
చిన్నచింతకుంట, వెలుగు : హైస్కూల్ స్టూడెంట్లకు మధ్యాహ్న భోజనం సమయంలో వడ్డించిన పప్పులో కప్ప కనిపించింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్‌కోట ప్రభుత్వ హైస్కూల్‌లో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే...
బుధవారం మధ్యాహ్నం హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్లు పప్పు వేసుకునేందుకు వెళ్లింది. పప్పు వేసుకుంటున్న క్రమంలో అందులోంచి ఓ కప్ప ప్లేట్‌లో పడడంతో గమనించిన స్టూడెంట్ గట్టిగా అరవడంతో మిగతా స్టూడెంట్లు తమ ప్లేట్లలోని భోజనాన్ని పడేసి విషయాన్ని టీచర్ల దృష్టికి తీసుకెళ్లారు.
తర్వాత స్టూడెంట్లు తమ ఇండ్లకు వెళ్లిపోయి భోజనం చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మురళీకృష్ణ స్కూల్‌కు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో కప్ప వచ్చిన ఘటనపై ఎంఈవోను వివరణ అడుగగా.. ఏదో జరిగిందంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.