
ముంబై: బీఎమ్‌డబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడైన మిహిర్ షాకు కోర్టు జులై16 వరకు పోలీసు కస్టడీ విధించింది. దీంతో బుధవారం నుంచి ఏడు రోజులపాటు మిహిర్ షాను ముంబై పోలీసులు విచారించనున్నారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలను నిందితుడి నుంచి రాబట్టనున్నారు. మంగళవారం మిహిర్ షాను పోలీసులు అరెస్ట్ చేశారు.
బుధవారం ముంబైలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్పీ భోసలే ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా.. మిహిర్ షా క్రూరమైన నేరానికి పాల్పడినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడు తప్పించుకోవడానికి ఎవరు సహకరించారనేది తేలాలని చెప్పారు.
కారు నంబర్ ప్లేట్ ఇంకా రికవరీ కానందున నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని కోరారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు..మిహిర్ షాను జులై16 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. కాగా, బీఎండబ్ల్యూ కారును తానే నడిపానని, అయితే మద్యం మాత్రం సేవించలేదని మిహిర్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు..
నిందితుడి తండ్రి, శివసేన(షిండే వర్గం) నాయకుడు రాజేష్ షాను పార్టీ సస్పెండ్ చేసింది.
లవర్‌కు 40 సార్లు ఫోన్
ఘటన తర్వాత మిహిర్ తన లవర్ కు 40 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను కారుతో గుద్ది చంపిన తర్వాత ఆటోలో గోరేగావ్‌లోని తన లవర్ ఇంటికి వెళ్లిన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అందువల్ల ప్రియురాలిని కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. జులై 7న మిహిర్ షా బీఎమ్‌డబ్ల్యూ కారుతో స్కూటీని ఢీకొట్టడంతో 45 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. దాదాపు 72 గంటల తర్వాత నిందితుడిని
ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.