కండీషన్ పెడుతూ ఒక్కో ఇంటికి రూ. 25వేల నుంచి రూ. 50వేల వరకు వసూలు చేస్తున్నారు. కొందరు స్థానిక నాయకులే ఈ దందాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటూ జిల్లాలోని పలు చోట్ల పేదలు ఆందోళనలు చేపడతున్నారు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడిన ఓ ఉద్యోగిపై ఉన్నతాధికారులు చర్యలు కూడా తీసుకున్నారు.
దశలవారీగా డబ్బులు జమ..
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున ఇస్తోంది. మొదటి దశలో స్థలం ఉండి ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకునేందుకు ఇచ్చే డబ్బులను దశలవారీగా వారి ఖాతాలో జమ చేస్తోంది. దీంతో ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు బేస్ మెంట్స్థాయిలో నిర్మాణం పూర్తి చేసినవారికి ప్రభుత్వం నుంచి రూ.లక్ష వారి ఖాతాలో జమ అయ్యాయి.
వసూళ్ల పర్వం..!
ఇదే అదనుగా కొందరు స్థానిక నాయకులు దళారులుగా మారి పేదలకు ఎరవేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలో పేరు ఉండాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని, ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.25వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు.
డబ్బుల ఇవ్వాలనే కండీషన్ పెట్టడంతో చంద్రుగొండ మండలం తిప్పనపల్లిలో ముగ్గురు లబ్ధిదారులు సీరియస్ కావడం చర్చానీయాంశమైంది. రేపల్లెవాడలో 10 మంది లబ్ధిదారులను రూ. 25వేల చొప్పున ఇవ్వాలంటూ దళారులు డిమాండ్ చేసి, డబ్బులు ఇవ్వకపోతే ‘లిస్టులో మీ పేర్లు ఉంటాయన్న గ్యారెంటీ లేదు’ అని సైతం బెదిరించినట్టు ప్రచారం జరుగుతోంది.
కొత్తగూడెం మున్సిపాలిటీలో 36వార్డులున్నాయి. ఇక్కడ 440 వరకు ఇండ్ల కేటాయించనున్నారు. కొందరు వార్డు ఆఫీసర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వారికి అనుకూలంగా ఉండేవారి పేర్లను జాబితాలో చేరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైసలు ఇచ్చినవారికి, వారి అనుచరులకే ఇండ్లు ఇస్తున్నారని, తమ పరిస్థితేంటని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా కొత్తగూడెం పట్టణంలోని మేదరబస్తీ, కూలీలైన్, బూడిదగడ్డ, సఫాయిబస్తీ, పాత కొత్తగూడెం, ఫ్యూన్ బస్తీల్లో ఉంది.
ఉద్యోగి తొలగింపు..
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఉన్న లబ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శి ఇంటి నిర్మాణానికి సంబంధించి మార్క్ అవుట్ ఇస్తారు. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి అయిన తరువాత తన లాగిన్లో ఫొటో కాప్చర్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ భద్రాచలంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన బిల్లింగ్ఆపరేటర్మాత్రం 18 మంది ఇండ్ల బేస్మెంట్పూర్తి కాకుండానే కంప్లీట్ అయినట్లు ఆన్లైన్లో అప్లోడ్చేశాడు. తర్వాత విషయం వెలుగులోకి రావడంతో అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఎవరికీ పైసా కూడా ఇవ్వొద్దు..
ఇందిరమ్మ ఇండ్ల సాంక్షన్ విషయంలో దళారుల మాటలు నమ్మొద్దు. ఎవరికీఒక్కపైసా కూడా ఇవ్వొద్దు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం దశలవారీగా సాంక్షన్ చేస్తుంది. ఎవరెన్నీ చెప్పినా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగానే ఉంటుంది.
శంకర్, హౌసింగ్ పీడీ