మిల్కాసింగ్ గురించి తెలియని విషయాలెన్నో..

మిల్కాసింగ్ గురించి తెలియని విషయాలెన్నో..

పరుగుల వీరుడు, లెజండరీ అథ్లెట్‌ మిల్కాసింగ్‌ (91) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన కోలుకున్న తర్వాత వచ్చిన సమస్యలతో చండీగర్‌లోని పీజీఐఎంఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయనకు శుక్రవారం రాత్రి ఒక్కసారిగా జ్వరం పెరగి.. ఆక్సిజన్ లెవల్స్ తగ్గినట్లు వైద్యులు తెలిపారు. మిల్కాసింగ్‌కు మే 20 కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత లక్షణాలు ఎక్కువ కావడంతో మే 24న మొహాలిలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం పరిస్థితి విషమించడంతో జూన్ 3న చండీగర్‌లోని పీజీఐఎంఆర్‌కు తరలించి ఐసీయూలో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ.. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు చనిపోయారు.

మిల్కాసింగ్ 1932 నవంబర్‌ 20న పాక్‌ పంజాబ్‌లోని గోవింద్‌పురలో జన్మించాడు. ఆయన సిక్కు రాథోడ్‌ రాజపుత్రుల కుటుంబానికి చెందినవాడు. భారతదేశ క్రీడా ఆణిముత్యంగా మిల్కాసింగ్‌కు మంచి గుర్తింపు ఉంది. ఆయన 1951లో భారత సైన్యంలో చేరారు. సికింద్రాబాద్‌లో తొమ్మిదేళ్లు శిక్షణ పొందిన మిల్కాసింగ్.. ఆర్మీ నిర్వహించిన పరుగుల పోటీలో ఆరో స్థానంలో నిలిచారు.

మిల్కాసింగ్‌కు వ్యాయామ క్రీడల్లో ఆర్మీ ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఆర్మీలో చేరాక మూడు సంవత్సరాలు షూస్‌ లేకుండా పరుగెత్తిన మిల్కాసింగ్‌.. 
పరుగు పోటీల్లో అరుదైన ఘనత సాధించాడు. కేంద్ర ప్రభుత్వం 1959లో మిల్కాసింగ్‌ను పద్మశ్రీతో సత్కరించింది. ఆ తర్వాత క్రీడలలో ఆయన చేసిన కృషికి గానూ.. ప్రభుత్వం ఆయనకు 2001లో అర్జున పురస్కారం ప్రకటించింది. ఆ అవార్డును  మిల్కాసింగ్‌ తిరస్కరించారు. రిటైర్డ్‌ క్రీడాకారుల కోసం మిల్కాసింగ్ ట్రస్ట్‌ నెలకొల్పారు. మిల్కాసింగ్‌ జీవితం ఆధారంగా భాగ్ మిల్కా భాగ్ చిత్రం తెరకెక్కింది. అందులో ఫర్హాన్ అక్తర్ మిల్కాసింగ్ పాత్రను పోషించాడు.

1958 జాతీయ క్రీడల్లో మిల్కాసింగ్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. కామన్‌వెల్త్‌ పోటీల్లో అరుదైన ఘనత సాధించాడు. మిల్కా 46.6 సెకన్లలో 440 యార్డ్స్‌ పరిగెత్తి స్వర్ణం గెలిచాడు. భారత్‌ తరపున స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా మిల్కా గుర్తింపు పొందాడు. నాలుగు దశాబ్దాలుగా మిల్కాసింగ్‌ రికార్డు చెక్కు చెదరలేదు. మిల్కాసింగ్‌ను నాటి పాక్‌ ప్రధాని అయూబ్‌ ఖాన్‌  ఫ్లయింగ్‌ సిక్‌గా అభివర్ణించారు. మిల్కా  80 రేసుల్లో పాల్గొని 77 విజయాలు సాధించారు.