తిరుమల టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ రోడ్డులో అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావమైనట్లు స్థానికులు వెల్లడించారు. ఈ వివాదం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర అనధికార కూల్‌డ్రింక్స్ విక్రేతల మధ్య జరిగినట్లు తెలుస్తోంది.
గంజాయి మత్తులో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ రోడ్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర భయాందోళనలకు గురైన శ్రీవారి భక్తులు పరుగులు తీశారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రాకముందే నిందితులు ఘటన స్థలం నుంచి పరార్ అయ్యారు. ఈ ఘటనపై టీటీడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దాడులకు పాల్పడిన వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
