ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా గుడిపల్లో దారుణం

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..   నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా గుడిపల్లో దారుణం
  •     యాక్సిడెంట్‌‌‌‌గా చిత్రీకరించే ప్రయత్నం

 కందనూలు, వెలుగు : నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా గుడిపల్లిలో ఈ నెల 12న జరిగిన వ్యక్తి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని అతడి భార్యే ప్రియుడితో కలిసి చంపించి, యాక్సిడెంట్‌‌‌‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌‌‌‌యాదవ్‌‌‌‌ బుధవారం వెల్లడించారు. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మైనగాని రాములుకు పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లకు చెందిన మానసతో 14 ఏండ్ల కింద వివాహమైంది. ఐదు నెలల కింద ఇంట్లో బంగారం పోవడంతో వాటి వివరాలు తెలుసుకునేందుకు ఇద్దరూ కలిసి పెద్దముద్దనూరు గ్రామానికి చెందిన సురేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో మానస, సురేశ్‌‌‌‌ మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం రాములుకు తెలియడంతో భార్య మానసను మందలించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. తమ సంబంధం కొనసాగాలంటే భర్త రాములును హత్య చేయాలని నిర్ణయించుకొంది. ఈ నెల 08న గుడిపల్లిలో బంధువుల పెండ్లి ఉండడంతో రాములు కుటుంబంతో సహా వెళ్లాడు. ఈ విషయాన్ని మానస తన ప్రియుడు సురేశ్‌‌‌‌కు తెలిపింది. రాములును హత్య చేసేందుకు సహకరిస్తే రూ. 2.80 లక్షల చొప్పున ఇస్తానని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లకు చెందిన బాలాపీరు, అతని బావమరిది హనుమంతును సురేశ్‌‌‌‌ ఒప్పించాడు. ఈ నెల 12న దావత్‌‌‌‌ ఇస్తానని సురేశ్‌‌‌‌ పెద్దముద్దనూరులో పొలం వద్దకు రాములు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగిన తర్వాత కారులో ఎక్కించుకొని గుడిపల్లి కేఎల్‌‌‌‌ఐ కాల్వ వద్దకు తీసుకువచ్చి అక్కడి మళ్లీ మద్యం తాగారు. తర్వాత రాములు ముఖానికి ప్లాస్టర్‌‌‌‌ చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చంపేశారు. అనంతరం యాక్సిడెంట్‌‌‌‌ జరిగినట్లు చిత్రీకరించేందుకు రాములు డెడ్‌‌‌‌బాడీ పక్కనే బైక్‌‌‌‌పను పడేసి, అతడి ముఖానికి గాయాలు చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అయితే రాములు మృతితో కోడలిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడి తండ్రి పాండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి మానసతో పాటు సురేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌, బాలపీరు, హనుమంతును అరెస్ట్‌‌‌‌ చేశారు.