V6 News

సొంతూర్ల బాటపట్టిన వలస ఓటర్లు.. చార్జీలతో పాటు ఇతర ఖర్చులు పెట్టుకుంటామని క్యాండిడేట్ల హామీ

సొంతూర్ల బాటపట్టిన వలస ఓటర్లు.. చార్జీలతో పాటు ఇతర ఖర్చులు పెట్టుకుంటామని క్యాండిడేట్ల హామీ

యాదాద్రి, వెలుగు : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నిక గురువారం జరగనుండడంతో వలస ఓటర్లంతా గ్రామాలకు చేరుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్యాండిడేట్లు ఓటర్లతో టచ్‌‌‌‌లో ఉండడం, వారిని రప్పించేందుకు రవాణా చార్జీలు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చారు. దీంతో వేలాది మంది వలస ఓటర్లు బుధవారం రాత్రే గ్రామాలకు చేరుకున్నారు.

ఉద్యోగ, ఉపాధి కోసం..

తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారు ఉద్యోగ, ఉపాధి కోసం భారీ సంఖ్యలో వలస వెళ్లారు. ఇందులో చాలా మంది హైదరాబాద్‌‌‌‌లో ఉంటుండగా.. మరికొందరు మహారాష్ట్రలోని ముంబై, భీవండి, షోలాపూర్‌‌‌‌లో నివసిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం వలస వెళ్లిన వారంతా అక్కడే ఉంటున్నా.. ఓట్లు మాత్రం స్వగ్రామంలోనే ఉన్నాయి. ఇలా ఒక్కో పంచాయతీ నుంచి వంద మందికి పైగా ఓటర్లు వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. మేజర్‌‌‌‌ పంచాయతీల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. 

ప్రతీ ఓటు కీలకం కావడంతో..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. ఒక్కోసారి ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయిస్తుంది. దీంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న క్యాండిడేట్లు ప్రధానంగా వలస ఓటర్లపై ఫోకస్‌‌‌‌ చేశారు. ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్ల ఫోన్‌‌‌‌ నంబర్లను సేకరించి.. పోలింగ్‌‌‌‌ రోజు తప్పనిసరిగా రావాలని.. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇందుకు రవాణా చార్జీలు చెల్లించడంతో పాటు ఇతర ఖర్చులు సైతం భరిస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లు రైలు, బస్సుల్లో సొంత గ్రామాలకు తరలివస్తున్నారు. 

ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది ఓటర్లు ఉంటే.. ప్రత్యేకంగా ఓ వెహికల్‌‌‌‌ మాట్లాడుకొని రావాలని.. అందుకు అయ్యే ఖర్చును సైతం చెల్లిస్తామని క్యాండిడేట్లు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే గ్రామాల నుంచి రెగ్యులర్‌‌‌‌గా అప్‌‌‌‌ అండ్‌‌‌‌ డౌన్‌‌‌‌ చేసే వారిని సైతం క్యాండిడేట్లు కలిసి తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. వీరికి సైతం రవాణా చార్జీలతో పాటు ఒక రోజు వేతనం ఇస్తామని చెబుతున్నారు. దీంతో కొందరు ఉద్యోగులు గురువారం సెలవు పెడుతుండగా, మరికొందరు ఓటేసిన తర్వాత డ్యూటీకి వెళ్లేందుకు ప్లాన్‌‌‌‌ చేసుకుంటున్నారు.

కిక్కిరిసిన బస్సులు.. పెరిగిన ట్రాఫిక్‌‌‌‌

ఫస్ట్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ ఎన్నికలు జరగనున్న గ్రామాలకు చెందిన ఓటర్లంతా బుధవారం ఉదయం నుంచే సొంతూళ్లకు పయనమయ్యారు. రద్దీ పెరగడంతో ఆర్టీసీ సైతం హైదరాబాద్‌‌‌‌ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తోంది. ఓటర్లంతా గ్రామాలకు బయలుదేరడంతో ఏ బస్సు చూసినా కిక్కిరిసి కనిపిస్తోంది. హైదరాబాద్‌‌‌‌లో ఉన్న ఓటర్లు ఆర్టీసీ బస్సులతో పాటు సొంత, ప్రైవేట్‌‌‌‌ వాహనాల్లో గ్రామాల్లో చేరుకుంటుండడంతో వరంగల్‌‌‌‌, మహబూబాబాద్‌‌‌‌, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వెళ్లే రోడ్లపై ట్రాఫిక్‌‌‌‌ సైతం భారీగా పెరిగింది.