పాలమూరులో వలస ఓట్లు పోయినట్లే !

పాలమూరులో వలస ఓట్లు పోయినట్లే !
  • మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌లో కీలకం కానున్న వలస ఓటర్లు
  •     సొంతూళ్లకు రప్పించేందుకు ఏర్పాట్లు చేయని క్యాండిడేట్లు
  •     ఖర్చులు పెరుగుతాయన్న భయంతో ముందుకు రాని లీడర్లు
  •     పోలింగ్‌‌‌‌కు దూరం కానున్న పాలమూరు ఓటర్లు

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : ప్రతి ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన పాలమూరు వలస ఓటర్లు ఈ సారి ఓటింగ్‌‌‌‌కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతీసారి వలస ఓటర్లను తీసుకొచ్చే పార్టీలు ఇప్పుడు వారిపై దృష్టి పెట్టడం లేదు. పోలింగ్‌‌‌‌కు ఇంకా ఒక్క రోజు మాత్రమే టైం ఉన్నప్పటికీ వలస ఓటర్లను సొంతూళ్లకు తీసుకొచ్చేందుకు ఏ పార్టీ క్యాండిడేట్‌‌‌‌ కూడా ప్రయత్నం చేయడం లేదు. 

అరేంజ్‌‌మెంట్స్‌‌‌‌ చేయట్లే...

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ పరిధిలో కొడంగల్‌‌‌‌, మక్తల్, నారాయణపేట, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, షాద్‌‌‌‌నగర్‌‌‌‌, దేవరకద్ర, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో నారాయణపేట, కొడంగల్‌‌‌‌, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో సుమారు 1.20 లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. వీరంతా ముంబై, పూణె, భీవండి ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఎన్నికల కోసం సొంతూళ్లకు వచ్చి ఓట్లు వేయాలంటే వీరు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కో వ్యక్తికి చార్జీలు, ఇతర ఖర్చులు కలిసి సుమారు రూ.2 వేల వరకు అవుతాయి. దీంతో ప్రధాన పార్టీల క్యాండిడేట్లే ఈ ఓటర్లను స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. ప్రైవేట్‌‌‌‌ ట్రావెల్స్‌‌‌‌ బస్సులు, ఆర్టీసీ బస్సులు, తుఫాన్‌‌‌‌ వంటి వెహికల్స్‌‌‌‌ను సమకూర్చి వలస ఓటర్లను తీసుకొచ్చేవారు. కానీ ప్రస్తుతం ఏ పార్టీ లీడర్‌‌‌‌ కూడా వలస ఓట్లపై చప్పుడు చేయడం లేదు. వారిని ఊళ్లకు తీసుకొచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. పోలింగ్‌‌‌‌కు ఒక్క రోజే టైం ఉన్నా వలస ఓటర్లకు తీసుకురావాలా ? వద్దా ? అనే విషయంపై ఇప్పటివరకు ఎవరూ నిర్ణయం 
తీసుకోవడం లేదు.

ఖర్చు తగ్గించుకునేందుకు...

ప్రధాన పార్టీల క్యాండిడేట్లు ఎన్నికల ఖర్చును తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో వలస ఓటర్లను గ్రామాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేయడం లేదని పలువురు అంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వలస ఓటర్లను సొంతూళ్లకు రప్పించేందుకు భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టారు. అప్పుడు పోటీలో ఉన్న కొందరు సిట్టింగ్‌‌‌‌ ఎమ్మెల్యేలు స్వయంగా వలస ఓటర్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లి ఆత్మీయ సమ్మేళనాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు. ఓటు వేసేందుకు గ్రామాలకు రావాలని, రాను పోను చార్జీల కింద రూ.1,200 ఇవ్వడంతో పాటు రెండు రోజులు గ్రామాల్లో ఉండేందుకు లిక్కర్, విందు ఏర్పాట్లు చేశారు. దీంతో ఒక్కో వలస కూలీ కోసం సుమారు రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు ఖర్చు చేశారు. అప్పుడు వలస కూలీల కోసమే ఒక్కో క్యాండిడేట్‌‌‌‌ రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేశారని సమాచారం. ప్రస్తుతం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు పార్లమెంట్‌‌‌‌ బరిలో ఉన్న క్యాండిడేట్లు వెనుకాడుతున్నారు. వలస ఓటర్లు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని  గ్రామాలకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటివరకు ఏ క్యాండిడేట్‌‌‌‌ కూడా తమకు ఫోన్‌‌‌‌ చేయలేదని, గ్రామానికి వచ్చి ఓటు వేయాలని అడగలేదని ముంబైలో ఉంటున్న కొడంగల్, మద్దూరు, కోస్గి ప్రాంతాలకు చెందిన కొందరు వలస కూలీలు చెప్పారు.

కీలకం కానున్న వలస ఓట్లు

పాలమూరు నుంచి వలస వెళ్లిన వారిలో 90 శాతం మంది గిరిజనులే ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో వీరే క్యాండిడేట్ల గెలుపోటములను శాసిస్తున్నారు. వీరి ఓట్లు ఎవరికి వన్‌‌‌‌సైడ్‌‌‌‌గా పడతాయో ఎక్కువ సార్లు ఆ క్యాండిడేట్‌‌‌‌ గెలుస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే రిజల్ట్‌‌‌‌ వచ్చింది. ప్రస్తుతం మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్‌‌‌‌ ఫైట్‌‌‌‌ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఓటు కీలకం కానుంది. పోలింగ్‌‌‌‌కు ఇంకా ఒక్క రోజే టైం ఉండడంతో  వలస ఓటర్లను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తారా ? లేదా ? అనే చర్చ జోరుగా సాగుతోంది.