బస్సులు పెడితే మేం వెళ్లిపోతాం.. రోడ్డెక్కిన వలస కార్మికులు

బస్సులు పెడితే మేం వెళ్లిపోతాం.. రోడ్డెక్కిన వలస కార్మికులు

హైదరాబాద్‌, వెలుగుతమను సొంతూళ్లకు పంపాలంటూ వలస కార్మికులు ఆందోళనబాట పట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి స్టేట్‌ బోర్డర్ల వరకు ఎక్కడ చూసినా వీళ్ల నిరసనలు, ఆందోళనలే కనిపించాయి. వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్​ ఇచ్చింది. దీంతో రైళ్లు, బస్సులు పెడితే వెళ్లిపోతామంటూ ముల్లెమూట సర్దుకొని  రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు వలస కార్మికులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కేంద్రం పర్మిషన్‌ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒకే రైలును పంపి కామ్‌ అయిపోయిందని వారు మండిపడుతున్నారు. లాక్​డౌన్​కారణంగా ఇక్కడ 40 రోజులుగా పనిలేకుండా పోయిందని, తిండికి తిప్పలవుతున్నాయని, ఇక ఉండలేమని అంటున్నారు. ఆదివారం హైదరాబాద్​లోని టోలీచౌకిలో, పెద్దపల్లి జిల్లా రామగుండంలో, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వలస కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

రామగుండంలో లాఠీచార్జి

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌‌ నిర్మాణం కోసం వచ్చిన వలస కార్మికులు తమ రాష్ట్రాలకు వెళ్లిపోతామంటూ ఆందోళనకు దిగారు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఇక్కడ పలు షెల్టర్‌ క్యాంపుల్లో ఉంటున్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు తమకు పాస్​లు ఇవ్వాలంటూ ఆదివారం ఐదు వందల మంది ఎన్టీపీసీ పోలీస్​స్టేషన్​కు వచ్చారు. అప్లికేషన్లు తీసుకోవడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని వాళ్లు ఆగ్రహించి.. ఎఫ్‌సీ క్రాస్‌ రోడ్డు వద్ద రాజీవ్‌ రహదారిపై బైఠాయించారు. అదే టైంలో అటుగా వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కార్మికులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తమను సొంత రాష్ట్రాలకు పంపాల్సిందేనని ఎమ్మెల్యేతో వాళ్లు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉందని, అది రాగానే వారిని పంపిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. చివరకు కార్మికులతో రామగుండం సీపీ, ఇతర పోలీసు అధికారులు మాట్లాడి సొంత రాష్ట్రాలకు పంపేందుకు ప్రభుత్వం గైడ్​లైన్స్​ ఇచ్చిందని, అందరూ అప్లికేషన్లు ఇవ్వాలని సూచించడంతో మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​కు వందలాది మంది కార్మికులు తరలివచ్చారు. తమను సొంత రాష్ట్రాలకు పంపాలని ఇటీవల హైదరాబాద్‌‌‌‌ ఐఐటీ (కంది) క్యాంపస్‌‌‌‌లో వలస కూలీలు పోలీసులపైనే తిరగబడ్డారు.

టోలిచౌకిలో భారీ ఆందోళన

బీహార్‌‌‌‌, ఉత్తరప్రదేశ్‌‌‌‌, ఒడిశా, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ, పశ్చిమ బెంగాల్‌‌‌‌ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఆదివారం హైదరాబాద్​లోని టోలిచౌకీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లంగర్‌‌‌‌హౌస్‌‌‌‌, టోలిచౌకి, గోల్కొండ, మెహదీపట్నం, కార్వాన్‌‌‌‌, షేక్‌‌‌‌పేట్‌‌‌‌, బంజారాహిల్స్‌‌‌‌, జూబ్లీ హిల్స్‌‌‌‌, మణికొండ తదితర ప్రాంతాల్లో ఉంటూ ఇన్నాళ్లు వివిధ పనులు చేసుకునే వీళ్లందరికీ లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో పనులు కరువయ్యాయి. వీళ్లంతా ఆదివారం పొద్దున్నే టోలిచౌకి చౌరస్తా మీదుగా సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు బయల్దేరారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు.  ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆందోళన కొనసాగింది. లౌక్‌‌‌‌డౌన్‌‌‌‌తో తమకు పనిలేదని, తినడానికి తిండి కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బియ్యం, రూ. 500 కూడా అందలేదని చెప్పారు. ఇక్కడ ఉండలేమని, వెళ్లనివ్వాలని పట్టుబట్టారు. వెస్ట్‌‌‌‌ జోన్‌‌‌‌ డీసీపీ శ్రీనివాస్‌‌‌‌ అక్కడికి చేరుకుని కార్మికులతో మాట్లాడారు. అందరి ఆధార్‌‌‌‌ కార్డులు, వివరాలు పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో ఇస్తే రెండు, మూడు రోజుల్లో పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని హామీ ఇచ్చారు. జీహెచ్‌‌‌‌ఎంసీ జోనల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌తో మాట్లాడి కార్మికులకు భోజనం పెట్టేందుకు అన్నపూర్ణ క్యాంటిన్‌‌‌‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఒక్క రైలుతోనే సరిపెడితే ఎట్ల?

హైదరాబాద్‌‌‌‌లోని పలు ప్రాంతాల్లో లక్షలాది మంది వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐఐటీ క్యాంపస్‌‌‌‌లో ఆందోళన చేసిన వారి కోసం ఒక్క రైలు పంపి ప్రభుత్వం ఊరుకుందని కార్మికులు ఆరోపించారు. ఆ రైలులో కొంత మంది మాత్రమే వెళ్లగా ఇంకా పెద్ద సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. మళ్లీ రైలు వేస్తే వెళ్లిపోతామని అధికారులతో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్‌‌‌‌లోని మిగతా ప్రాంతాల్లోనూ కార్మికులు బస్సులు, రైళ్ల ద్వారా వెళ్లిపోవడానికి ఎదురు చూస్తున్నారు.

రైళ్లు, బస్సులు రెడీగా ఉన్నా..!

వలస కూలీలు, కార్మికులను తరలించడానికి సౌత్​ సెంట్రల్​ రైల్వే, టీఎస్‌‌‌‌ ఆర్టీసీ సిద్ధంగా ఉన్నాయి. కార్మికులు ఎవరూ స్టేషన్లకు రావొద్దని, రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు శ్రామిక్‌‌‌‌ రైళ్లు నడుపుతామని సౌత్​ సెంట్రల్​ రైల్వే తెలిపింది. ఇక టీఎస్‌‌‌‌ ఆర్టీసీలో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికే అత్యవసర సేవల సిబ్బందిని రవాణా చేస్తోంది. సరకు రవాణాకు కార్గో సర్వీసులను నడిపిస్తున్నారు. తాజాగా కేంద్రం గైడ్​లైన్స్​తో, ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాలతో డిపోకు 10 బస్సులను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 1200 బస్సుల వరకు కార్మికులను తరలించడానికి రెడీగా ఉంచారు. బస్సులను పూర్తిగా శానిటైజ్‌‌‌‌ చేశారు. ప్రభుత్వం ఏ క్షణాన ఆదేశించినా వారిని తరలిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వాళ్లు సొంతూళ్లకు పోవడానికి పాస్‌‌‌‌ల కోసం పోటీపడుతున్నారు. ఆదివారమే పోలీస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఈ – పాస్‌‌‌‌ అప్లికేషన్లు మొదలు పెట్టింది. ఎమర్జెన్సీ పాసులతో పాటు ఇంటర్‌‌‌‌ స్టేట్‌‌‌‌, ఇంట్రా స్టేట్‌‌‌‌ పాస్‌‌‌‌లు ఈ-పాస్‌‌‌‌ ద్వారా జారీ చేస్తున్నారు. tspolice portal లోని డిజిటల్ పాస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా లాక్‌‌‌‌డౌన్  పాసులు ఇస్తున్నారు.  http://tsp.koopid.ai/epass నుంచి ఈ-పాస్ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఆదివారం 12 వేల అప్లికేషన్లు కరెక్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో వచ్చాయని, వాటిలో 7,740 పాస్‌‌‌‌లు జారీ చేశామని పోలీస్‌‌‌‌ ఐటీ సెల్‌‌‌‌ ఆఫీసర్లు చెప్పారు.  మిగతావి సోమవారం పరిశీలిస్తామన్నారు.

ఖమ్మం, భద్రాద్రిలో

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని గ్రానైట్‌‌‌‌ పరిశ్రమలో పనిచేసే 200 మంది కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామంటూ ధర్నాకు దిగారు. ఆకలితో అలమటిస్తున్నామని, ఊళ్లకు పోవడానికి కూడా డబ్బులు లేవని, ప్రభుత్వమే తమను పంపాలంటూ పోలీసులను వేడుకున్నారు. గ్రానైట్‌‌‌‌ వ్యాపారులు పెండింగ్‌‌‌‌ జీతాలు కూడా ఇవ్వలేదని  వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఒక్క రోజు అవకాశం ఇస్తే గ్రానైట్‌‌‌‌ వ్యాపారులతో మాట్లాడి వెహికల్స్‌‌‌‌ ఏర్పాటు చేసి పంపుతామని పోలీసులు హామీ ఇవ్వడంతో కూలీలు ఆందోళన విరమించారు. ఖమ్మం జిల్లాలో మధ్యప్రదేశ్‌‌‌‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 43 వేల మంది వలస కార్మికులు ఉన్నారని జిల్లా అధికారులు లెక్కగట్టారు. వీరిలో 10 వేల మందికి పైగా ఇప్పటికే వెళ్లిపోయారు. సొంతంగా వాహనాలు సమకూర్చుకుంటే పాస్‌‌‌‌లు ఇచ్చి ఏ ఇబ్బంది లేకుండా పంపుతామని కలెక్టర్‌‌‌‌ ఆర్వీ కర్ణన్‌‌‌‌  చెప్పారు. ఏన్కూర్‌‌‌‌లో కాలినడకన వెళ్తున్న కార్మికులతో కలెక్టర్‌‌‌‌  మాట్లాడారు. రెండు రోజుల్లో వెహికల్​ ఏర్పాటు చేస్తామని, ఎవరూ నడిచి వెళ్లొద్దని ఆయన నచ్చజెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులోని అశ్వారావుపేట చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌ వద్ద వాహనాల్లో వెళ్తున్న వలస కార్మికులను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. తమను ఏపీలోకి అనుమతించాలని కార్మికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శనివారం అర్ధరాత్రి నుంచి కార్మికులు చెక్‌‌‌‌పోస్టు వద్దే పడిగాపులు కాస్తున్నారు.

సికింద్రాబాద్​కు  పోటెత్తిన కార్మికులు

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​కు ఆదివారం వలస కూలీలు భారీగా చేరుకున్నారు. శ్రామిక్​రైల్​ పేరుతో రైల్వే శాఖ వివిధ ప్రాంతాలకు రైళ్లు నడుపుతున్నదన్న ప్రచారంతో కూకట్ పల్లి, ఎల్​బీనగర్​, ఉప్పల్​, అల్వాల్​ తదితర ప్రాంతాలనుంచి వందలాది మంది అక్కడికి వచ్చారు. అలర్టయిన పోలీసులు వెంటనే రైల్వేస్టేషన్​ లోపలికి వెళ్లే అన్ని గేట్లను మూసివేశారు. తమను స్టేషన్​లోకి అనుమతించాలంటూ కూలీలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ  స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారికి పోలీసులు పరిస్థితులు వివరించి నచ్చజెప్పి వెనక్కి పంపారు. సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​నుంచి ఎలాంటి రైళ్లు నడవడం లేదని, ఎవరినైనా స్వస్థలాలకు పంపాలంటే.. ప్రభుత్వ నిర్ణయం మేరకే ఉంటుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.