పొట్టి వడ్లలో నూక శాతం ఎక్కువట.. అలాగైతే నష్టపోతరట

పొట్టి వడ్లలో నూక శాతం ఎక్కువట..  అలాగైతే నష్టపోతరట
  • వచ్చే ఏడాది నుంచి పొట్టి రకాలు కొనరట
  • యాదాద్రి జిల్లాల్లో మిల్లర్ల హుకుం
  • రైతుల అవగాహన కోసం పాంప్లెంట్స్​

యాదాద్రి, వెలుగు: ‘రైతులారా.. ఒక కర్ర, రెండు కర్రలు, శుభం, జ్వాల, టట్​కం, మధుర 404,  మహేంద్ర 3030, కావేరి 468, రాశి113, 3291 లాంటి పొట్టి రకాలను సాగుచేయకండి.. వాటిలో నూకశాతం ఎక్కువ ఉండడం వల్ల మాకు నష్టం వస్తున్నది.. వచ్చే వానకాలం నుంచి వాటిని ఎట్టి పరిస్థితుల్లో దిగుమతి చేసుకోం.. అందుకే ఈ వానాకాలంలో పొడుగు గింజ రకాలైన ఎంటీయూ1156, 1010, 1290, కేఎన్​ఎం118, జేజీఎల్​24423, ఐఆర్​64 లాంటి వాటినే పండించండి.  వాటినే తీసుకుంటాం..’  ఇదీ యాదాద్రి భువనగిరి జిల్లా రైతులకు అక్కడి రైస్​మిల్లర్స్​అసోషియేషన్​ అల్టిమేటం.  గతంలో ఒకటి, రెండు సార్లు ఇలాంటి షరతుల సాగుకు ప్రయత్నించి రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.  కానీ తాజాగా మిల్లర్లే రైతులకు ఏ పంట సాగుచేయాలో సూచించడం  చర్చనీయాంశంగా మారింది. 

పొట్టి రకాలతో నష్టమొస్తున్నదని.. 

బాయిల్డ్​ బియ్యం సేకరణ సాగినన్ని రోజులు రైతులు ఎలాంటి రకాలు సాగు చేసినా మిల్లర్లు పట్టించుకోలేదు. ఎక్కువ దిగుబడి వస్తుండడంతో రైతులు హైబ్రిడ్​ రకాలను సాగు  చేస్తూ వస్తున్నారు. గడిచిన మూడేండ్లుగా బాయిల్డ్​ బియ్యంపై సర్కారు వెనక్కి తగ్గి, రా రైస్  సేకరణకు మొగ్గుచూపుతున్నది.  దీంతో వడ్ల సేకరణలో కీలకంగా ఉన్న మిల్లింగ్​ వ్యవస్థపై కొంత ఎఫెక్ట్​ పడింది. బాయిల్డ్​ రైస్​కు అనుమతివ్వాలని కోరినా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. కానీ రైతులు మాత్రం ఎప్పట్లాగే శుభం, కావేరి, జ్వాల వంటి పలు రకాల హైబ్రిడ్​ వెరైటీలు సాగు చేస్తున్నారు. కానీ ఈ వడ్లు పొట్టిగా ఉంటున్నాయని, 5.01 ఎంఎం నుంచి 5.05 ఎంఎం సైజుకు మించడం లేదని మిల్లర్లు అంటున్నారు.  పొట్టి రకాల వడ్ల పైపొట్టు మందంగా ఉండి తూకం ఎక్కువగా వస్తుందని, పైగా నూక పెరిగి.. బియ్యం శాతం తక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు. బాయిల్డ్​ అయితే పొట్టి రకం వడ్లు అయినా నూక శాతం తక్కువగా ఉండేదని,  రా రైస్​ కారణంగా నూక శాతం పెరిగి తాము నష్టపోతున్నామని, ఈ రకమైన బియ్యానికి అంతర్జాతీయంగా మార్కెట్ కూడా లేదని మిల్లర్లు చెబుతున్నారు.

పొడుగు రకాలే వేయండి..

పొట్టి రకాల వల్ల మార్కెట్​లో వడ్లకు డిమాండ్​ అనుకున్నంత రావడం లేదన్నది మిల్లర్ల మాట. అందుకే పొడుగు రకాలను సాగు చేయాలని రైతులకు మిలర్లు సూచిస్తున్నారు. తాజాగా యాదాద్రి జిల్లా రైస్​ మిల్లర్లు కరపత్రాలు రిలీజ్​ చేశారు. ఎఫ్​సీఐ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పొడుగు రకం విత్తనాలతో సాగు చేసిన వడ్లనే కొనుగోలు చేస్తామని ఇందులో స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ సాగు చేసిన పొట్టి రకాలను పక్కన పెట్టి.. రానున్న  వానాకాలం సీజన్​లో పొడుగు రకాలైన ఎంటీయూ 1156, 1010, 1290, కేఎన్​ఎం 118, జేజీఎల్​ 2442 వంటి రకాలను సాగు చేయాలని కోరారు. వానాకాలం సీజన్​లో ఇటువంటి రకాలనే తాము కొంటామని, పొట్టి రకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయబోమని మిలర్లు తేల్చిచెప్పారు. కాగా, ఎలాంటి వడ్లు సాగుచేయాలో సర్కారుకు బదులు మిల్లర్లు చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పొడుగు రకాలే కొనుగోలు చేస్తం..

పొట్టి రకాలతో  మాకు నష్టం కలుగు తోంది.  వాటి వల్ల నూక శాతం ఎక్కువగా వస్తోంది. అందుకే ఇక నుంచి పొడుగు రకాల వడ్లనే కొనుగోలు చేస్తం.- పసుపునూరి నాగభూషణం, రైస్​ మిలర్ల ప్రతినిధి, యాదాద్రి