జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బకాయిలపై మూడేండ్లుగా మొండికేస్తున్న మిల్లర్లు

 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బకాయిలపై మూడేండ్లుగా మొండికేస్తున్న మిల్లర్లు
  •      రూ.27.61 కోట్లకు రూ.4.11 కోట్లే వసూలు
  •     మూడు దఫాలుగా రికవరీ నోటీసులు జారీ
  •     బకాయిల రికవరీపై ఆఫీసర్ల నిర్లక్ష్యం 

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టెండర్ ధాన్యం మాయం చేసిన మిల్లర్ల నుంచి కోట్లాది రూపాయల బకాయిల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. రెవెన్యూ అధికారులు ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చినా ఫలితం లేదు. ఏండ్లుగా బకాయిలు చెల్లించకుండా మిల్లర్లు తప్పించుకు తిరుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2022-–23 యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన 12,346.23 మెట్రిక్ టన్నుల ధాన్యం  కాగా, మిట్లర్లు  ప్రభుత్వానికి రూ.27.61 కోట్ల బకాయిలు ఉన్నారు. మూడేండ్లుగా ఈ మొత్తాన్ని ఆఫీసర్లు మిల్లర్ల నుంచి రికవరీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పలుకుబడి, జిల్లా స్థాయి అధికారులతో సాన్నిహిత్యం కారణంగా కొందరు మిల్లర్లు బకాయిల చెల్లింపును ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

మూడేండ్లలో రూ.4.11 కోట్లే వసూలు..

జిల్లాలోని 17 రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న 12,346.23 మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యాన్ని 2022-–23లో టెండర్ ద్వారా విక్రయించినప్పటికీ, కాంట్రాక్టర్ సకాలంలో తరలించలేదు. దీంతో రూ.27.61 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. మూడేండ్లు గడిచినా మిల్లర్లు బకాయిలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలోని ఆరు మిల్లులను బ్లాక్‌‌‌‌‌‌‌‌లిస్టులో చేర్చి వానాకాలం ధాన్యం కేటాయింపులను నిలిపివేశారు. టెండర్ ధాన్యం బకాయిల వసూళ్లపై దృష్టి సారించిన పౌరసరఫరాల శాఖ, మిల్లుల్లో ధాన్యం లేకపోవడాన్ని ‘మిస్సింగ్’గా పరిగణిస్తూ క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.2,441.90 చొప్పున చెల్లించాలని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 16వ తేదీలోగా బకాయిలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అదనంగా 25 శాతం పెనాల్టీతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని మూడు దఫాలుగా నోటీసులు ఇచ్చినా మిల్లర్ల స్పందన కనిపించడం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు.

ఐదు మిల్లర్ల నుంచే వసూళ్లు..

ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ధాన్యం కేటాయింపులు నిలిపివేయడంతో బయ్యారంలోని అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్, చెల్పూర్​ హరిహర ట్రేడర్స్, ఇప్పలపల్లి వాగ్దేవి ఇండస్ట్రీస్, కొండంపేట వెంకటేశ్వర ఇండస్ట్రీస్, గొర్లవీడు వెంకటేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ నుంచి మొత్తం రూ.4.11 కోట్లు సర్కార్​ ఖజానాకు చేరాయి. ఇంకా 12 మిల్లర్ల నుంచి రూ.23.50 కోట్లు వసూలు కావాల్సి ఉంది. రూ.3 కోట్లకు పైగా బకాయిలు ఉన్న ఓ మిల్లర్ తన పలుకుబడితో జిల్లాస్థాయి ఆఫీసర్లను మేనేజ్​చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అధికారులు నోటీసులు జారీ చేయడం వరకు మాత్రమే పరిమితమై, వసూళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. 2022 నుంచి కాటారం మండలంలోని త్రీయార్స్ మిల్, మొగుళ్లపల్లిలోని అన్నపూర్ణ మిల్, రేగొండ మండలంలోని దుర్గాభవాని మిల్లులకు చెందిన మొత్తం రూ.12.76 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయి. 

ఈ మిల్లులకు ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు బకాయిలు రాబట్టలేకపోయారు. ప్రభుత్వానికి కోట్లలో బకాయిలు ఉన్న మిల్లర్లు తమ కుటుంబ సభ్యుల పేర్లతో కొత్త మిల్లులు ఏర్పాటు చేసి సీఎంఆర్ మిల్లింగ్ పనులు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, జిల్లాలోని డిఫాల్ట్ మిల్లర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతీనిధులతో టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్ ఈనెల 3న కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించి, 100శాతం బియ్యం, 25 శాతం పెనాల్టీ వసూలు, వానాకాలం 2022- 23లో వేలం వేసిన వడ్ల రికవరీపై సమీక్షించారు. బాకీవున్న బియ్యం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని మిల్లర్లని ఆదేశించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు, రెవెన్యూ రికవరీ యాక్ట్ నమోదు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.

సీరియస్ యాక్షన్ తీసుకుంటాం

టెండర్ ప్యాడీ బకాయిలు ఉన్న మిల్లర్లు డెడ్ లైన్ లోగా చెల్లించాలి. మిల్లర్ల వారీగా మిస్సింగ్ అయిన ధాన్యం బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేశాం. ఆగస్టు 16 లోపు చెల్లించకుంటే ఇప్పుడున్న రేట్ మారుతుందని మిల్లర్లకు వివరంగా తెలియజేశాం. బకాయి సొమ్ముతో పాటు వడ్డీ, పెనాల్టీ పడుతుంది. గడవులోగా మిల్లర్ల నుంచి బకాయిలు రాబడుతాం.   

- రాములు సివిల్ సప్లయ్ డీఎం,భూపాలపల్లి